రాష్ట్రీయం

బెల్లం వ్యాపారులకు ఎక్సైజ్ ఎదురు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 26: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో దండిగా డబ్బు సంపాదించుకోవాలని ఆశలు పెట్టుకున్న బెల్లం వ్యాపారుల ఆశలు అడియాశలయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బెల్లం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ అమలు చేస్తున్న నిషేధాన్ని అవకాశంగా తీసుకుని అడ్డగోలు ధరలతో బెల్లం అమ్ముకోవచ్చనుకున్న వ్యాపారులు భారీగా బెల్లం స్టాకు చేశారు. అయతే, ఎక్సైజ్‌శాఖ తాజా నిర్ణయంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాటుసారా భారీగా జరుగుతుండటంతో అరికట్టే ప్రయత్నంలో భాగంగా ఎక్సైజ్ శాఖ మొదట నల్లబెల్లంపై నిషేధం విధించింది. దాంతో నాటుసారా తయారీదారులు ఇళ్లలో వాడుకునే బెల్లంతో సారా కాయటం మొదలుపెట్టడంతో ఎక్సైజ్ అధికారులు ఈ బెల్లం అమ్మకాలపైనా నిషేధం విధించారు. ఫలితంగా దేవాలయాలలో ప్రసాదాలకు, ఇళ్లలో వంటకాలకు బెల్లం లభించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు తీవ్ర అవస్థలకు గురికావటంతో ఆధార్ కార్డు ఆధారంగా గృహావసరాలకు పరిమితంగా బెల్లం అమ్మవచ్చని ఎక్సైజ్ శాఖ సడలింపు ఇచ్చింది. మామూలు రోజుల్లో 20నుంచి 30రూపాయలు పలికిన బెల్లం మొదట నిషేధం, తరువాత పరిమిత సడలింపుల కారణంగా 60నుంచి 80 రూపాయల వరకు పెరిగింది. ఈ పరిస్థితుల్లో జనవరి 31నుంచి ఫిబ్రవరి 3 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర జరుగుతుండటం, ఈ వనదేవతలకు నిలువెత్తు బంగారం పేరిట బెల్లం సమర్పించటం ఆనవాయితీ కావటంతో జాతరలో
అమ్మవార్లకు బెల్లం ఇవ్వటం ఎలా? అని సామాన్య ప్రజల్లో బెంగ పట్టుకుంది. ఇది గమనించిన వరంగల్ నగరానికి చెందిన పలువురు వ్యాపారులు బెల్లం కొరత అవకాశం తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి భారీగా బెల్లం స్టాకు తెప్పించుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో డంప్ చేసారు. ఇష్టం వచ్చిన ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో వివిధ ప్రాంతాలలో సబ్ ఏజెంట్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక జాతర కోసం విక్రయించే బెల్లంతో బోలెడు డబ్బులు సంపాదించుకోవచ్చని కలలు కన్నారు.
కానీ వీరి కలలను కల్లలు చేస్తు ఎక్సైజ్ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. మేడారం జాతరను దృష్టిలో పెట్టుకుని భక్తులు నిలువెత్తు మొక్కులు చెల్లించుకునేందుకు బెల్లంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. దాంతో బెల్లం వ్యాపారులు నివ్వెరపోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా కాస్త తక్కువ లాభంతోనైనా బెల్లం అమ్మాలని అనుకున్నా, గతంతో పోలిస్తే బెల్లం విక్రయించే వ్యాపారులు నాలగురెట్లు పెరగటం, అదేస్థాయిలో బెల్లం స్టాకు రావటంతో ఏమిచేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి హోల్‌సేల్ మార్కెట్‌లో 35రూపాయలకు కేజీ చొప్పున వ్యాపారులు బెల్లం కొనుగోలు చేసి తీసుకువచ్చారు. జాతర తరువాత కూడా బెల్లం అమ్మకాలు చేసుకోవచ్చని వ్యాపారులు భావించగా ఊహించని విధంగా ఎక్సైజ్‌శాఖ అధికారులు వ్యాపారులు కొనుగోలు చేసిన బెల్లం ఫిబ్రవరి ఐదవతేదీలోగా విక్రయించాలని, ఆ తరువాత బెల్లం స్టాకు ఉంటే స్వాధీనం చేసుకోవటంతోపాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసారు. దాంతో స్థానిక హోల్‌సేల్ బెల్లం వ్యాపారుల పరిస్థితి కుడితిలోపడిన ఎలుకలా మారింది. స్వేచ్ఛగా బెల్లం అమ్మకాలకు అవకాశాలు ఏర్పడటం, బెల్లం స్టాకు ఎక్కువగా ఉండటం, ఐదవ తేదీ తరువాత బెల్లం అమ్మకాలకు అవకాశం లేకపోవటంతో 35రూపాయలకు కొనుగోలు చేసి తెచ్చిన బెల్లంను 30రూపాయలకే విక్రయించి ఏదోలా స్టాకును వదిలించుకోవాలనే ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్నారు. మేడారం జాతరలో అసలు బెల్లం దొరుకుతుందో.. లేదో, దొరికినా ఎంత ఎక్కువ రేటు ఉంటుందోనని భయపడిన ప్రజలకు ఊహించని ధరలకు బెల్లం లభిస్తుండగా, బెల్లం వ్యాపారుల జేబులు గుల్లయ్యే పరిస్థితి ఏర్పడింది.