రాష్ట్రీయం

మావోయిస్టుల మెరుపుదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పినపాక, జనవరి 27: తెలంగాణ ఏజెన్సీలో మావోయిస్టులు అర్ధరాత్రి మెరుపుదాడికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో శుక్రవారం అర్ధరాత్రి విరుచుకుపడ్డారు. జానంపేట పంచాయతి గోదావరి పరీవాహక ప్రాంతం భూపతిరావుపేటలోకి ప్రవేశించిన మావోలు తొలుత గోదావరిలో ఇసుకను తరలిస్తున్న ఎనిమిది వాహనాలపై దాడి చేసి దగ్ధం చేశారు. ఇన్‌ఫార్మర్ నెపంతో ఆదివాసీ గిరిజన యువకుడిని కత్తులతో నరికి చంపారు. మరో యువకుడిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ సంఘటనతో ఇటు పోలీసుల్లో, అటు రాజకీయ పార్టీల్లో అలజడి మొదలైంది. ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్థుల వివరాల ప్రకారం అర్ధరాత్రి ఛత్తీస్‌గఢ్ రాష్డ్రం నుంచి గోదావరి నదిని దాటిన 50 మంది మావోయిస్టులు ముందుగా భూపతిరావుపేటలోకి ప్రవేశించి నది ఒడ్డున నిలిపి ఉన్న మూడు జేసీబీలను, నాలుగు లారీలను, క్వారీలో ఉన్న ట్రాక్టర్‌ను డీజిల్ పోసి తగలబెట్టారు. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న కూలీలు, డ్రైవర్లు, కీనర్లను చితకబాది వాళ్ల దగ్గర ఉన్న సెల్‌ఫోన్లు లాక్కున్నారు. మావోలు ట్రాక్టర్‌ను దగ్ధం చేస్తుండగా ఇసుక తినె్నలపై నిద్రపోతున్న క్వారీలో పనిచేసే కార్మికులు భయంతో పరుగులు తీశారు. అనంతరం మావోలు గాలిలోకి కాల్పులు జరపడంతో భయంతో లొంగిపోయారు. వాళ్ల దగ్గర సెల్‌ఫోన్లు లాక్కునే సందర్భంలో సెల్‌ఫోన్ లేదని చెప్పినవాళ్లను కర్రలతో చితక బాదారు. అనంతరం చెంతనే ఉన్న సుందరయ్యనగర్‌లో ఉంటున్న తెల్లం రమేష్ (30) ఇంటికి వెళ్లిన మావోయిస్టులు అతడిని బయటకు తీసుకొచ్చి కాల్పులకు పాల్పడ్డారు. ప్రాణభయంతో పరిగెత్తిన రమేష్ చేతికి బలమైన గాయమైంది. అతను కిందపడిపోవడంతో చనిపోయినట్లు భావించిన మావోలు సంఘటన స్థలం నుండి వెళ్లిపోయారు. ఆ గ్రామానికి 5 కిలోమీటర్ల
దూరంలో ఉన్న వీరాపురంలో ఉంటున్న పొడెం జోగయ్య (35) అనే ఆదివాసీ గిరిజనుడి ఇంటికి వెళ్లి మాట్లాడే పని ఉందని బయటకు తీసుకువెళ్లి కత్తులతో నరికి చంపినట్లు గ్రామస్థులు తెలిపారు. అనంతరం మావోలు గోదావరి నది దాటి వెళ్లిపోతూ లేఖలు వదిలి వెళ్లినట్లు తెలిపారు. తెల్లం రమేష్, పొడెం జోగయ్య పోలీసు ఇన్‌ఫార్మర్లేనని ఆ లేఖల్లో మావోలు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీలపై నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయని, గ్రీన్ హంట్ పేరుతో దండకార్యణాన్ని జల్లెడ పడుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. వీటికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 5న తెలంగాణ బంద్ పాటించాలని పిలుపు ఇచ్చారు.

చిత్రాలు....మావోలు దగ్ధం చేసిన లారీలు. *మావోయిస్టుల చేతిలో హతమైన పొడెం జోగయ్య