రాష్ట్రీయం

కనుల పండువగా ‘అష్టదళ పాదపద్మారాధన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు ఆద్యంతం భక్తిపారవశ్యం మధ్య భక్తుల నిర్విరామ గోవిందనామ స్మరణలతో కనులపండువగా కొనసాగుతున్నాయి. వైభవోత్సవం 4వ రోజు మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రత్యేకంగా నిర్వహించిన ‘అష్టదళ పాదపద్మారాధన’కు తరలివచ్చిన భక్తజనంతో ఎన్టీఆర్ స్టేడియం కిటకిటలాడింది. ఉదయం 6గంటలకే సుప్రభాతం కార్యక్రమంతో వైభవోత్సవం ప్రారంభం కాగా తోమాలసేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర అనంతరం ‘అష్టదళ పాదపద్మారాధన’ను అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం రెండవ నివేదన, సర్వదర్శనం, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, వీధి ఉత్సవం, రాత్రి కైంకర్యం తర్వాత భక్తులకు స్వామివారి ఏకాంత సేవ దర్శన భాగ్యం కల్పించారు. తిరుమలలో నేరుగా చూడలేని అనేక అర్చనలు, స్వామి వారికి అందించే కైంకర్యాలను కళ్లారా చూసి భక్తులు పరవశించిపోయారు. ప్రముఖ గాయకుడు ఎంఎస్ రామారావు మనవడు ఎంఎస్ శ్రీనివాస్‌చే నిర్వహించిన సంగీత కీర్తనలు, పాటలు భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించాయి. ఈ సందర్భంగా ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారి వీధి ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాసరావు, బిజెపి శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్, టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, టిటిడి జెఇఓ పోలా భాస్కర్, ఎపిహెచ్‌ఆర్‌సి చైర్మన్ భవానీ శంకర్ ప్రసాద్, ఇన్‌కంటాక్స్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి జస్టిస్ మాదవీదేవి, సినీ నిర్మాత ఆశ్వినీదత్, పారిశ్రామికవేత్తలు కెవి రావు, డాక్టర్ గోపీచంద్, రఘురామరాజు, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, బిజెపి నాయకులు సుధీష్ రాంబొట్ల పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవం సందర్భంగా నిర్వహించిన శ్రీవారి ఊరేగింపులో పాల్గొన్న ఆంధ్రభూమి సంపాదకులు
ఎంవిఆర్ శాస్ర్తీ దంపతులు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస రావు తదితరులు