రాష్ట్రీయం

భూగర్భజలాలకు పుష్ఠి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 12: భూగర్భజలాలను కాపాడుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. జల సంరక్షణ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో పాలవాగు పూడికతీత పనులతో పాటు నీరు-ప్రగతిలో భాగంగా జలసంరక్షణ రెండవ దశ కార్యక్రమాన్ని ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మాట్లాడిన చంద్రబాబు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. జలసంరక్షణ ఉద్యమాన్ని పటిష్ఠంగా అమలు చేయడం వల్ల గత ఏడాది 29 శాతం తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ వ్యవసాయరంగంలో 14 శాతం వృద్ధిరేటు సాధించామని తెలిపారు. ఈ ఏడాది దేశం మొత్తంగా కేంద్రంలో వ్యవసాయ వృద్ధిరేటు 2.8 కాగా రాష్ట్రంలో మొదటి ఆరు నెలల కాలంలోనే 25.6 శాతం సాధించ గలిగామని సంతృప్తి వ్యక్తంచేశారు. రెండవ దశ జలసంరక్షణ ఉద్యమంలో భాగంగా ఈనెల 12 నుండి జూన్ 17 వరకూ 116 రోజులు నీరు- ప్రగతి కార్యక్రమం కింద రాష్ట్రంలో జలసంరక్షణ పనులు పెద్దఎత్తున చేపట్టి చెరువులకు జంగిల్ క్లియరెన్స్‌లు, పూడికతీత, కట్టల పటిష్టత, అలుగు, తూముల కాంక్రీటు పనులు, షట్టర్లకు మరమ్మతులు, కొత్తవి ఏర్పాటు, చెరువుల అనుసంధానం, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, కాలువల పూడికతీత, చెక్‌డ్యామ్‌లు, ఊటకుంటల నిర్మాణం, పంట సంజీవనిల తవ్వకం, వాననీటి సంరక్షణ తదితర కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ముందుచూపుతో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంతో ఈ ఏడాది 100 టీఎంసీల నీటిని అందించే వీలు కలిగిందన్నారు. భవిష్యత్తులో నాగావళి, వంశధార, పెన్నా నదుల అనుసంధానాన్ని చేపట్టి నీటిని సమర్థవంతంగా పరిరక్షించుకుని రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలనేదే తన సంకల్పంగా చెప్పా రు. జలసంరక్షణ చర్యలతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగాయన్నారు. ఒకటి, రెండేళ్లపాటు వర్షాలు ఆశాజనకంగా లేకపోయినా వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. రాష్ట్రంలో రూ 10వేల 867 కోట్లతో జలసంరక్షణ చర్యలు చేపట్టామన్నారు. భవిష్యత్తులో రాజధాని పరిధిలోని కొండవీటి వాగు, పాలవాగు వరదలను నియంత్రించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించామన్నారు. రూ 3వేల కోట్ల తో వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణ పను లు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం లో 29 ప్రాజెక్టులకు గాను 7 పూర్తి చేశామని, ప్రాధాన్యతా క్రమంలో అన్నింటినీ పూర్తిచేసి రానున్న కాలంలో రెండుకోట్ల ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. ప్రస్తుతం కోటీ 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి నీరు-చెట్టు కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

చిత్రం..అమరావతి పరిధిలోని పాలవాగులో పూడికతీత పనులు ప్రారంభిస్తున్న చంద్రబాబు