రాష్ట్రీయం

జగిత్యాలలో జైనమత ఆనవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారంగాపూర్, మార్చి 8: జగిత్యాల జిల్లాలో జైన మతం విస్తృతంగా వ్యాప్తించి ఉండేది అనడానికి ఆధారాలు లభ్యమైనట్ట్టు ప్రముఖ చారిత్రక పరిశోధకులు, దక్కన్ ఆర్కిలాజికల్, కల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, సాలార్‌జంగ్ మ్యూజియం బోర్డు మెంబర్ కుర్రా జితేంద్రబాబు వెల్లడించారు. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో గల బీర్‌పూర్ మండలంలోని కండ్లపెల్లి, చర్లపల్లి గ్రామంలో గురువారం శాతవాహన విశ్వవిద్యాలయం ఆచార్యులు, డాక్రి సభ్యులు డాక్టర్ కె. ముత్యం, భవాన్స్ సైన్స్ కళాశాల చైర్మన్, ప్రముఖ చారిత్రక పరిశోధకులు డాక్టర్ పి. జైకిషన్‌లతో కలిసి విస్తృతంగా పర్యటించారు. 7 నుండి 10వ శతాబ్దం వరకు పరిపాలించిన కళ్యాణి చాళుక్యుల కాలంలో కండ్లపల్లి గ్రామం గొప్ప జైన గ్రామంగా విరాజిల్లిందని, లభించిన శాసనాలు, శిల్పాలు, శిథిలాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. కండ్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఎదురుగా మట్టిదిబ్బలో తల విరిగిపోయి శిథిలావస్ధలో పడి ఉన్న కుబేరుని విగ్రహం, మెడలో ఉన్న ఆభరణాలు, అలంకరణ శైలి, జైన సూత్రం కళ్యాణి చాళుక్యుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. గ్రామంలో మరోచోట కాకతీయుల కాలంనాటి శిథిలమైన వైష్ణవమూర్తులు, మరో 3 శిథిలమైన విగ్రహాలు పడి ఉన్నాయి. ఒకప్పుడు దేవాలయం ఉన్నట్టు శిథిలాల ఆధారంగా ఆనవాళ్ల్లు లభిస్తున్నట్టు తెలిపారు. ఈ శిల్పకళా నైపుణ్యం ఆధారంగా కండ్లపల్లి గ్రామం కళ్యాణ చాళుక్యులు, కాకతీయుల కాలంలో ఉన్నత స్థితిలో ఉన్నట్టు ఆధారాలను బట్టి తెలుస్తోందన్నారు. ఇదే గ్రామంలో పాఠశాల వెనుకభాగంలోని రోడ్డుకు కుడివైపున దాదాపు భుజస్కందాలు తప్పితే మిగతా భాగం అంతా భూగర్భంలో కప్పబడి ఉన్న జైన వర్థమాన మహావీరుడి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని గ్రామంలో దొంగల బారినుండి రక్షించిన కాలబైరవుడిగా చెప్పుకుంటారు. మహావీరుడి విగ్రహం ముందు జైన విగ్రహాలను ప్రతిష్ఠించే ఎర్ర ఇసుకతో తయారు చేసిన అదిష్ఠాన పీఠం పడి ఉంది. దీన్నిబట్టి ఒకప్పుడు జైన దేవాలయం నిర్మాణం జరిగి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. గ్రామంలోని చెరువు కట్ట వద్ద పడి ఉన్న రాతి ఇసుక స్తంభానికి చెక్కిన జైన మహావీరుడి, జంతువు ఆకృతితో కూడిన శిల్పం చెక్కబడి ఉంది. గ్రామం నడి బొడ్డున చర్లపల్లికి వెళ్లే మార్గంలో పూర్తిగా మట్టితో కప్పిన 7 నుండి 10 శతాబ్దకాలం వరకు పరిపాలించిన చాళుక్యుల చారిత్రిక విశేషాలు తెలియజేసే శిలాశాసనం శిథిలమై భూ స్థాపితమై ఉంది. కొద్దిగా కనిపిస్తున్న ఈ శిలపై మహావీరుడి బొమ్మ చెక్కి ఉంది. కళ్యాణి చాళుక్యులు పాలిస్తున్న కాలంలో ఈ ప్రాంతం సమృద్ధిగా స్వయం సంపూర్ణ వ్యవస్థతో విరాజిల్లినట్టు ఇక్కడి ప్రాంత ఆధారాలు వెల్లడిస్తున్నాయన్నారు. నదీ పరీవాహక ప్రాంతమైన కండ్లపల్లి గ్రామం ఇనుము, ఉక్కు ఉత్పత్తి కేంద్రంగా వర్తక, వ్యాపార, వాణిజ్యాలకు నెలవుగా విలసిల్లిందన్నారు. ఇదే గ్రామానికి ఆనుకుని ఉన్న చెర్లపల్లి గ్రామంలో కాకతీయుల కాలంనాటి విష్ణుమూర్తి, దుర్గ అమ్మవారు, అరుదుగా కనిపించే అండకారంలోని గణపతి, విరిగిపోయిన శివుని విగ్రహం, చెక్కుచెదరని మట్టి ఇటుక, భవనాలకు ఉపయోగించే మూలాధార శిల పొలంలో పడి ఉన్నాయి. జైన కాలం అనంతరం 400 ఏళ్ల తరువాత 11 నుండి 14వ శతాబ్దం మొదలు వరకు ఏలిన కాకతీయుల కాలంలోని శైవ, వైష్ణవాల వ్యాప్తికి ప్రతీకగా దేవతా విగ్రహాల ఆకృతులు తెలియచేస్తున్నాయని తెలిపారు. జైన మతం విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ తవ్వకాలు చేపడితే అనేక చారిత్రక అవశేషాలు, ఆధారాలు లభ్యం అయ్యే అవకాశం ఉందన్నారు.

చిత్రాలు..విగ్రహాన్ని విలేఖరులకు చూపుతున్న చారిత్రక పరిశోధకుడు కుర్రా జితేంద్రబాబు

*రాతి ఇసుక స్థంభం, శిలపై చెక్కిన జైన విగ్రహం. *చర్లపల్లి పోలాల మధ్య పడి ఉన్న విష్ణుమూర్తి, వినాయక, దుర్గా విగ్రహాలు