రాష్ట్రీయం

అన్నింటా ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: అనేక ప్రతికూల పరిస్థితులు, అస్పష్టతలు, అనుమానాలు, సవాళ్ల మధ్య ఏర్పడిన తెలంగాణ నూతన రాష్ట్రం అనతికాలంలోనే అనేక విషయాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగిందని ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 2018-19వ సంవత్సరానికి రూ 1,74,453.83 కోట్ల రూపాయలతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవిన్యూ వ్యయం కోటి 25 లక్షల 454.70 కోట్లు ఉంటుందని రెవిన్యూ మిగులు 5520.41 కోట్లు ఉంటుందని, ద్రవ్యలోటు అంచనా 29వేల 077.07 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. జీడీపీలో ద్రవ్యలోటు 3.45 శాతం మేర ఉండొచ్చని అంచనా వేశారు. రాష్ట్ర సొంత ఆదాయం 73వేల 751 కోట్లు ఉంటుందని , కేంద్రం 29వేల 041 కోట్లు మేర సాయం చేస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1,33,823 కోట్లు ఖర్చు అయిందని, రెవిన్యూ మిగులు రూ.1386 కోట్లు ఉందని, 2017-18 సవరించిన అంచనాల ప్రకారం మొత్తం ఖర్చు రూ.1,42,506 కోట్లుగా అంచనావేశామని, ఇందులో రెవిన్యూ వ్యయం 1,06,603 కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ. 25,447 కోట్లు ఉందని, ఇది సవరించిన అంచనాల్లో 95 శాతం ఉందని, జిఎస్‌టి ప్రారంభించడం వల్ల కలిగిన ప్రారంభ ప్రతికూల పరిణామాల వల్ల ఆదాయం పెరుగుదల గత ఆర్ధిక సంవత్సరం కంటే స్వల్పంగా తగ్గిందని అన్నారు.
శాసనసభలో ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగ పాఠం మొత్తం గంట 20 నిమిషాల పాటు కొనసాగింది. ఐదుమార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందని అన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్‌ఎస్ సర్కార్ ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదే అవుతుంది. బడ్జెట్‌లో సంక్షేమ రంగంతో పాటు వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు
పెద్ద పీట వేశారు. గురుకులాలకు అత్యధికంగా నిధులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి, బీసీ, అణగారిన వర్గాల అభివృద్ధికి, మహిళా సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగాయి. ప్రజాసంక్షేమం, వౌలిక వసతుల కల్పన, పాలనా సంస్కరణల్లో తెలంగాణ చూపిన మార్గం తమకు కూడా అనుసరణీయమని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
వర్తమానంలో ప్రభుత్వం సాధిస్తున్న విజయాలతో భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందనే ఆత్మవిశ్వాసం ఈనాడు తెలంగాణ సమాజంలో తొణికిసలాడుతోందని చెప్పారు. ఆ విశ్వాసమే ప్రాతిపదికగా, బంగారు తెలంగాణ నిర్మాణం ధ్యేయంగా రాష్ట్ర ప్రజల సమగ్రాభివృద్ధి కోసం ఈ బడ్జెట్‌ను రూపొందించినట్టు చెప్పారు. 45 నెలల స్వల్పకాలంలో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించినట్టు చెప్పారు. చీకటి నుండి వెలుగులోకి, అపనమ్మకం నుండి ఆత్మవిశ్వాసంలోకి, అణగారిన స్థితి నుండి అభ్యున్నతిలోకి, వలస బతుకుల నుండి వ్యవసాయ ప్రగతి వైపు రాష్ట్ర ప్రజలను నడిపిస్తున్నామని అన్నారు.
ఆర్థిక పరిస్థితి
2012-13లో దేశ సగటు వృద్ధి రేటు 5.9 శాతం ఉండగా, తెలంగాణ ప్రాంత సగటు వృద్ధి రేటు 4.2 శాతం ఉందని, 2014-15లో తెలంగాణ వృద్ధి రేటు 6.8 శాతం కాగా, 2016-17లో 10.1 శాతంగా నమోదైందని, 2017-18 ఆర్ధిక సంవత్సరానికి 10.4 శాతంగా ఉండగలదని అంచనావేస్తున్నట్టు చెప్పారు. తయారీ రంగంలో 2015-16లో 6.4 శాతం వృద్ధి నమోదైందని, 2016-17లో 7.4 శాతంగా, 2017-18లో 7.6 శాతంగా నమోదైందని తెలిపారు.
విద్యుత్ రంగంలో, నీటి పారుదలలో వచ్చిన అభివృద్ధి వల్ల వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో 2017-18లో 6.8 శాతం వృద్ధి నమోదైందని అన్నారు. తలసరి ఆదాయం 2016-17లో లక్ష 54 వేల 734 రూపాయిలు ఉండగా, 2017-18లో అది లక్ష 75వేల 534 రూపాయిలకు పెరిగిందని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.
కేటాయింపులు:
వ్యవసాయం, మార్కెట్ రంగాలకు బడ్జెట్‌లో 15,780 కోట్లు కేటాయించారు. పంట పెట్టుబడి పథకానికి 12వేల కోట్లు, రైతు భీమాకు 500కోట్లు, యాంత్రీకరణకు 522 కోట్లు, బిందు తుంపర సేద్యానికి 129 కోట్లు, పాలీ హౌస్, గ్రీన్ హౌజ్‌కు 120 కోట్లు , కోల్డు స్టోరేజీలకు 132 కోట్లు కేటాయించారు. పౌరసరఫరాల శాఖకు 2946 కోట్లు కేటాయించారు.
సాగునీటికి 25వేల కోట్లు కేటాయించారు. గ్రామీణ , స్థానిక సంస్థల పరిపుష్టానికి 15 వందల కోట్లు, పట్టణ స్థానిక సంస్థల పటిష్టతకు వెయ్యి కోట్లు కేటాయించారు. గొర్రెల పంపిణీ పథకానికి 5వేల కోట్ల అంచనా వ్యయం వేసినట్టు రెవిన్యూ మంత్రి చెప్పారు. కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి 109 కోట్లు, ఆసరా పెన్షన్లకు 5300 కోట్లు, కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకానికి 1450 కోట్లు కేటాయించారు. ఆరోగ్య లక్ష్మి పథకానికి 298 కోట్లు, మహిళా సంక్షేమానికి 1799కోట్లు ప్రతిపాదించారు.
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి కింద ఎస్సీలకు 16,453కోట్లు, ఎస్టీలకు 9693 కోట్లు ప్రతిపాదించారు. ఎస్సీ శాఖకు 12,709 కోట్లు, దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమానికి 1469 కోట్లు ప్రతిపాదించారు. షెడ్యూల్డు తెగల శాఖకు 8063 కోట్లు ప్రతిపాదించారు. ఎంబీసీ సంక్షేమానికి వెయ్యి కోట్లు , రజకుల ఫెడరేషన్‌కు 200 కోట్లు, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు 250 కోట్లు కలిపి బీసీ అభివృద్ధికి 5920 కోట్లు కేటాయించారు. మైనార్టీ విద్యాసంస్థల అభివృద్ధికి 735 కోట్లతో కలిపి మైనార్టీ సంక్షేమానికి ఈ సంవత్సరం 2వేల కోట్లు కేటాయించారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు వంద కోట్లు, రెడ్డి హాస్టల్‌కు 10 కోట్లు, జర్నలిస్టుల సంక్షేమానికి 75 కోట్లు, న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు 2643 కోట్లు కేటాయించారు. అమ్మ ఒడి పథకానికి 561 కోట్లు కలిపి వైద్య రంగానికి అభివృద్ధికి 7375 కోట్లు ప్రతిపాదించారు.
పాఠశాల విద్యకు రూ 10,830 కోట్లు, ఉన్నత విద్యా రంగానికి 2448 కోట్లు ప్రతిపాదించారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు 2823 కోట్లు ప్రతిపాదించారు.
మిషన్ భగీరథ పథకానికి 1801 కోట్లు, తెలంగాణ హరితహారం పథకానికి 1166 కోట్లు, రవాణా, రోడ్లు భవనాల శాఖకు 5575 కోట్లు, పంచాయితీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖకు 15,563 కోట్లు ప్రతిపాదించారు. కొత్త కలెక్టరేట్లకు 500 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి 5650 కోట్లు, చేనేత టెక్స్‌టైల్ రంగాలకు 1200 కోట్లు, పరిశ్రమల రంగానికి 1286 కోట్లు, ఐటి రంగానికి 289 కోట్లు, నగరాల అభివృద్ధి పద్దులో హైదరాబాద్‌కు 300కోట్లు, మిగిలిన కార్పొరేషన్లకు 400కోట్లు కలిపి పట్టణాభివృద్ధిశాఖకు 7251 కోట్లు, సాంస్కృతిక శాఖకు 58 కోట్లు, అర్చకుల పిఆర్‌సి అమలుకు 72 కోట్లు, యాదగిరి గుట్ట అభివృద్ధికి 250 కోట్లు, వేముల వాడ అభివృద్ధికి 100 కోట్లు, భద్రాచలం అభివృద్ధికి 100 కోట్లు, బాసర అభివృద్ధికి 50 కోట్లు, ధర్మపురి అభివృద్ధికి 50 కోట్లు ప్రతిపాదించారు. కామన్‌గుడ్ ఫండ్‌కు 50 కోట్లు ప్రతిపాదించినట్టు ఆర్ధిక మంత్రి తెలిపారు. హోం శాఖకు 5790 కోట్లు వెచ్చించనున్నారు.

చిత్రాలు..బడ్జెట్‌కు ముందు సీఎంతో ఈటల
*అసెంబ్లీలో బడ్జెట్ పద్దు సమర్పిస్తున్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్