రాష్ట్రీయం

11మంది జలసమాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 25: నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రానికి సమీపంలో ఆదివారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. 19మంది ప్రయాణికులతో కిక్కిరిసివున్న ఆటో, అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోవడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 25 అడుగుల లోతు కలిగి, సగానికి పైగా నీటి నిల్వతోవున్న బావిలోకి ఆటో పడిపోవడంతో, ప్రయాణికులు తప్పించుకునే మార్గం లేకపోయంది. ఆటోలోవున్న ప్రయాణీకుల్లో 11మంది నీటమునిగి ఊపిరాడక జల సమాధి అయ్యారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు, మరో ఇద్దరు చిన్నారులున్నారు. వేంపల్లికి చెందిన నాగంపేట సాయమ్మ (50), మోర్తాడ్ మండలం ధర్మోరా నివాసి మద్దికుంట లక్ష్మి (38), డిచ్‌పల్లి మండలం కేశాపూర్‌కు చెందిన కే.గంగవ్వ (45), గుండారానికు చెందిన గంగామణి (45), వర్ని మండలం మోస్రాకు చెందిన పీ.సంపత్ (14), ఆర్మూర్ మండలం ఆలూర్‌కు చెందిన మనస్విని (3), బాల్కొండ మండలం చిట్టాపూర్‌కు చెందిన రోజా (26), ఆమె ఇద్దరు కుమార్తెలు చిన్ని (1), ప్రశంస (7), చక్కని (2), మెండోరా మండల కేంద్రానికి చెందిన నిమ్మ సత్తెమ్మ (50)లు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఆటో డ్రైవర్ సహా తొమ్మిది మంది ప్రయాణికులు బావిలోని పంపుసెట్టుకు బిగించివున్న పైపును పట్టుకుని, అతికష్టం మీద ప్రాణాలు నిలుపుకున్నారు. సమీపంలోని పంట చేలల్లో పని చేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు ప్రమాదాన్ని గమనించి వెంటనే ఘటనా స్థలికి చేరుకుని బాధితులను పైకి తీసుకొచ్చారు. ప్రమాదం నుండి తప్పించుకున్న విజయ, చిన్నరాజు, సంజీవ్, సుమలత, మల్లవ్వలను బాల్కొండ ఆసుపత్రిలో, సంగీత, మనీష, ప్రవీణ్‌లను ఆర్మూర్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు
అందిస్తున్నారు. ఆటో డ్రైవర్ గోపీ శ్రీనివాస్ అందరికంటే ముందుగా పైకి చేరుకుని సంఘటనా స్థలం నుండి పరారయ్యాడు. ప్రమాద సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్‌రావు, పోలీస్ కమిషనర్ కార్తికేయ, ఇతర అధికారులు హుటాహుటిన ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బావిలో పడిన ఆటోను క్రేన్ సాయంతో పైకి తీశారు. గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహాలను వెలికి తీయించారు. బావి అడుగున ఇంకా ఏమైనా మృతదేహాలు చిక్కుకుపోయి ఉంటాయనే అనుమానంతో అగ్నిమాపక శాఖ సిబ్బందిచే బావిలోని నీటిని మోటార్ల ద్వారా పైకి తోడి ఖాళీ చేయించారు. ఘోర ప్రమాదానికి ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు, పోలీసులు నిర్ధారించారు. ఐదు రోజుల క్రితమే ముప్కాల్ గ్రామానికి చెందిన గోపిశ్రీనివాస్ అనే వ్యక్తి కొత్త ఆటో కొనుగోలు చేశాడు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ముప్కాల్ నుంచి ఆటోలో సామర్థ్యానికి మించి 19మంది ప్రయాణికులను ఎక్కించుకుని మెండోరా వైపు వస్తున్నాడు. నిజానికి జాతీయ రహదారి మీదుగానే రావాల్సి ఉన్నప్పటికీ, దగ్గరి మార్గంగా పిల్లదారిని ఎంచుకున్నాడు. అసలే ఆటోరిక్షాలో ప్రయాణికులు కిక్కిరిసిపోయి ఉండడం, చిన్న రహదారి కావడంతో మెండోరా శివారులో రోడ్డుకు ఆనుకుని ఉన్న ముస్కు భూమయ్య అనే రైతుకు చెందిన పంట చేను బావి వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బావిలో దూసుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 11మంది తమ గమ్యస్థానాలకు చేరుకోకముందే మార్గమధ్యంలోనే అశువులు బాశారు. ఘోర రోడ్డు ప్రమాద ఘటన పట్ల సీఎం కేసీఆర్, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సంఘటనా స్థలం వద్ద మృతుల కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
చిత్రాలు..క్రేన్ సహాయంతో వ్యవసాయ బావినుంచి ఆటోను పైకి తీస్తున్న దృశ్యం.
*మృతదేహాలను ట్రక్కులోకి ఎక్కిస్తున్న స్థానికులు.