రాష్ట్రీయం

కమనీయం.. రాముని కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 26: కమనీయ కల్యాణాన్ని తిలకించిన కనులే కన్నులు.. ఆ ‘కల్యాణ’మూర్తులకు ప్రణమిల్లిన చేతులే చేతులు.. ఆణిముత్యాలే తలంబ్రాలైన వేళ.. ‘జయ జయ రాం.. సీతారాం’ అంటూ భక్తులు చేసిన నినాదాలే మంగళ వాయిద్యాలైన వేళ.. రామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకాలు పెళ్లి లాంఛనాలైన వేళ.. భద్రాచలం మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. చలువ పందిళ్లు.. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా.. విశేషంగా జరిపించారు. వేద మంత్రాల మధ్య జగత్ కల్యాణ రాముడు సీతమ్మ మెడలో జనక, దశరథ, రామదాసులు తయారుచేయించిన మూడు మంగళ సూత్రాలతో మాంగల్య ధారణ చేశారు. ఈ అపురూప ఘట్టం తిలకించిన వేలాది మంది భక్త జనం జై శ్రీరాం... అంటూ నినదించడంతో మిథిలా నగరి పులకించిపోయింది. సకల దేవతలకు ప్రీతిపాత్రమైన వైకుంఠ రాముడు పెళ్లి కుమారుని శోభతో దివ్య మంగళ రూపంతో వెలిగిపోగా, జనక మహారాజు గారాలపట్టి, అపురూప లావణ్యవతి జానకీదేవిని నయన మనోహరంగా అలంకరించారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. శ్రీరామచంద్రుడు జన్మించిన విళంబినామ సంవత్సరం 60 ఏళ్ల తర్వాత రావడంతో ఈసారి నెలకొన్న విశిష్టత దృష్ట్యా ఉభయ
తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు విళంబినామ సంవత్సర విశిష్టత గురించి భక్తులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సంప్రదాయంగా అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున జేఈవో శ్రీనివాసరాజు, డాలర్ శేషాద్రి పట్టు వస్త్రాలు, సుదర్శన పర్కం సమర్పించారు. ముందుగా మూలవరులకు ప్రత్యేక ఆరాధన చేసి స్వామికి అభిషేకం చేశారు. ఆ తర్వాత నీలమేఘశ్యాముడు ధీరోధాత్తుడిగా ఆశీనుడై, సీతామహాలక్ష్మి వినయ సంపన్నురాలిగా కూర్చుని ఊరేగింపుతో మిథిలా నగరానికి వచ్చారు. విశ్వక్సేనుడికి పూజలు నిర్వహించే ప్రక్రియతో పెళ్లి సంబరం ప్రారంభమైంది. శ్రీరాముడు, సీతమ్మల ఆశీస్సులను భక్తులకు అందించడానికి పరిచయ కార్యక్రమాన్ని చేపట్టారు. సీతమ్మకు 12 దర్భలు, 24 అంగుళాలతో చేసిన యోక్ర దర్భను దోష నివారణకు నడుముకు ధరింప చేశారు. ఈ యోక్రధారణ తెలుగువారి వివాహాల్లో చేస్తారు. గర్భధారణ సమస్యలు రాకుండా ఉంటుందని పెద్దలు చెబుతారు. స్వామికి బంగారు యజ్ఞోపవీత ధారణ చేశారు. కన్యాదాన ప్రక్రియలో కీలకమైన కాళ్లు కడిగి కన్యాదానం చేసే వరపూజ పూర్తి చేశారు. సీతామహాలక్ష్మికి చింతాకుపతకం, రాములవారికి పచ్చల హారం, లక్ష్మణుడికి రామ మాడ వేశారు. మధుపర్కాల నివేదనతో వధూవరులు అలంకార శోభితులయ్యారు. సీతారాముల వారికి అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లం పెట్టడంతో పెళ్లి ప్రధాన ఘట్టం పూర్తయ్యింది. ఆ తర్వాత రాములవారు జానకమ్మ మెడలో మాంగల్య ధారణ చేశారు. సంప్రదాయంగా పూబంతి ఆట ఆడాక తలంబ్రాల ప్రక్రియను చేపట్టారు. వివాహ ఘట్టం ముగిసిన తర్వాత శ్రీ సీతారామచంద్రుల ఉత్సవ కల్యాణమూర్తులు ఊరేగింపుగా గర్భాలయానికి రాగా ఆరాధన, మంగళాశాసనం జరిపించారు. అర్చనలు, హోమం జరిపిన తర్వాత స్వామి సూర్యచంద్రప్రభ వాహనంపై ఊరేగారు. ఈసారి భక్త రామదాసు వంశంలోని పదో తరానికి చెందిన కంచర్ల శ్రీనివాస్ స్వామికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
శ్రీరాముని పట్ట్భాషేకం నేడు
కల్యాణం మరుసటి రోజైన మంగళవారం మహా పట్ట్భాషేకాన్ని నిర్వహించనున్నారు. భద్రాద్రిలో మాత్రమే శ్రీరాముడికి పట్ట్భాషేక మహోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరవుతారని మొదట అనుకున్నారు. అయితే ఆయన పర్యటన రద్దయింది. ఈ వైభవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటకల నుంచి భారీ సంఖ్యలో భక్తులు భద్రాచలం చేరుకున్నారు.
సీఎం కేసీఆర్ గైర్హాజర్
నవాబుల కాలం నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రులు సమర్పించడం ఆనవాయితీ. కొన్ని సందర్భాలు, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ముఖ్యమంత్రులు ఈ ఆనవాయితీని తప్పారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాతృ వియోగంతో ఆయన భద్రాచలం నవమి వేడుకలకు రాలేకపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి రాలేకపోయారు. గతేడాది కూడా ఆయన రాలేదు. ఆయన మనవడు హిమాన్ష్ కల్యాణానికి వచ్చాడు.

చిత్రం..సీతమ్మ మంగళసూత్రాలను భక్తులకు చూపుతున్న అర్చకులు