రాష్ట్రీయం

పైరుపచ్చల పాలమూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: కృష్ణాజలాలు పాలమూరు పొలాలకు తరలుతుండటంతో దశాబ్దాల తరబడి బీడుగావున్న పంటపొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలతో మూడేళ్ల నుంచి పాలమూరు జిల్లాలోని పొలాలకు సాగునీరు అందుతోంది.
కృష్ణాజలాలను పాతపాలమూరు జిల్లా (ప్రస్తుతం మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు) లోని రైతుల పొలాలకు అందించేందుకు జూరాల ప్రాజెక్టుతో పాటు నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ పథకాలు నడుస్తున్నాయి. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు యుద్ధప్రాతిపదికన నడుస్తున్నాయి. మహాత్మాగాంధీ ఎత్తిపోతల (కల్వకుర్తి ఎత్తిపోతల) పథకం ద్వారా నీటిని ఇవ్వడం ప్రారంభించారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా మొత్తం 27 మండలాల్లోని 4,23,416 ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 2,21,341 ఎకరాలకు సాగునీటిని ఇస్తున్నారు. మరో రెండులక్షల ఎకరాలకు నీటిని ఇవ్వాల్సి ఉంది. నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటంతో మరో రెండేళ్లలో పూర్తిస్థాయి భూమికి సాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా కొల్లాపూర్, నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, జడ్చర్ల
శాసనసభా నియోజకవర్గాల పరిధిలోని 303 గ్రామాలకు తాగునీటిని 4.24 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. 2003 లో మొట్టమొదట తీసుకున్న నిర్ణయం ప్రకారం కేవలం 2.50 లక్షల ఎకరాలకే సాగునీటిని ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత ప్రజల కోరిక, ఎమ్మెల్యేల కోరికమేరకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు 2017 సెప్టెంబర్ 1 న తుది జీఓ వచ్చింది. ఈ జీఓ ప్రకారమే ఈ ప్రాజెక్టు ద్వారా 4,23,416 ఎకరాలకు సాగునీటిని, 303 గ్రామాలకు తాగునీటిని ఇచ్చేందుకు వీలుగా 4896 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చారు.
మూడు దశల్లో ఎత్తిపోతల
మూడు దశల్లో కృష్ణానీటిని (శ్రీశైలం బ్యాక్‌వాటర్) ఎత్తిపోసి పంటపొలాలకు ఇవ్వాలని డిపిఆర్ (సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక) రూపొందించారు. కృష్ణాబ్యాక్‌వాటర్‌ను కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు సమీపంలోని రేగుమాన్‌గడ్డ వద్ద ఎత్తిపోసేందుకు మొదటి లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు మోటార్లను ఉపయోగించి పంపుల ద్వారా నాలుగువేల క్యూసెక్కుల నీటిని 95 మీటర్లు ఎత్తిపోస్తారు. ఈ నీరు సింగోటం చెరువుమీదుగా కోడేరు మండలంలోని జొన్నల బొగుడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (జెబిబిఆర్) కు చేరుతుంది. అక్కడ మరో ఐదుమోటార్ల ద్వారా నాలుగువేల క్యూసెక్కుల నీటిని 86 మీటర్లు ఎత్తిపోస్తారు. ఆ తర్వాత ఈ నీరు గోపాల్‌పేట మండలంలోని గౌరిదేవిపల్లి గ్రామం వద్ద నిర్మిస్తున్న గుడిపల్లిగట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరుతుంది. అక్కడ మరో ఐదు మోటార్లను ఏర్పాటు చేసి 3200 క్యూసెక్కుల నీటిని 117 మీటర్లు ఎత్తిపోసి కల్వకుర్తి, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గాలవైపు వెళ్లే కాలువలకు అందిస్తారు. ఈ మూడుదశల్లోనూ ఎత్తిపోతల పాక్షికంగా పూర్తికావడంతో నీటిని తరలిస్తున్నారు.
ఈ ప్రాజెక్టుకు 4896.24 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనావేయగా, 2018 ఫిబ్రవరి వరకు 3784 రూపాయలు ఖర్చు చేశారు. 2017-18లో ప్రభుత్వం కేటాయించిన 1112 కోట్లలో ఎంత ఖర్చయిందో ఈ నెల పూర్తయితే తేలుతుంది. 2018-19 వార్షిక బడ్జెట్‌లో కల్వకుర్తి ఎత్తిపోతలకు 500 కోట్లు కేటాయించారు. కొల్లాపూర్, నాగర్‌కర్నూలు, వనపర్తి శాసనసభా నియోజకవర్గాల్లోని చెరువులను, కుంటలను నింపడం ద్వారా సాగుభూమికి నీటిని ఇవ్వడం ప్రారంభించడంతో ఈ ప్రాంతాల్లో భూగర్భజలాలూ బాగా పెరిగాయి. ఇటీవలే కల్వకుర్తి, జడ్చర్ల, అచ్చంపేట నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలను నీటితో నింపారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా మొత్తం 40 టీఎంసీల నీటిని వినియోగించాలని ప్రతిపాదించారు. ప్రభుత్వ ఖజానాతోపాటు ఆర్థిక సంస్థల నుండి నిధులు సేకరించి ఈ ప్రాజెక్టుపనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భావిస్తున్నారు.

చిత్రం..పాలమూరువైపు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ