రాష్ట్రీయం

ఏపీలో పెరగని విద్యుత్ చార్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచలేదు. రాష్ట్రంలో ఒక కోటి, 71 లక్షల 68వేల మంది వినియోగదారులు ఉన్నారు. 2018-19 సంవత్సరానికి ఎటువంటి విద్యుత్ చార్జీలను పెంచడంలేదని, పెరిగిన రెవెన్యూ లోటును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపిఇఆర్‌సి) చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ ప్రకటించారు. వచ్చే ఏడాదికి విద్యుత్ వినియోగదారులకు చార్జీలలో, వినియోగదారుల ఏ కేటగిరీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి పెరుగుదల ఉండదు. పైగా కొన్ని కేటగిరీల్లో ఉండే వినియోగదారులకు రాయితీలు కూడా ఇస్తున్నట్లు ఏపిఇఆర్‌సి ప్రకటించింది. ఏపి డిస్కాంలు రూ.7983 కోట్ల లోటు ఉన్నట్లు వార్షిక రెవెన్యూలో ప్రతిపాదనలు చేశారు. ఈ లోటును రూ.1953 కోట్ల మేర ఏపిఇఆర్‌సి తగ్గించి లోటును రూ.6030 కోట్లుగా నిర్ధారించారు. కాగా ఈ మొత్తం లోటు భరిస్తున్నట్లు ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శి ఏపిఇఆర్‌సి లేఖ పంపించారు. దీంతో రాష్ట్రప్రభుత్వం రూ.6030.17 కోట్ల సబ్సిడీని భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినందు వల్ల విద్యుత్ వినియోగదారులకు చార్జీలు పెంచడం లేదని ఏపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఏపిఇఆర్‌సి భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఈ మేరకు చార్జీల భారాన్ని సబ్సిడీ రూపంలో భరిస్తామని ప్రభుత్వం తెలియచేసింది. నర్సరీ రైతులకు రూ.4 కోట్ల మేర సాలీనా విద్యుత్ చార్జీలకు ఖర్చవుతుంది. పైగా నర్సరీల నుంచి ఇంతవరకు ఉన్న విద్యుత్ బకాయిలను అన్నింటిని రద్దు చేస్తున్నట్లు చైర్మన్ చెప్పారు. లోడ్‌తో సంబంధం లేకండా నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తారు. నెలకు 500 యూనిట్లకు మించి వినియోగదారులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యూనిట్ విద్యుత్‌పై ఒక రూపాయి ప్రోత్సాహకాన్ని ఇస్తారు. దీనికోసం స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తారు. పరిశ్రమలకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల విద్యుత్ వినిమయంపై ప్రోత్సాహకాలు ఇస్తారు. విద్యుత్ యూనిట్‌పై రూ.1 రాయితీ ఇస్తారు. హెచ్‌టి పరిశ్రమ, జనరల్ కేటగిరీకి కూడా ఈ రాయితీ వర్తిస్తుంది. ఆక్వా హెచరీ, ఆక్వా మేత తయారీ కర్మాగారాలకు కూడా టారిఫ్‌ను తగ్గించి కోళ్ల హేచరీ, కోళ్లమేత కర్మాగారాల మాదిరిగా టారిఫ్‌ను నిర్ణయించారు. రవాణా పర్యావరణ విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కొత్త సబ్‌కేటగిరీని ప్రవేశపెట్టారు. వీరి నుంచి యూనిట్‌కు రూ.6.95 పైసల చార్జీని వసూలు చేస్తారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి ఉన్న వినియోగదారుల కోసం హెచ్‌టి-గ్రీన్ పవర్ కేటగిరీని పునరుద్ధరించినట్లు చెప్పారు. హెచ్‌టి లోడ్ ఫ్యాక్టర్ ప్రోత్సాహకాల పథకాన్ని మళ్లీ అమలు చేయాలని డిస్కాంలను ఏపిఇఆర్‌సి ఆదేశించింది. రాష్ట్రంలో మిగులు విద్యుత్ అందుబాటులో ఉన్నందు వల్ల పరిశ్రమల అభివృద్ధికి వీలుగా ఈ స్కీంను అమలు చేయాలని, ఈ విషయమై నివేదికలను రెండు నెలల్లో పంపాలని డిస్కాంలను ఏపిఇఆర్‌సి ఆదేశించింది. ఒక ప్రశ్నకు బదులిస్తూ ఆంధ్రాలో 72 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉండగా, 68 వేల ఎంయు విద్యుత్‌కు డిమాండ్ ఉందని ఏపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ చెప్పారు.