రాష్ట్రీయం

నేడు ఒంటిమిట్టలో కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, మార్చి 29: కడప జిల్లా ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరాముడి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి కన్నుల పండువగా జరుగనుంది. శ్రీరామచంద్రుడు సీతమ్మతల్లి మెడలో మాంగల్యధారణగావించే సుందర ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కల్యాణోత్సవానికి ఒంటిమిట్టలో టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. విద్యుత్ దీపాలంకరణతో ఒంటిమిట్ట దేవాలయం, పరిసర ప్రాంతాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. చంద్రుని కోరిక మేరకు ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి సీతమ్మవార్ల కల్యాణ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కల్యాణ వేడుకలను తిలకించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా రానున్నారు. భక్తులు స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు సుమారు రూ. 3 కోట్ల వ్యయంతో టీటీడీ ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఈ షెల్టర్లల్లో సీఎం, మంత్రులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వీఐపీలు, ఇతర నాయకులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. భక్తులు విడివిడిగా కూర్చునేలా ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొ గ్యాలరీలో ఒక్కో ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. కల్యాణం రాత్రి పూట జరుగుతున్నందున భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు ఏర్పాటుచేస్తున్నారు. కల్యాణం అనంతరం తలంబ్రాలు పంపిణీ చేసేందుకు 200 స్టాల్స్ ఏర్పాటు చేశారు. కల్యాణ వేదికను రంగురంగుల పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. టీటీడీ ఇంజినీరింగ్ విభాగం డీఈ రాఘవయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఇ కృష్టారెడ్డి పర్యవేక్షణలో కల్యాణవేదిక ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీనివాసరావు నేతృత్వంలో సుమారు 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. భక్తుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, మంత్రులు, సీఎం వెళ్ళే రహదారులు తెలిపే విధంగా బోర్డులు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట గుండా వెళ్లే జాతీయ రహదారిపై వాహనాలను సైతం మళ్లిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుండి భారీ వాహనాలను ముమ్మరగుంటపల్లె నుండి రాజగుడిపల్లె, మలకాటపల్లె మీదుగా ఒంటిమిట్ట చెరువు టర్నింగ్ నుండి తిరుపతికి వెళ్లేలా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
గరుడ వాహనంపై విహరించిన రాముడు
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి గరుడవాహన సేవ నిర్వహించారు. ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని మోహినీ రూపంలో అలంకరించారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామిని మాడావీధులు, గ్రామవీధుల్లో ఊరేగించారు. రాత్రి శ్రీసీతాలక్ష్మణ సమేత రాములవారిని గరుడ వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం కన్నులపండువగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు.

చిత్రం: ఒంటిమిట్టలోని దేవతామూర్తులు. గురువారం నిర్వహించిన గరుడ వాహన సేవ