రాష్ట్రీయం

గోదావరిలో జల సంక్షోభం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 29: సీలేరు జలవిద్యుత్ కేంద్రం నుంచి రావాల్సిన జలాలను ఎపుడో వాడేశాం.. దీనికి తోడు విద్యుత్ ఉత్పత్తిని బైపాస్ చేసి మరీ అదనపు జలాలను కూడా వాడేసుకున్నాం. మరో 10 రోజుల వరకు అంటే దాదాపు ఏప్రిల్ 10 వరకు కచ్చితంగా నీరు తప్పనిసరి. గోదావరి నదిలో సహజ నీటి లభ్యత పూర్తిగా అడుగంటింది. ఈ నేపథ్యంలో రబీ వరిని జల సంక్షోభం వెంటాడుతోంది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి వద్ద నీటి మట్టం రోజు రోజుకీ దిగజారుతోంది. జీవనది గోదావరి ప్రవాహ గమనం చాలా చిత్రంగా వుంటుంది. గత ఏడాది మండుటెండల మేలోనూ నిండుగా ప్రవహించింది. వేసవి కాలంలోనూ ఎపుడూ లేని విధంగా బ్యారేజి నుంచి జలాలను సముద్రంలో వృథాగా వదిలేసిన పరిస్థితి అపుడు. ఈ ఏడాది పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా వుంది. ఇంకా ఎండలు ముదరకముందే చుక్క నీటిని కూడా ఒడిసి పట్టుకునే పరిస్థితి. సీజన్ ముందు నుంచీ సీలేరు జలాలను వినియోగించడం జరిగింది. ఇదే దామాషాలో నీటి విడుదల జరిగితే రబీని దర్జాగా గట్టెక్కగలమని అంచనావేసిన అధికారుల్లో ఒకింత బెరుకు వెంటాడుతున్నప్పటికీ ప్రభుత్వం పూర్తి ఆయకట్టుకు సాగునీరు ఇస్తామని చెప్పి మొత్తం ఆయకట్టుకు అనుమతించింది. ఇపుడు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి దాపురించింది. సీలేరు నుంచి విద్యుత్ ఉత్పత్తికి వినియోగించకుండా అవసరాన్ని బట్టి ముందే వినియోగించుకోవడం వల్ల సరిగ్గా కీలకమైన దశలో నీటికి వెంపర్లాడాల్సిన పరిస్థితి దాపురించింది. మరో పది రోజుల వరకైనా నీటిని విడుదల చేసేందుకు ఎపీ జెన్కో అధికారులతో జల వనరుల శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఏదో విధంగా నీటిని విడుదల చేయాల్సివుందని జల వనరుల శాఖ ధవళేశ్వరం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణారావు ఆధ్వర్యంలో ఇంజనీర్ల బృందం సీలేరు వెళ్ళి జెన్కో అధికారులతో చర్చలు జరుపుతోంది. ఇక్కడ వీ కుదరని పక్షంలో మన కోటా నుంచి అదనంగా నీరిచ్చే విధంగా బలిమెల నుంచి ఒప్పించడానికి ఆటు ఒడిస్సా, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులిద్దరు చర్చించుకోవాల్సివుంది. ఒడిస్సా రాష్ట్రం బలిమెల నుంచి అదనపు జలాలు ఇస్తే అందుకు ప్రతిగా విద్యుత్ ఇస్తే, పరిస్థితులు చక్కబడవచ్చని అంచనా వేస్తున్నారు. అంతవరకు వెళ్ళకుండానే సీలేరు నుంచి జలాలు వచ్చేలా వుంటే మాత్రం పూర్తి స్థాయిలో గట్టెక్కుతుందని అనుకుంటున్నారు. ఏదేమైన్పటికీ మరో ఏడు టిఎంసీలైనా సీలేరు నుంచి వస్తే తప్ప రబీ అవసరాలు, వేసవి దాహార్తి తీరేట్టు కనిపించడంలేదు.
గత ఏడాది ఇదే సమయానికి కాటన్ బ్యారేజి వద్ద నీటి మట్టం 13.32 మీటర్లు వుంది. ఇపుడు ప్రస్తుతం 12.50 మీటర్లుంది. ఇంకా దిగజారే పరిస్థితి కన్పిస్తోంది. 12 మీటర్లకు దిగజారితే డెడ్ లెవెల్‌గా చెప్పుకోవచ్చు. వారానికి 20 సెంటీ మీటర్ల చొప్పున నీటి మట్టం దిగజారుతోంది. గత ఏడాది ఇదే రోజుల్లో 9800 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వుంది. ఇపుడు 6739 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వుంది. ప్రస్తుతం బ్యారేజి నుంచి 125 డ్యూటీలో రబీకి నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టాకు 2100 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు 1380 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 3680 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సీలేరు నుంచి గోదావరిలోకి 4000 నుంచి 4500 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. విద్యుత్ ఉత్పత్తిని బైపాస్ చేసి నీటిని విడుదల చేయడం పూర్తిగా రద్దయింది. మూడు డెల్టాలకు కలిపి విడుదల చేస్తున్న 7160 క్యూసెక్కుల్లో 4010 క్యూసెక్కులు సీలేరు జలాలు కాగా మిగిలింది మాత్రమే గోదావరి సహజ నీటి లభ్యతగా వుంది. రబీ ఒక నెల రోజులు ముందుగానే నాట్లు పడి వుంటే నీటికి ఇంత గడ్డు పరిస్థితి వుండేది కాదు. ఇటు సీలేరు, అటు సహజ నీటి లభ్యత లెక్క అంచనావేసి 87 టిఎంసిలతో అవసరాలు తీరుతాయని రబీ కార్యాచరణ ప్రణాళిక చేపట్టారు. అయితే ఇప్పటి వరకు సుమారు 60 టిఎంసీల వరకు సీలేరు జలాలను, సుమారు మరో 20 టిఎంసీల వరకు గోదావరి సహజ నీటి లభ్యత ద్వారా వెరసి 80 టిఎంసీలు రబీ సీజన్ ఆరంభం నుంచి అంటే డిసెంబర్ ఒకటి నుంచి ఇప్పటి వరకు వినియోగించుకుని నెట్టుకురావడం జరిగింది.
ఇంకా దాదాపు ఏడు టిఎంసీల వరకు నీటి లభ్యత సమకూరితే రబీ దర్జాగా గట్టెక్కవచ్చు. ఏప్రిల్ 10 వరకు నీటికి డిమాండ్ వుంది. ఈ నేపథ్యంలోనే జల వనరుల శాఖ జెన్కోతో చర్చలు జరుపుతోంది. ఏదేమైనప్పటికీ ఆశాజనకమైన దిగుబడులిచ్చే రబీ గట్టెక్కడానికి నీటి కోసం వెంపర్లాడటం తప్పడం లేదు.