రాష్ట్రీయం

పిడుగుపాటుకు ఐదుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ/ బనగానపల్లె/ చిలమత్తూరు, ఏప్రిల్ 2: అల్పపీడన ద్రోణితో రెండు రోజులుగా కురిసిన వడగళ్లవాన ఆస్తి నష్టానే్న కాదు, పిడుగులు కురిపించి ప్రాణ నష్టాన్నీ మిగిల్చింది. మొత్తంగా గత 48 గంటల్లో పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు మహిళలు, కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లా సరిహద్దు కర్నాటకలో ఇద్దరు రైతులు మృతి చెందారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పెమనకుంటపల్లికి చెందిన అమరమ్మ (48), లక్ష్మీదేవి (30) పిడుగుపాటుతో సోమవారం మృతి చెందారు. గ్రామానికి చెందిన కిష్టప్ప, అమరమ్మ దంపతులు తమ పొలంలో పనిచేస్తుండగా మధ్యాహ్నం 2-40 గంటల సమయంలో వర్షం రావడంతో సమీపంలోని చింతచెట్టు కిందకు చేరారు. అదే సమయంలో అక్కడే గొర్రెలను మేపుతున్న గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, అదే గ్రామానికి చెందిన నర్సిరెడ్డి అదే చెట్టుకిందకు చేరారు. కొద్ది సేపటికే పెద్ద శబ్ధంతో పిడుగు చింతచెట్టుపై పడటంతో అమరమ్మ, లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందారు. కిష్టప్ప, నర్సిరెడ్డి ఎగిరి దూరంగా పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పాతపాడు గ్రామంలో పిడుగు పడి బోయ సంజన్న (58) మృతి చెందాడు.
సంజన్న జ్వాలాపురం గ్రామంలోని పొలాల్లో గొర్రెలను మేపుతుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలానికి సమీపంలోని కర్నాటక రాష్ట్రం మార్గానికుంట మండలం ఎస్.కొత్తపల్లి గ్రామంలో పిడుగుపడి ఇద్దరు రైతులు నరసింహప్ప (62), సదాశివ (55) మృతి చెందారు. రైతులిద్దరూ సోమవారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వర్షం కురవడంతో సమీపంలోని చింతచెట్టు కింద ఉన్న గంగమ్మ గుడిలో తలదాచుకొన్నారు. పెద్ద శబ్ధంతో చెట్టుపై పడిన పిడుగు గుడిలోపలికి చొచ్చుకురావడంతో రైతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.