రాష్ట్రీయం

అన్నీ అబద్ధాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 5: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరు అని, ప్రతి బడ్జెట్‌లో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించి ప్రజలను మోసం చేస్తున్నాడని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాచైతన్య బస్సుయాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం వరంగల్‌కు వచ్చిన సందర్భంగా ఆయన హోటల్ అశోక కాన్ఫరెన్స్‌హాల్లో ‘కాగ్’ అద్దంలో ‘కేసీఆర్’ అబద్ధాలు అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసారు. ప్రభుత్వానికి కాగ్ మొట్టికాయ వేసినా బుద్ధి రాలేదని అన్నారు. కాగ్ నివేదికలోని అంశాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా బడ్జెట్‌ను మోసం చేసాడన్నారు. అధికారులతో బలవంతంగా బడ్జెట్ లెక్కలు పెట్టిస్తున్నాడని, అందుకు బాధ్యులైన అధికారులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేసారు. తాను వెల్లడిస్తున్న ఈ విషయాలు రాజ్యాంగం ప్రకారం అత్యంత విశ్వశనీయతగల సంస్థ ‘కాగ్’ వెల్లడించినవేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి రాబోయే కాలంలో ఒక్క గ్రామానికి సగటున 21వేల కోట్లు, ఒక్క కుటుంబానికి 2లక్షల 65వేలు, ప్రతి పౌరునిపై 63వేల రూపాయలు అప్పుగా పెట్టాడని అన్నారు. రాష్ట్రం నుండి వచ్చే ఆదాయాన్ని ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే సరిపోతుందని అన్నారు. 2014కి ముందు 61వేల కోట్లు ఉన్న అప్పు 2018 నాటికి లక్షా 80వేల కోట్లు అయిందని అన్నారు. ఇదే కాకుండా నగదు రూపంలో 41వేల కోట్లు కార్పొరేషన్‌ల పేరుతో అప్పులు చేసాడని అన్నారు. అప్పును ఆదాయంగా, ఖర్చును లోటుగా చూపించిన ఘనత
కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. కాగ్ అడిట్ లెక్క ప్రకారం లోటు 5392 కోట్లు ఉంది కాని ప్రభుత్వం 386కోట్లుగా అబద్ధపు లెక్క చూపిందని అన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం జీఎస్‌డీపిలో 3శాతం మాత్రమే ఆర్థిక లోటు ఉండాలి కాని తెలంగాణ సర్కార్ వినతిమేరకు 3.5 పరిమితికి అనుమతి తీసుకొని అది క్రాస్ చేసి 4.5 శాతం చేసారని అన్నారు. వైద్యం, ఆరోగ్యం కోసం అత్యంత తక్కువ కేటాయింపులు చేసి, అది కూడా పూర్తి స్ధాయిలో నిధులు ఇవ్వలేదని అన్నారు. పాఠశాల విద్య కోసం సైతం గత మూడు ఆర్ధిక సంవత్సరాల్లో కేటాయించింది 959 కోట్లు కాగా ఖర్చు చేసింది మాత్రం 221 కోట్లు మాత్రమేనని అన్నారు. అంతే కాకుండా 4వేల పాఠశాల మూసివేసిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. పైగా ఇప్పటి వరకు ఒక్క ఉపాధ్యాయ నియామకం కూడా చేపట్టలేదని అన్నారు. ఉన్నత విద్యకోసం కేటాయించింది 4708 కోట్లు కాగా ఖర్చు చేసింది మాత్రం కేవలం 3300 కోట్లు అన్నారు. మిషన్ భగీరథ ఒకపెద్ద మోసం, దగా అన్నారు. మిషన్ కాకతీయలో ప్రభుత్వం చెపుతున్న 5.6 లక్షల ఆయకట్టుకు ఎలాంటి ఆధారాలు లేవని కాగ్ తేల్చేసిందని అన్నారు. మిషన్‌కాకతీయ కూడా మరో పెద్ద మోసం అన్నారు అంతే కాకుండా విద్యుత్ వెలుగుల వెనుక చీకటి అవినీతి దాగి ఉందని తెలిపారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల అర్హుల సంఖ్య 22లక్షలు కాగా ఇప్పటి వరకు 5వేల ఇళ్ల నిర్మాణాలు జరుగలేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు 10వేల కోట్లు దారి మళ్లించారని అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకా కొనసాగడం తెలంగాణకు ప్రమాదకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు కేసీఆర్ నిజస్వరూపాన్ని తెలుసుకొని బుద్దిచెపాలని ఆయన కోరారు. ఇదే విషయాన్ని తాము ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి, మండలి పక్ష నేత షబ్బీర్‌అలీ, రాజ్యసభ్యుడు నంది ఎల్లయ్య, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, టీ పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద, రవళి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పిసిసి కో ఆప్షన్ సభ్యుడు ఇ.వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..పవర్‌పాయంట్ ప్రజంటేషన్ ఇస్తున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి