ఆంధ్రప్రదేశ్‌

‘గరుడ’ పురాణం.. ఎవరికి నష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 23: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అనుసరిస్తున్న ‘ఆపరేషన్ గరుడ’ వ్యూహం బెడిసికొడుతోంది. ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగినప్పటి నుంచి బీజేపీ, టీడీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో కత్తులు నూరుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్లమెంట్, నాలుగు శాసనసభ స్థానాలను టీడీపీ మద్దతుతో బీజేపీ దక్కించుకుంది. రాజ్యసభ, శాసనమండలి స్థానాలను సైతం దామాషా పద్ధతిన పంచుకున్నాయి. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమం ప్రజల్లో వేళ్లూనుకున్న నేపథ్యంలో బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. హోదా సాధ్యపడదని కేంద్రం తేల్చి చెప్పటంతో పాటు రాష్ట్రానికి మంజూరు చేయాల్సిన నిధుల్లో నిర్లక్ష్యం వహించటం, విశాఖపట్నం రైల్వేజోన్, కడప ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం పోర్టు, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లకు అనుమతుల మంజూరులో తాత్సారం చేయటంతో టీడీపీ రాష్ట్రంలో ఈ అంశాలనే బీజేపీపై అస్త్రాలుగా సంధిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించి నిధులు మంజూరు చేయకపోవటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. దీంతో బీజేపీ చంద్రబాబును టార్గెట్ చేసింది. ప్రత్యేక హోదా సాధ్యపడదని తేల్చిచెప్పటంతో పాటు విభజన చట్టంలోని అన్ని అంశాలను నెరవేర్చామని సుప్రీం కోర్టుకు సైతం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అందుకు ప్రతిగా టీడీపీ కేంద్రంపై అవిశ్వాసాన్ని ప్రకటించటం.. ఇతర పార్టీల మద్దతు కూడగట్టటం చకచకా జరిగాయి. ఏపీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో వ్యతిరేక ఫలితాలను చవిచూసిన బీజేపీ పూర్తిస్థాయిలో కేంద్ర సంస్థలను రంగంలో దించింది. బీజేపీ, టీడీపీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా పోటీ చేసినప్పటికీ కేంద్రంలో ఘన విజయం సాధించిన దగ్గర నుంచి బీజేపీ ‘దక్షిణాది రాష్ట్రాల్లో ఒంటరిపోరు’ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. దీన్ని అప్పట్లో తెలుగుదేశం పార్టీ తక్కువగా అంచనా వేసింది. ప్రతి అంశంలోనూ కేంద్రం నుంచి వ్యతిరేక సంకేతాలు అందుతున్న నేపథ్యంలో మేల్కొని కూటమి నుంచి వైదొలగింది. కర్ణాటకలో పట్టుకోల్పోయిన బీజేపీ ఏపీపై దృష్టి కేంద్రీకరించింది. ‘ఆపరేషన్ గరుడ’ పేరిట చంద్రబాబును ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే బీజేపీ వ్యూహాన్ని టీడీపీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తోంది. వాస్తవానికి విభజన హామీల అమలులో కేంద్రం తాత్సారం చేస్తోందనే విషయం జగమెరిగిన సత్యమే. టీడీపీని టార్గెట్ చేసే క్రమంలో ఒంటరి వ్యూహాన్ని పక్కనపెట్టి రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందనే ప్రచారానికి ఇటీవలి కాలంలో అనేక ఉదంతాలు ఊతమిస్తున్నాయి. విభజన అంశాల అమలులో కేంద్రంపై వైసీపీ, జనసేన ఎందుకు ఒత్తిడి తేవటంలేదనే వాదనలను కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు తెచ్చింది. అయితే మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ ఓటుబ్యాంక్ అధికంగా ఉన్న వైసీపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు అంటీముట్టనట్టు వ్యవహరించి జయాపజయాలను బేరీజు వేసుకున్న తరువాతే బీజేపీకి అంశాల వారీ మద్దతివ్వాలనే భావనతో ఉన్నట్లు తెలిసింది. కాగా, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రూ 75వేల కోట్ల మేర రాయితీలు రావాల్సి ఉందని నిజనిర్థారణ కమిటీతో నిగ్గుతేల్చిన జనసేన ప్రస్తుతం తటస్థంగా వ్యవహరిస్తోంది. అంటే ప్రతిపక్ష పార్టీలు బాహాటంగా బీజేపీకి మద్దతిచ్చే సూచనలు లేవు. దీనికితోడు పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ముఖ్యనేతల నుంచి సహకారం అందటంలేదని సమాచారం. దీంతో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన బస్సుయాత్ర వాయిదా పడుతూ వస్తోందని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. కన్నా పగ్గాలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలో బీజేపీకి జవసత్వాలు లభిస్తాయని అంతా భావించారు. అయితే నేతల మధ్య సమన్వయ లోపం ఇందుకు ప్రతిబంధకంగా మారిందని అంటున్నారు. ఎవరికి వారుగా టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించటం, దానికి టీడీపీ కౌంటర్ ఇవ్వటంతో పక్కా ఆధారాలు ఉన్న ఆరోపణలు కూడా పక్కదారి పడుతున్నాయని పలువురు నేతలు వాదిస్తున్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, ఇతర ప్రయోజనాల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిరసన వ్యక్తం చేస్తూ శాసనసభలో బీజేపీ ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు మద్దతివ్వటంతో ఎవరికి వారు అనే తీరుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రకటించిన ప్రచ్ఛన్న యుద్ధం వికటిస్తోందని చెపుతున్నారు. బాబ్లీ వద్ద 2010లో నిర్వహించిన ఆందోళన కేసుకు సంబంధించి ఇప్పుడు అరెస్టు వారెంట్ జారీ చేయటంతో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రలో టీడీపీకి సానుభూతి పెరిగిందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. పార్టీ ఎంపీలుగా గెలుపొందిన కంభంపాటి రామ్మోహన్, గోకరాజు గంగరాజు బీజేపీ అధిష్ఠానంతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే గుసగుసలు వినవస్తున్నాయి. ఎమ్మెల్యేల్లోనూ విష్ణుకుమార్‌రాజు ఇటీవల ఓ సందర్భంలో శాసనసభలో ‘నేను ప్రస్తుతం బీజేపీలో ఉన్నాను.. రేపు ఎక్కడ ఉంటానో తెలీదు’ అంటూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఎమ్మెల్యేలలో మాజీ మంత్రి మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణ మినహా మరో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు ఆంధ్ర ప్రయోజనాల విషయంలో హైకమాండ్‌తో విభేదిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు వచ్చే ఎన్నికలకు రాష్ట్రంలో అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నాయని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలావుంటే, చీటికిమాటికీ పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, ఇన్‌చార్జి మాధవ్ చేస్తున్న ఆరోపణలు పసలేనివని టీడీపీ కొట్టిపారేయటం పార్టీకి మైనస్ పాయింట్‌గా చెపుతున్నారు. కేంద్రం సహకరించకపోయినా రాజధాని, పోలవరం నిర్మాణాలు ఆగవని చంద్రబాబు చేస్తున్న ప్రచారం ఆంధ్ర ప్రాంత ప్రజలను ఓ రకంగా ఆలోచింపజేస్తోంది. నిధులు, హోదా ఇవ్వకపోగా కేంద్రం ఏపీ సర్కార్‌పై ఎదురుదాడికి దిగుతోందనే సానుభూతిని టీడీపీ పోగుచేసుకుంటోంది.