ఆంధ్రప్రదేశ్‌

ఇకపై ఒక ఫోన్ నెంబర్ నుంచి ఇద్దరికే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 5: ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు ఒకే ఫోన్ నెంబర్ నుంచి ఎక్కువ మందికి టిక్కెట్లు నమోదు చేస్తున్నారని, వచ్చే నెల నుంచి ఒక ఫోన్ నెంబర్ నుండి ఇద్దరికి మాత్రమే నమోదు చేసుకునేలా మార్పులు తీసుకువస్తామని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈఓ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా పలువురు భక్తులు ఈఓ దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన సునీల్, గుంటూరుకు చెందిన రామనారాయణ మాట్లాడుతూ ఫోటో తప్పనిసరి చేస్తే ఆన్‌లైన్ లక్కీడిప్‌లో అవకతవకలను అరికట్టవచ్చని సూచించారు. దీనిపై ఈఓ స్పందిస్తూ ఆన్‌లైన్ లక్కీడిప్ విధానంలో సాంకేతికంగా ఎలాంటి లోపాలు లేవన్నారు. ఇంటర్నెట్ సౌకర్యం సరిగాలేని గ్రామీణ ప్రాంతాల భక్తుల కోసం ఫోటోను తప్పనిసరి చేయడం జరిగిందన్నారు. ఇకపై అక్రమాలకు తావులేకుండా ఒక ఫోన్‌పై ఇద్దరికి మాత్రమే నమోదు చేసుకునేలా మార్పులు తెస్తామన్నారు. గుంటూరుకు చెందిన కృష్ణ, హైదరాబాద్‌కు చెందిన రమాదేవి మాట్లాడుతూ ఆన్‌లైన్ లక్కీడిప్‌లో 11 నెలలుగా ఆర్జిత సేవల కోసం నమోదు చేసుకుంటున్నా టిక్కెట్లు లభించడం లేదని తెలుపగా, పరిశీలిస్తామని ఆయన సమాధానమిచ్చారు. వైకుంఠ ఏకాదశినాడు వృద్ధులకు ప్రత్యేక దర్శనం కల్పించాలని బెంగుళూరుకు చెందిన లక్ష్మీదేవి, కర్నూలు రాధాప్రసాద్ కోరగా వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక రోజుల్లో సామాన్య భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేయడం జరిగిందని ఈఓ చెప్పారు. దివ్యాంగులకు రోజువారీ ప్రత్యేక దర్శనంతోపాటు నెలలో రెండుసార్లు అదనంగా ఎక్కువ మందికి దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. పరకామణి సేవలో వ్యాపారులకు అవకాశం కల్పించాలని విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన నరేష్ కోరగా పరిశీస్తామని ఈఓ సమాధానమిచ్చారు. కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎస్వీబీసీ ప్రసారం చేస్తున్న ఆధ్యాత్మిక విశేషాల్లో షిర్డీసాయి ఆలయం గురించి సమాచారం ఇవ్వాలని కోరగా ఎస్వీబీసీలో శ్రీవారి సేవలు, ఇతర ధర్మప్రచార కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నామని, షిర్డీసాయి ఆలయం గురించి వారి వెబ్‌సైట్‌లో చక్కటి వివరాలున్నాయన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన కిరణ్‌కుమార్ మాట్లాడుతూ స్కానింగ్ పాయింట్ల వద్ద కూడా భక్తులందరికీ తిరునామం పెట్టండని కోరగా ఇందుకు సానుకూలంగా స్పందించిన ఈఓ అందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతపురానికి చెందిన శ్రీనివాసులు మాట్లాడుతూ సీసీ కెమెరాలకు కూడా దొరక్కుండా టీటీడీ సిబ్బంది, పోలీసులు క్యూలైన్లలోకి తమ వారిని దర్శనానికి తీసుకెళుతున్నారని, ఆలయంలో అయ్యవార్లకు డబ్బులు ఇస్తేనే ప్రసాదాలిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై ఈఓ స్పందిస్తూ అధికారులతో తనిఖీలు నిర్వహించి ఇకపై ఇలాంటివి జరగకండా చూస్తామన్నారు. సిఫార్సు లేఖలపై గదులిస్తారా అని విశాఖకు చెందిన రామారావు కోరగా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై నిర్దేశించిన కోటా మేరకు గదులు కేటాయిస్తామని, ప్రత్యేక పర్వదినాలు, రద్దీ రోజుల్లో సిఫార్సు ఉత్తరాలు స్వీకరించమని స్పష్టం చేశారు. హైదరాబాదుకు చెందిన సత్యనారాయణ మాట్లాడుతూ లడ్డూప్రసాద సేవ వయోపరిమితిని 70 సంవత్సరాలకు పెంచాలని కోరగా పరిశీలిస్తామని ఈఓ అన్నారు. శ్రీవారి ఆలయంలో పురుష సేవకులు మహిళలను, మహిళా సేవకులు పురుషులను లాగేస్తున్నారని, వృద్ధుల ప్రత్యేక దర్శనం, వయోపరిమితిని 60 సంవత్సరాలకు తగ్గించాలని హైదరాబాదుకు చెందిన ప్రసాద్ కోరారు. దీనిపై ఈఓ స్పందిస్తూ భక్తులను లాగవద్దని సిబ్బందికి, శ్రీవారి సేవకులకు స్పష్టమైన ఆదేశాలిస్తామన్నారు. భక్తులు ఎవరికివారు ముందుకు కదిలితే ఇలాంటి సమస్య ఉండదని, నడవ లేనివారికి, దివ్యాంగుల కోసమే ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాదుకు చెందిన రమేష్ మాట్లాడుతూ జేఈఓ కార్యాలయం వద్ద సిబ్బంది లోనికి అనుమతించలేదని ఫిర్యాదు చేయగా వేసవిలో అదిక రద్దీ కారణంగా బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించ లేదన్నారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, జేఈఓ కార్యాలయ సిబ్బందికి తగిన సూచనలు ఇస్తామని చెప్పారు. ఈకార్యక్రమంలో తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, శే్వత సంచాలకులు ఎన్.ముక్తేశ్వరరావు, ఇన్‌చార్జ్ సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, విఎస్‌ఓ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.