ఆంధ్రప్రదేశ్‌

తుంగభద్రకు పోటెత్తిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్ళారి, ఆగస్టు 16: వరద నీటితో తుంగభద్ర నది పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద పెద్దమొత్తంతో రావడంతో 33 గేట్లు ఎత్తి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో తుంగభద్ర నది వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తుంగభద్ర జలాశయానికి అంతకంతకు వరద పెరుగుతుండడంతో గురువారం 33 గేట్ల ద్వారా 2,16,040 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం 28 గేట్లను 5.5 అడుగుల మేర మరో 5 గేట్లను అడుగు మేర ఎత్తారు. ఎగువ నుంచి జలాశయానికి 2,09,319 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 93.10 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఉద్ధృతంగా గోదావరి
రాజమహేంద్రవరం: గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో ప్రవాహం పెరుగుతుండటంతో దిగువ ధవళేశ్వరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం నిత్యం లక్షలాది క్యూసెక్కుల వరద జలాలు బ్యారేజి నుంచి సముద్రం పాలవుతున్నాయి. బ్యారేజీ గేట్లను ఎత్తివేసి వచ్చిన జలాలను వచ్చినట్టుగా సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. గురువారం బ్యారేజి నుంచి 4 లక్షల 11వేల 876 క్యూసెక్కులు సముద్రంలోకి విడిచి పెట్టారు. బ్యారేజి వద్ద 6.50 అడుగుల నీటి మట్టం నమోదైంది. గత జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 822.99 టీఎంసీల వరద జలాలు సముద్రంలోకి వృథాగా పోయాయి. ఇప్పటి వరకు బ్యారేజి నుంచి తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టాలకు 60.75 టీఎంసీల జలాలను వినియోగించగా, పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 31.64 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తోడారు. ప్రస్తుతం కృష్ణాలో కూడా వరద జలాలు సముద్రంలోకి విడిచి పెట్టే విధంగా వరద తాకిడి ఉండటంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను తోడటం నిలిపివేశారు. గోదావరి ఆవాసిత ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద గోదావరి పొంగి పొర్లుతోంది. ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కొండవాగులు పొంగుతున్నాయి. గోదావరి ఉపనది శబరి పొంగుతోంది. శబరి నుంచి వరద గోదావరి నురగలు గక్కుతూ ప్రవాహిస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి పొంగుతున్నాయి. భద్రాచలం వద్ద ప్రవాహ మట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద 34.80 అడుగుల నీటి మట్టం నమోదైంది. కాళేశ్వరం వద్ద 8.75 మీటర్లు, పేరూరు 13.16, దుమ్ముగూడెం 10.40, కుంట 12.80, కూనవరం 13.10, పోలవరం 10.45, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద 14.48 మీటర్ల మట్టంలో వరద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇదిలా ఉండగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఇటు దిగువ ప్రాంతంలోనూ, అటు ఎగువ ప్రాంతంలోనూ పరీవాహ గ్రామాలను అప్రమత్తం చేశారు. పర్యాటక లాంచీలను, బోట్లను నిలుపుదల చేశారు. ఏజెన్సీ గ్రామాల్లో పడవల ద్వారా జరిగే ప్రయాణాలను నిలిపి వేశారు.
శ్రీశైలానికి మరోమారు భారీ వరద
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి మరో మారు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రెండు వారాల క్రితం వచ్చిన వరద ప్రవాహంతో జలాశయానికి 150 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరింది. కృష్ణాబోర్డు ఆదేశాల మేరకు దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయడంతో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో ఎగువ కృష్ణా, తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మరోమారు రెండు నదుల ద్వారా నీరు పెద్ద మొత్తంలో జలాశయానికి చేరుతోంది. గురువారం సాయంత్రం జలాశయం నీటిమట్టం 874.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి మట్టానికి మరో 11 అడుగుల నీరు చేరాల్సి ఉంది. జలాశయంలో నీటి నిల్వ 160.53 టీఎంసీలుగా నమోదు కాగా పూర్తిస్థాయి నీటి నిల్వకు మరో 55 టీఎంసీల నీరు అవసరముంది. కృష్ణా, తుంగభద్ర నుంచి 2,12,110 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రాజెక్టు కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం దిగువకు సుమారు 80 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ద్వారా ఆరు వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. కాగా జలాశయానికి మరో నాలుగైదు రోజులు మాత్రమే భారీ ప్రవాహం ఉంటుందని ఆ తరువాత తగ్గుముఖం పడుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
పరవళ్లు తొక్కుతున్న శబరి నది
చింతూరు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శబరి నదిలో భారీగా నీరుచేరి పరవళ్లు తొక్కుతోంది. శబరి నది ఉప్పొంగి ప్రవహించడంతో శబరికి అనుసంధానమైన సోకిలేరు, చీకటి, కుయిగూరు, చంద్రవంక, వీరాపురం వాగులు రహదార్లపై ప్రవహిస్తున్నాయి. దీనితో తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం జలదిగ్బంధంలో చిక్కుకున్నట్టయ్యింది. సోకిలేరు వాగు రహదారిపై ప్రవహించడంతో చూటూరు, ముకునూరు, నర్సింగపేట, ఏజీ కొడేరు, ఉలుమూరు, గవళ్లకోట, చదలవాడ, మిట్టవాడ, చౌలూరు తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుయిగూరు వాగు పొంగిపొర్లడంతో కుయిగూరు, కళ్లేరు, మెట్టగుంపు తదితర గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చంద్రవంక వాగు పొంగి పొర్లడంతో కుమ్మూరు, రేగులపాడు, బొజ్జరాయిగూడెం తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చిడుమూరు వద్ద వీరాపురం వాగు పొంగి పొర్లడంతో 30వ నెంబరు జాతీయ రహదారిపై నీరు చేరింది. దీనితో ఆంధ్రా నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ఒకపక్క గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో మరోపక్క శబరి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మండలంలోని లోతట్టు ప్రాంత ప్రజల్లో వరద భయం అలుముకొంది. మండల కేంద్రం చింతూరులో లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇళ్లల్లో వరద నీరు చేరుకుంది. దీనితో బాధితులు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు బయలుదేరారు. ఇదిలావుండగా వరద సమాచారం లోతట్టు ప్రాంత ప్రజలకు అధికారులకు చేరవేయకపోవడంపై ముంపునకు గురైన ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదపై సమాచారం అధికారులు అందించి ఉంటే తాము ఇళ్లను ఖాళీచేసి వెళ్లేవారమని బాధితులు వాపోతున్నారు. వాగులు రహదారులపైకి ఎక్కి ప్రవహిస్తుండటంతో చింతూరు ఐటీడీఏ పీవో అభిషిక్త్ కిషోర్ వెళ్లి వరద నీటిని పరిశీలించారు.
భద్రాద్రి వద్ద గోదావరి ఉద్ధృతి
భద్రాచలం టౌన్: భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి గురువారం ఒక్కసారిగా పెరిగింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు, వాగుల నుంచి వరద నీరు గోదావరిలో కలుస్తోంది. దీంతో గంటగంటకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద గురువారం మధ్యాహ్నం 31.1 అడుగుల వద్ద నిలకడగా కనిపించిన నీటిమట్టం రాత్రి కడపడి వార్తలందే సరికి 40.2 అడుగులకు చేరుకొంది. గంట గంటకు వరద పెరుగుతుండటంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ప్రాజెక్టులు, వాగులు ఉప్పొంగడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.