ఆంధ్రప్రదేశ్‌

హోగ్రంగా గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 22: ఉగ్ర గోదావరి ఇంకా ప్రచండ వేగంతో పరుగులు తీస్తూనేవుంది. ఏజెన్సీ, కోనసీమ లంక గ్రామాలను భయకంపితం చేస్తూ ఉగ్రరూపంతో ఉరకలు వేస్తోంది. ఎగువన భద్రాచలం వద్ద వరద కాస్తంత నిలకడగా ఉన్నప్పటికీ ఉపనది శబరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో మూడో ప్రమాద హెచ్చరికకు రెండు అడుగుల దూరంలో ప్రవాహం కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద బుధవారం సాయంత్రం ఆరు గంటలకు 15.30 అడుగుల నీటి మట్టం నమోదైంది. బ్యారేజి నుంచి 15 లక్షల 24వేల 268 క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి విడుదలచేస్తున్నారు. దీనితో దిగువన కోనసీమలో ముంపు కష్టాలు పెరుగుతున్నాయి. గురువారం సాయంత్రానికి వరద కాస్త తగ్గుముఖం పట్టవచ్చని అంచనావేస్తున్నారు. ఈ సారి వరద పరిస్థితులను సమీక్షించడానికి అధికారులకు టెక్నాలజీ బాగా దోహదపడింది. డ్రోన్ కెమెరాలతో వరద పరిస్థితులను వీక్షిస్తూ సమీక్షిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో చాలా గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. దేవీపట్నం, వి ఆర్ పురం, ఎటపాక, కూనవరం, చింతూరు మండలాల్లో లాంచీలను సిద్ధంగా వుంచారు. భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టినప్పటికీ శబరి పొంగుతుండటంతో విలీన మండలాల్లో గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. పలు గ్రామాలు జల దిగ్భంధమయ్యాయి. భద్రాచలం రోడ్డులో రాకపోకలు నిలిచిపోవడంతో మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. దేవీపట్నం వద్ద ఎస్పీ విశాల్ గున్నీ బోటుపై పర్యటిస్తూ వరద పరిస్థితులను సమీక్షించారు. కూనవరం వద్ద ప్రమాద స్థాయి దాటి 19.51 మీటర్ల వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వి ఆర్ పురం మండలంలో వద్దుగూడెం, శ్రీరామగిరితో పాటు పలు గ్రామాలు నీట మునిగాయి. తాగునీరు లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. మంచినీరు లభించక వరద నీటినే తాగునీటిగా వినియోగించే పరిస్థితి ఎదురైంది. విలీన మండలాలతోపాటు ముంపునకు గురై, జలదిగ్భంధంలో చిక్కుకున్న గ్రామాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ఏర్పాటుచేశారు. తాళ్లరేవు మండలం నీలపల్లి పంచాయతీ పరిధిలో యానాం సరిహద్దుల్లో కోరంగి నదిపై నిర్మించిన టైడల్ లాకు తలుపుల్లో ఒకటి బుధవారం తెల్లవారుజామున వరద ఉద్ధృతికి విరిగిపోయింది. దీనితో వరద పోటెత్తింది. కోనసీమలోని పి గన్నవరం మండలం శివాయిలంక, లంక గన్నవరం, నడిగాడి, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం, అయినవిల్లి లంక, పల్లపులంక, అద్దంకివారి లంక, పొట్టిలంక, పెదలంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఊడిమూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక, గంటిపెదపూడి లంక వాసులు నిత్యావసర సరుకులు తెచ్చుకునే అవకాశం లేక అవస్థలు పడుతున్నారు. అప్పనపల్లి వద్ద వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కాజ్‌వే నీట మునిగింది. భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వరద తగ్గేంత వరకు భక్తులు బాలబాలాజీ స్వామివారి దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని అమలాపురం ఆర్డీవో కోరారు.