సబ్ ఫీచర్

ఆరోగ్యబీమాతో ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశంలో ఆరోగ్యబీమా సేవల వినియోగంలో అద్భుతమైన ప్రగతి నమోదవుతోంది. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల వినియోగంలో ప్రజలు ఆసక్తి చూపించడం దీనికి కారణం. వైద్యసేవలు పొందడం, చికిత్సలు చేయించుకోవడంలో ఆరోగ్యబీమా అక్కరకొస్తున్నది. గత పదేళ్లలో ఆరోగ్యబీమా రంగం విస్తృతమవడం దీనికి సూచిక. పదిహేను శాతం ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఆరోగ్యబీమా అందుబాటులో ఉండటంతో ఇటీవలి కాలంలో బాలింతలు, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత పదేళ్లలో ప్రభుత్వ పథకాల ద్వారా ఆరోగ్యబీమా పొందుతున్నవారి సంఖ్య 14 శాతం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు, షెడ్యూల్డు కులాలు, గిరిజనులు ఆరోగ్యబీమా వల్ల వైద్యసేవలు సమర్ధంగా పొందగలుగుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య 2004తో పోలిస్తే 2014 నాటికి 22 శాతం పెరిగాయి. అలాగే ఇంటివద్దే జరిగే ప్రసవాల సంఖ్య 16 శాతం మేరకు తగ్గాయి. 2004లో ఒక్కశాతం జనాభా ఆరోగ్యబీమా చేయించుకుంటే 2014 నాటికి 15శాతం మంది హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకాల్లో చేరారు. నిజానికి ఆరోగ్యబీమాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రైవేటు సంస్థలు అందిస్తున్న ఆరోగ్యబీమా పాలసీలను కూడా ప్రజలు ఆదరిస్తున్నారని ఇన్స్యూరెన్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ) చెబుతోంది. ఈ సంస్థ ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం ఆరోగ్యబీమా సేవలు అందిస్తున్న సంస్థలు 2015-16 సంవత్సరంలో సమీకరించిన ప్రీమియం మొత్తం 21.7 శాతం అంటే రూ.24,448 కోట్ల మేరకు పెరిగింది. ఆరోగ్యబీమా పథకాల సంఖ్య, సేవలు, ప్రీమియం చెల్లింపుల్లో సౌలభ్యత, సరళత గడచిన దశాబ్దంలో విస్తృతమయ్యాయి. అందువల్ల ప్రజలు క్లిష్టమైన ఆరోగ్య సమస్యలకూ వైద్యసేవలు, చికిత్సలు పొందేందుకు అవకాశం మెరుగైంది. ఎన్‌ఎస్‌ఎస్‌ఒ గణాంకాల ఆధారంగా ‘బ్రూకింగ్స్ ఇండియా’ జరిపిన తాజా అధ్యయనం ప్రకారం అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా వైద్యచికిత్స తీసుకోనివారి సంఖ్య 2004లో ప్రతి వెయ్యిమందిలో 15.1 మంది ఉంటే 2014 నాటికి 12.4మందికి తగ్గింది. అంటే అస్వస్థతకు గురైనప్పుడు ఆరోగ్యబీమా సేవలు వినియోగించుకుని చికిత్స పొందుతున్నవారి సంఖ్య పెరుగుతోందన్నమాట.
గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వైద్యసేవలు, పథకాలు, వౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. ప్రైవేటురంగం తరపున కూడా ఇది కొనసాగాలి. అప్పుడే ఆయా ప్రాంతాల్లో ఆరోగ్యబీమా సత్ఫలితాలను సాధిస్తుందని ఐఆర్‌డిఎఐ చైర్మన్ టి.ఎస్ విజయన్ చెబుతున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ అందించిన జాతీయ ఆరోగ్య నివేదిక (2015) ప్రకారం ప్రభుత్వ బీమా సంస్థల ద్వారా ఏదో ఒక రూపంలో ఆరోగ్యబీమా పథకాల్లో చేరినవారి సంఖ్య 67 శాతం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కూడిన ఆరోగ్యబీమా పథకాల్లో చేరినవారి సంఖ్య 2004లో 5.5 లక్షలు కాగా, 2014లో ఆ సంఖ్య 37 కోట్లకు చేరింది. వైద్యం, ఆరోగ్యం విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థలు అందిస్తున్న పథకాల్లో చేరే విషయంలో గణనీయమైన ప్రగతి కనిపించడం శుభ పరిణామం.

-కృష్ణరవళి