సబ్ ఫీచర్

ప్రేమకూ ఓ పద్ధతి ఉంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రేమ’ అన్న రెండక్షరాల ఒక చిన్న మాటలో ఈ విశ్వమంత పెద్ద అర్థం, భావం ఇమిడి ఉన్నాయి. ప్రేమతోనే ఈ ప్రపంచం నడుస్తోంది. ప్రేమతోనే కుటుంబ, మానవ సంబంధాలు, నిండుగా మనుగడ సాగిస్తున్నాయి. మనిషి జీవితంలో ఎన్ని రకాల ప్రేమలు- ఎన్ని అనుబంధాలు! తల్లిదండ్రుల వాత్సల్యం, తోబుట్టువుల అనుబంధం, భార్యాభర్తల వైవాహిక బంధం ఇలా ఒకటా రెండా... ‘జగమంతా కుటుంబం’ అన్నట్టు మనుషుల జీవితాలన్నీ ఈ ప్రేమ అనే అంతః సూత్రంతోనే గుదిగుచ్చి ఒక దగ్గర బంధించి వేయబడుతున్నాయి. ఆ బంధం చాలా బలమైనది. ఎంత బలమైనదంటే మనిషి జీవించి వున్నంతవరకూ అతన్ని అంటిపెట్టుకుని ఉండేటంతగా.. అందుకే ‘మనిషి ప్రేమ జీవి’ అన్నారు.
అయితే- కాలగతిలో, పరిణామక్రమంలో ప్రేమ అన్నమాట తన విస్తృతార్థాన్ని కోల్పోయి ప్రేమ అంటే ప్రేయసీ ప్రియుల మధ్య ఉండే ఆకర్షణ, ఇష్టం అదే అన్న సంకుచితార్థానికి కుంచించుక పోయింది. ఇద్దరిలో ఏ ఒక్కరైనా ప్రేమతత్వాన్ని, ప్రేమ విలువను, పవిత్రతను తెలుసుకుని సున్నిత భావాలతో, స్పందనలతో ప్రవర్తిస్తున్నారా అంటే అదీ లేదు. ప్రతి పనిలో ఉన్నట్టే ప్రేమ వ్యవహారాల్లోనూ ఉండే ‘ఒక పద్ధతి, క్రమశిక్షణ, హుందాతనం’ పరస్పరం గౌరవించుకుంటున్నారా అంటే సమాధానం లేదు. ఈరోజుల్లో.. ఈ మోడ్రన్ యుగంలో ‘ప్రేమ, లవ్, ప్యార్’ అన్న పదాలు యువత పెదాలమీద ఊత పదాలుగా మారిపోయాయి. ‘నేను నీళ్లు తాగుతున్నాను.. అన్నం తింటున్నాను’ అన్నంత అవలీలగా ఓ దైనందిన కార్యక్రమంగా ‘నేను ప్రేమిస్తున్నాను’ అన్న మాట నిత్య వ్యావహారిక మాటగా మారిపోయింది. ప్రేమ అంటే బోయ్ అండ్ గర్ల్ మీట్ స్టోరీ అన్న చీప్ అర్థం స్థిరపడిపోయింది. ఇద్దరూ కలిసి బైక్‌మీద షికార్లు చేయడం, సినిమాలు, హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లకు వెళ్లడం, డ్యాన్స్‌లు చేయడం, అర్థరాత్రిదాకా తిరగడం, చెట్టుచాటునో, పొదమాటునో చేరి పబ్లిక్ ప్లేసుల్లో హద్దుమీరి శృంగార కార్యకలాపాలకు పూనుకోవడం ఇవన్నీ ప్రేమగానే పిలవబడుతున్నాయి. ఇపుడు నడుస్తున్నఈ ప్రేమాటలో ప్రేమలోని అసలైన అర్థం, భావం, ఆంతర్యం మాయమైపోయి, పలచబడిపోయి దాని విలువను కోల్పోతుండడం ‘కాల వైపరీత్యం’ అనే అనాలి. దీనికి కారణంఒకరకంగా నేటి సినిమాలే. ప్రేమ, లవ్ అంటూ అదేపనిగా ఊదరగొట్టి అక్కర్లేని అశ్లీలాన్ని సినిమా తెరమీద ఆసాంతం పరిచేసి యువతను రెచ్చగొట్టి వాళ్ల మెదళ్లను కలుషితం చేయడంవల్లే ఈ విపరీత పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. త్యాగంతో కూడుకుని ఉండాల్సిన ప్రేమలో పగ, ప్రతీకారం, కక్ష, హింస వీటికి చోటిచ్చి ప్రేమ అంటే బాధాకరమైందిగా ఓ జీవన్మరణ సమస్యగా మార్చేసారు. చంపటం, చావటం అన్నవే లక్ష్యంగా కత్తివేటులు, యాసిడ్ దాడులు, కిడ్నాప్‌లు, రేప్‌లు నిత్యకృత్యాలై పోయాయి ప్రేమ కథల్లో.‘యువతీ యువకుల మధ్య ఉండే శృంగార భావాలే ప్రేమ అంటే’- అని అనుకున్నా దానికీ కొన్ని హద్దులు, పద్ధతులు, విలువలు, బాధ్యతలు ఉంటాయి. అందులో ఒక పవిత్ర భావన, మానసిక అనుభూతి, ఆరాధనీయమైన ఆకర్షణ ఉండాలి. బోయ్ మీట్ గర్ల్ అంటే ‘అందుకే..’ అన్న తప్పుడు అభిప్రాయం పెద్దల మనసులో నుంచి తొలగాలంటే ప్రేమకు అసలైన అర్థాన్ని చెప్పగలిగేలా యువత ప్రవర్తన హుందాగా ఉండాలి. వాళ్ల వెకిలిచేష్టలను, శ్రుతిమించిన ప్రేమలను సమాజం గమనిస్తోందన్న, విమర్శిస్తోందోనన్న వంటిమీద స్పృహతో అబ్బాయిలు, అమ్మాయిలు బాధ్యతాయుతంగా మసలుకోవాలి. ప్రేమించడం తప్పు కాదు. తగిన సమయంలో కావాల్సిన అర్హతలన్నీ సాధించాక మనసులు కలిసిన సరైన జోడీ దొరికితే.. సున్నితమైన ప్రేమ భావాలను, సందేశాలను పరస్పరం అందజేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. పైగా అలాంటి ప్రేమ కుటుంబసభ్యులు, సామాజికుల ఆమోదాన్ని పొందుతుంది. బలవంతపు ప్రేమలు, హింసకు దారితీసే ఏకపక్ష ప్రేమలు, ‘నాకు దక్కకపోతే మరెవరికీ దక్కకూడదన్న’ స్వార్ధపూరిత, కక్షపూరిత ఘోరాలు, నేరాలు ప్రేమ వ్యవహారాలలో క్షంతవ్యం కాదు. రెండు మనసులు కలిసిందీ.. ఇరువురి అంగీకారం కుదిరిందీ అదే అసలు ప్రేమ అంటే..ప్రేమ అంటే త్యాగం ఒకరి బాగును, క్షేమాన్ని కోరేది కాని వారి దుస్ధితికి కారణమయ్యేది ఎంతమాత్రంకాదు. ప్రేమతత్వాన్ని, ప్రేమలోని గొప్పతనాన్ని తెలుసుకోగలిగిన ప్రేమికులే అలా హుందాగా ప్రవర్తించ గలుగుతారు. కేవలం ఎట్రాక్టివ్, టెంపరరీ ప్రేమలతోనే అసలు సమస్యలు, చిక్కులు వచ్చేది.

- డా. కొఠారి వాణీ చలపతిరావు