సబ్ ఫీచర్

వైద్యం పేరిట దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో తామరతంపరగా పెరిగిపోతున్న ప్రైవేటు ఆసుపత్రులు రోగులను పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఎక్స్‌రే అవసరమున్నా అవసరం లేకున్నా ఎక్స్‌రే రాస్తారు. స్కానింగ్, ఎంఆర్‌ఐ, సీటి స్కాన్, తర పరీక్షలు కూడా యదేచ్ఛగా రాసేస్తున్నారు. పరీక్షలో రోగి జబ్బు ఏమిటో తెలిసిపోయినప్పటికీ ప్రిస్క్రిప్షన్ రాయకుండా అక్కరలేని వైద్యపరీక్షలు, స్కానింగ్‌లు రాస్తున్నారు. తర్వాత పది దాక మందుగోలీలు, సిరప్‌లు, వాయిల్స్ రాస్తూ పేద ప్రజలను దోచేస్తున్నారు. సరైన డాక్టర్ పట్టా లేనివారు, విదేశాల్లో నకిలీ డాక్టర్ పట్టాలు పొందినవారు పెద్ద అక్షరాలతో బోర్టులు, ఫ్లెక్సీలు కట్టి రోగులను ఆకర్షిస్తున్నారు. రెండు టాబ్లెట్లతో తగ్గే రోగాన్ని మెడికల్‌షాపు టార్గెట్స్ కోసం అక్కరేని రకరకాల మందులు రాస్తున్నారు.
రోగులకు అర్థమయ్యే రీతిలో స్పష్టంగా పెద్ద అక్షరాలతో మందులు రాయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కోర్టులు ఆదేశించినా పట్టించుకునే నాధుడే లేడు. వీరు రాసే ప్రిస్క్రిప్షన్ రాత బ్రహ్మదేవుడికి కూడా అర్థం కాదు. ఇదేం వైద్యమో పాలకులకే తెలియాలి. ఇక ఫార్మసీ పూర్తి చేసినవారు మాత్రమే మెడికల్ షాపులను నడపాలి. కానీ ఔషధ నియంత్రణాధికారుల నిర్లక్ష్యం వల్ల, ఎవరు పడితే వారు ఔషధ దుకాణాలను తెరుస్తున్నారు. డాక్టర్ జబ్బుకోసం మందొకటి రాస్తే, మెడికల్ షాపు నిర్వాహకునికి అర్థం కాక మరొక రకం మందులు ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. అందువల్ల అద్దెకు ఇచ్చిన ఫార్మసీ సర్ట్ఫికెట్లను ఆకస్మిక తనిఖీల ద్వారా గుర్తించి రద్దు చేసేవిధంగా చట్టంతీసుకొని రావాల్సిన అవసరం ఉంది. కాలం చెల్లిన నాసిరకం మందులను బహిరంగంగా అమ్ముతున్న వైద్య ఆరోగ్యశాఖ అధికార్లు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల మీద ఆదాయపు పన్ను అధికార్లు తరచు దాడులు చేస్తే మెడికల్ రంగంలో అవినీతి కొంతమేర తగ్గగలదు.
జిల్లా వైద్యాధికారి పోస్టు రావాలంటే దాదాపు రూ.40 నుంచి రూ.50 లక్షలవరకు పలుకుతున్నదన్న ఆరోపణలున్నాయి. వైద్యశాఖలో అవినీతి ఎంతమేర కూరుకుపోయిందో దీన్నిబట్టి తెలుస్తోంది. ఇక మెడికల్ షాపుల పునరుద్ధరణ పేరిట అధికార్లు అడ్డగోలుగా నిలువుదోపిడీ చేస్తున్నారని షాపుల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. లంచాలు ఇస్తేనే పని చేస్తామని జిల్లా, రాష్ట్ర స్థాయి అధికార్లు తెగేసి చెబుతున్నారు. ప్రతి ఆది, మంగళ, బుధ వారాల్లో స్పెషలిస్టులు వస్తున్నారంటూ మెడికల్ షాపు యజమానులే టోకెన్లు జారీ చేసి అక్రమార్జనకు తెరతీస్తున్నారు. కాగా ప్రభుత్వ అనుమతులు లేని నర్సింగ్‌హోమ్‌లపై అధికార్లు దాడులు చేసి కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేస్తే రోగులకు కొంతమేర న్యాయం జరుగుతుంది. కానీ లంచాలు మరిగిన అధికార్లు తూతూమంత్రంగా తనిఖీలు కానిచ్చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పేరిట ప్రైవేటు ఆసుపత్రులు నిలువుదోపిడి చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. కేవలం డబ్బుకోసమే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు తెరిచారన్నది జగమెరిగిన సత్యం. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో పనిచేసేవారు తమ విధులను సక్రమంగా నిర్వహించడంలేదన్న ఆరోపణలున్నాయి. డాక్టర్లు, సిబ్బందికి జీతంపై ఉన్న శ్రద్ధ విధి నిర్వహణ పట్ల ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. అందువల్ల ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ మెషిన్లు, సిసి కేమెరాలు అమర్చాలి. ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది హాజరును ఆన్‌లైన్ చేయాలి.
అడ్డగోలు ఫీజులను వసూలు చేయడం వల్ల, ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు కొనే్నళ్లలోనే కోటీశ్వరుల జాబితాలో చేరిపోతున్నారు. కాగా మండలాలు, గ్రామాల్లోని మెడికల్‌షాపుల దోపిడీని అరికట్టాలి. జనరిక్ మందుల అమ్మకాల దుకాణాలను తెరవాలి. జిల్లాస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మీద నిఘా బృందాలను ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు చేపట్టాలి. తప్పు రోగనిర్ధారణ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

-రావుల రాజేశం