సబ్ ఫీచర్

క్రీడలపై చిన్నచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పాల్గొనడానికి మన దేశంనుంచి ‘జుంబో’ స్థాయిలో క్రీడాబృందాన్ని పంపించడం, పతకాలు సాధించడంలో వారు విఫలం కావడం, వెంటనే అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధించడం భారతీయులకు అలవాటుగా మారింది. మన క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇస్తున్నామా? లేదా? అనే విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. దేశంలోక్రీడల అభివృద్ధికి పాలకపక్షాలు ఇస్తున్న హామీలు నీటిమీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. ఆర్థికంగా స్థిరపడినవారు ఎవరూ తమ పిల్లలను క్రీడలవైపు రానివ్వడం లేదు. వారు తమ పిల్లల్ని కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో బందీలుగా మార్చుతున్నారు. ఇక మిగిలింది పేద, మధ్యతరగతి వర్గాలకు చెందినవారు. వీరు క్రీడల మీద ఆసక్తి ఉన్నా అష్టకష్టాలు పడుతున్నారు. మన దేశంలో క్రికెట్‌కు మినహా, మిగతా క్రీడలకు, క్రీడాకారులకు స్పాన్సర్లు లభించరు. క్రీడాకారులు ఎవరైనా జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పతకం సాధించిన తర్వాత పాలకులు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటిస్తారు. అయితే, ముందుగా మాత్రం ఎలాంటి మద్దతు లభించదు.
క్రీడల పట్ల ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యవైఖరి కారణంగా తీవ్ర నిరాశకు గురైన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. వారిలో పొగట్ సిస్టర్స్‌దే ప్రథమ స్థానం. మన దేశంలో లైంగిక వివక్షకు మారుపేరు హర్యానా రాష్ట్రం. హర్యానాకు చెందిన పొగట్ సిస్టర్స్ (గీత, బబిత, వినేష్, సంగీత, రీతు) కుస్తీ పోటీలలో బాగా రాణిస్తున్నారు. గీత తండ్రి మహావీర్ పొగట్ కుస్తీ వీరుడు. ఆయన తన ముగ్గురు కుమార్తెలు గీత, బబిత, వినేష్‌తోపాటు సోదరుని కుమార్తెలు సంగీత, రీతులకు కూడా కుస్తీలో తర్ఫీదు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహావీర్ పొగట్‌ను ద్రోణాచార్య అవార్డుతో సత్కరించింది. పొగట్ సిస్టర్స్ 2012-13, 2013-14, 2014-15 సంవత్సరాలలో జరిగిన పలు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పలు పతకాలను సాధించారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాల ప్రకారం వారికి 50 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. అయితే, ప్రకటనలే తప్ప వీరికి నేటివరకు రూపాయి కూడా అందలేదు.
రియో ఒలింపిక్స్‌లో కుస్తీ పోటీలో పాల్గొంటున్న సమయంలో వినేష్ పొగట్ మోకాలికి తీవ్ర గాయం అయింది. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని హర్యానా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అధికారులు ఆమెకు వైద్యం అందించాలనే విషయాన్ని పట్టించుకోలేదు. 2015లో బబితకు కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రకటించాక, హర్యానా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నజరానాను ప్రకటించింది. ఆ మొత్తం కూడా ఆమెకు ఇప్పటికీ అందలేదు. పొగట్ సిస్టర్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్న మహావీర్ పొగట్ ఇప్పటికే పలుసార్లు కేంద్ర మంత్రులను, అధికారులను కలిసినా ఫలితం శూన్యం. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. రియో ఒలింపిక్స్‌లో మన దేశం తరఫున 118 మంది క్రీడాకారులు పాల్గొంటే, 90 మంది అధికారులు కూడా వారితో వెళ్ళారు. అధికారులు బిజినెస్ క్లాస్‌లో, క్రీడాకారులు సాధారణ ప్రయాణీకుల మాదిరిగా విమాన ప్రయాణం చేశారు. క్రీడాశాఖ అధికారులు మన క్రీడాకారుల పట్ల ఎంత శ్రద్ధ చూపుతున్నారో ఇట్టే అవగతం అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో మన క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలలో పతాకలు సాధించాలని ఆశించడం అత్యాశే అవుతుంది.

-పి. భార్గవరామ్