సబ్ ఫీచర్

ట్రంప్‌కు సవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

70 ఏళ్ల వయసున్న డొనాల్డ్ జాన్ ట్రంప్ అమెరికా 45వ అధ్యక్షుడిగా హిల్లరీ క్లింటన్‌ను ఓడించి ‘శే్వతసౌధం’లో అడుగిడబోతున్నారు. ఎలాంటి పాలనానుభవం లేని ‘రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజం’ ట్రంప్‌కు ఇది అఖండ విజయం. కాకలు తీరిన రాజకీయ నాయకురాలు హిల్లరీ ఓటమి- ఆమెకు బదులు ప్రస్తుత దేశాధ్యక్షుడు ఒబామాకు తీవ్ర పరాభవంగానే పరిగణించాలి. దాదాపు గత రెండు దశాబ్దాల్లో అమెరికాలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరవై ఏళ్ల క్రితం అమెరికాకు, ఇప్పటి అమెరికాకు ఎన్నో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. సుమారు ఇరవై ఏళ్ల క్రితం అమెరికా ఓ ‘్భతల స్వర్గం-్భగ భూమి’. రాజకీయాల నుంచి సామాజిక జీవనం వరకు దైనందిన జీవనశైలి సహా ప్రతి విషయంలోను ఇపుడు అక్కడ వైరుధ్యం స్పష్టంగా గోచరిస్తున్నది. ప్రతివారిలోనూ ఏదో అభద్రతాభావం, ఏదో కోల్పోతున్నామన్న ఆందోళన, అంతో ఇంతో వెనకేసుకోవాలన్న ఆలోచన కనిపిస్తుందిప్పుడు. ఈ విషయంలో అమెరికన్లకు, వలస వచ్చి స్థిరపడిన ఇతర దేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు పెద్ద తేడా లేదనాలి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ఎదురయ్యే సవాళ్లు అన్నీ ఇన్నీ కావేమో!
అమెరికా చరిత్ర ఆధునికమైనదే అయినా, గట్టి పునాదులమీద లిఖించబడింది. సుమారు రెండు శతాబ్దాల క్రితం జార్జి వాషింగ్టన్ బ్రిటీష్ సైన్యాన్ని పారదోలి, అమెరికా అధ్యక్ష పదవిని ఏకగ్రీవంగా చేపట్టిన తర్వాత ఆటుపోట్లను అడపాదడపా ఎదుర్కొన్నా, తిరుగులేని ప్రపంచాధిక్య దేశంగా అమెరికా తన స్థానాన్ని పదిలపరచుకుంటోంది. 1929లో హూవర్ అమెరికా అధ్యక్షుడిగా వుండగా తొలిసారి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆ రోజుల్లోనే కోటి మందికి పైగా అమెరికన్లు ఉపాధి కోల్పోయారు. ఎన్నో బ్యాంకులు దివాలా తీశాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. అలా కొనసాగిన సంక్షోభం రూజ్వెల్ట్ ‘న్యూడీల్’తో కుదుటపడి ఒక కొలిక్కి వచ్చింది. ప్రభుత్వ నిధులతో నిరుద్యోగులకు ఉపాధి కలిగించేందుకు ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. బ్యాంకులను, పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకుంది. రెండో ప్రపంచ యుద్ధంలో రూజ్వెల్ట్ సారధ్యంలో అమెరికా విజయం సాధించిన తర్వాత ట్రూమన్ డాక్ట్రిన్ పుణ్యమా అని, కమ్యూనిజం వ్యాప్తిచెందకుండా వుండేందుకు పెద్దమొత్తంలో నిధులను ఖర్చుచేసింది అమెరికా. ఆ డాక్ట్రిన్ ప్రభావం, ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు, 1950 కొరియన్ యుద్ధంలో అమెరికా తన సైన్యాన్ని పంపాక చోటుచేసుకున్న పరిణామాలు, ‘అంతర్జాతీయ తీవ్రవాదం’, ‘సీమాంతర ఉగ్రవాదం’ ఆవిర్భావానికి పరోక్షంగా దోహదపడ్డాయి.
జాన్ కెనె్నడీ హత్యానంతరం అధ్యక్షుడయిన లిండన్ జాన్సన్ హయాంలోనే మొట్టమొదటిసారిగా ‘్ఫడ్ స్టాంప్స్ ప్రోగ్రాం’కు అంకురార్పణ జరిగింది. ఒబామా హయాంలో పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంది. వియత్నాంలో యుద్ధానికి ఐదు లక్షల మంది అమెరికన్ సైనికులను పంపిన జాన్సన్ అప్రదిష్టపాలైనాడు. ఆయన వారసుడు నిక్సన్ ఆ తప్పును సరిదిద్ది సేనలను ఉపసంహరించాడు. గత శతాబ్దం డబ్భై దశకంలో జిమీ కార్టర్ హయాంలో ద్రవ్యోల్బణం పెరిగి, నిరుద్యోగ సమస్య మరో మారు అమెరికాను కుదిపేసింది. ఉగ్రవాదం ఉద్ధృతరూపం దాల్చడం మొదలై, ఇరాన్‌లోని అమెరికన్ దౌత్య కార్యాలయంలోనే అమెరికన్లను బందీలుగా చేసే స్థాయికి చేరుకుంది. బందీల విడుదల కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో జిమీ కార్టర్ ఎన్నికల్లో ఓటమిని చవిచూశాడు. రీగన్ హయాం ఆరంభమై ‘కోల్డ్‌వార్’ రోజులకు నాంది పలికింది. సోవియట్ యూనియన్‌లో కమ్యూనిజంకు చివరి రోజులప్పుడే మొదలయ్యాయి. ‘రీగన్ మిక్స్’ మంచి చేసిందో, చెడు చేసిందో తెలియదు కాని, ఆయన తర్వాత అధ్యక్షుడిగా వచ్చిన సీనియర్ బుష్ హయాంలో ఆర్థిక మాంద్యం ఆరంభమై అనేక సామాజిక సమస్యలు తలెత్తాయి. ఆయన కాలంలోనే జరిగిన గల్ఫ్ యుద్ధం సీమాంతర ఉగ్రవాదానికి మరింత బలం చేకూర్చింది. బిల్ క్లింటన్ రోజుల్లో అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి.
ఒబామా కంటే ముందు అధ్యక్ష పదవిలో ఎనిమిదేళ్లున్న జూనియర్ బుష్‌కు మొదటి విడత అధికారంలో తొలి సంవత్సరమే చేదు అనుభవం ఎదురైంది. అగ్ర రాజ్యమైన తమనెవరూ ఏమీ చేయలేరని విర్రవీగిన అమెరికాను క్షణాలలో మట్టికరిపించి, న్యూయార్క్ నగరంలో ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’ టవర్స్‌ను 2001 సెప్టెంబర్ 11న ‘అల్ ఖైదా’ ఉగ్రవాదులు క్షణంలో నేలమట్టం చేశారు. పర్యవసానంగా ‘ఉగ్రవాదం’ మీద, ‘ఉగ్రవాదుల’మీద యుద్ధం ప్రకటించాడు బుష్. ఆఫ్ఘనిస్తాన్‌పై యుద్ధం చేసి అల్‌ఖైదా నాయకత్వాన్ని అక్కడనుండి పారదోలగలిగినా అమెరికాకు ఉగ్రవాదుల ముప్పు లేదని చెప్పలేం. ఇరాక్ మీద 2003లో యుద్ధం చేసి సద్దాం హుస్సేన్‌ను బంధించి, ఆ తర్వాత ఉరి తీసింది అమెరికన్ ప్రభుత్వం. అయినా అమెరికా పెంచిపోషించిన ఉగ్రవాదం అంతం కాలేదు, కాదేమో కూడా.
అమెరికా 44వ అధ్యక్షుడిగా ఆఫ్రికన్- అమెరికన్ నల్లజాతీయుడైన బరాక్ హుస్సేన్ ఒబామా జనవరి 20, 2009న అధికారం చేపట్టాడు. ఒకవైపు అంతర్జాతీయ ఉగ్రవాదం, మరోవైపు తీవ్ర ఆర్థిక మాంద్యం దేశాన్ని కుదిపేస్తున్న క్లిష్ట తరుణంలో అధ్యక్షుడయ్యాడు ఒబామా. ఆయన పదవీ కాలమంతా లోటు బడ్జెట్‌తోనే గడపాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు అప్పట్లో అంచనావేశారు. ఆయన దాన్ని ఎలాగో కొంతవరకూ అధిగమించాడు. తాను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న ఇరాక్ యుద్ధాన్ని కొనసాగించే విషయంలో ఒబామా వ్యూహం మార్చుకున్నాడు. అణ్వాయుధాల తయారీ పెద్దఎత్తున నిల్వచేయకపోవడం విషయంలో రష్యా, అమెరికా ఒక అంగీకారానికి వచ్చేలా ఒబామా చొరవ తీసుకున్నాడు. ఎనిమిదేళ్లుగా నడుస్తున్న ఆఫ్ఘన్ వ్యవహారానికి ‘చరమగీతం’ పాడతానని ప్రకటించి 30 వేల మంది అదనపు బలగాలను పంపేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఉగ్రవాదం అంతానికి తమకు తోడ్పడాల్సిందేనని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. ఆఫ్ఘన్‌పై ఒబామా నిర్ణయం స్వపక్షంలో, విపక్షంలో విమర్శలకు గురైంది. దేశంలోని సమస్యలకు పరిష్కార మార్గాలు కనుక్కుంటూ, తమకు నేరుగా సంబంధించిన అంతర్జాతీయ సమస్యలకే ప్రాధాన్యమిస్తూ, ఇతర సమస్యల జోలికి ఒబామా పోకుండా వుంటే మంచిదని పలువురు అమెరికన్లు భావించారు. చివరకు అల్ ఖైదా నాయకుడు, భయంకర ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టడమే కాకుండా, ఆయన మరణవార్తను స్వయంగా జాతికి వెల్లడించాడు ఒబామా. అమెరికా చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన హెల్త్‌కేర్ సంస్కరణల బిల్లుకు స్వపక్షం నుంచి ప్రతిపక్షం నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం పొందేందుకు ఒబామా చేయని ప్రయత్నం లేదు. అయినప్పటికీ చివరికి విజయం సాధించాడు.
అక్టోబర్ 9, 2009న ఒబామాకు నోబెల్ శాంతి బహుమానం ప్రకటించడం, దాన్ని ఆయన ఆస్లో నగరంలో నిరసన ధ్వనుల మధ్య అందుకోవడం జరిగింది. సరిగ్గా ఈ నేపథ్యంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ గెలిచిన ట్రంప్ జనవరి 2017లో అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. అంతర్జాతీయ సమస్యలు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగ సమస్య, జాతి వివక్ష, ఉగ్రవాద ప్రభావం లాంటి అనేక సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న అమెరికాను భవిష్యత్‌లో ఆయన ఎలా బాగుచేస్తాడో వేచి చూడాల్సిందే. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను, ఆ దేశానికి పెద్దఎత్తున వలస వస్తున్నవారి విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను ట్రంప్ ఏ విధంగా అమలుచేస్తాడో చూడాల్సిందే. విదేశీ వ్యవహారాల విషయంలో ఆయన నిర్ణయాలు ఎలా వుండబోతున్నాయో అనేది అమెరికన్లకూ, విదేశీయులకూ ఆసక్తికలిగించే విషయమే. ఏదేమైనా అమెరికాలో ఇక మహిళలు అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవడం ఇక కష్టమేమో!

-వనం జ్వాలా నరసింహారావు