సబ్ ఫీచర్

ములాయం చక్రవ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశంలో నెహ్రూ కుటుంబానికే పరిమితమైన వారసత్వ రాజకీయాలు నేడు అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. వామపక్షాలు, బిజెపి మినహా దాదాపు మిగిలిన పార్టీలన్నింటికీ రాజకీయాలు కుటుంబ ఆస్తిగా మారుతున్నాయి. సోనియా గాంధీ, ప్రకాష్‌సింగ్ బాదల్, ములాయం సింగ్ , లాలూప్రసాద్ , కెసిఆర్, చంద్రబాబు, ఫరూక్ అబ్దుల్లా, కరుణానిధి, శరద్‌పవార్, దేవగౌడ, మహబూబా ముఫ్తీ, అజిత్‌సింగ్.. ఇవన్నీ కుటుంబ రాజకీయాల సందర్భంగా వినిపించే పేర్లు. రాజకీయ వారసత్వానికి తాను వ్యతిరేకినని, తన వారసుడిని పార్టీ ఎన్నుకుంటుందని చెబుతూ వచ్చిన డిఎంకె అధినేత 93 ఏళ్ల కరుణానిధి తాజాగా స్టాలిన్‌ను తన వారసుడిగా ప్రకటించారు. వారసత్వంలో కుటుంబ సభ్యుల మధ్య పోటీ ఏర్పడితే కొడుకు, కుమార్తెలను మాత్రమే ఎంచుకోవడం పరిపాటిగా వస్తున్నది. యుపిలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఇపుడు అదే చేశారు. పార్టీలో తగు బలం ఉన్న తమ్ముళ్లు వుండగా- ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తన కొడుకు అఖిలేష్ ఎదగలేడని ఆయనకు తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా తమ్ముళ్లను తప్పించేందుకు ములాయం పావులు కదుపుతున్నారు. అయితే- తండ్రి, కొడుకు విడిపోతున్నారని, పార్టీ చీలిపోతున్నదని మీడియాలో కథనాలు వ్యాప్తి చెందాయి. పార్టీ రజతోత్సవ సదస్సు నేపథ్యంలో అఖిలేష్ చేపట్టిన ‘వికాస్ రథయాత్ర’ను ములాయం ప్రారంభించడంతో ప్రాముఖ్యత నెలకొన్నది. తనకు మద్దతుగా వున్న కారణంగా మరో బాబాయి రామ్‌గోపాల్ యాదవ్‌ను పార్టీ నుండి బహిష్కరించినా అఖిలేష్ నోరు మెదపకపోవడం గమనార్హం. అఖిలేష్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్న మరో బాబాయి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ రథయాత్రకు ముందు సహర్నపూర్, ఘజియాబాద్‌ల పర్యటనకు వెడితే సీనియర్ ప్రభుత్వ అధికారులు, చాలామంది పార్టీ నాయకులు దూరంగా వున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే ఐదేళ్ల క్రితం తండ్రి నుండి సిఎం పదవిని కైవసం చేసుకున్న అఖిలేష్ పార్టీపై ఆధిపత్యాన్ని తీసుకోబోతున్నారని స్పష్టం అవుతుంది. ఇదంతా ములాయం వ్యూహాత్మకంగా వేస్తున్న ఎత్తుగడలో భాగమే. ఈ రాజకీయ కుట్రలో నష్టపోతున్నది ఇద్దరు బాబాయిలు.
అఖిలేష్, శివపాల్‌ల మధ్య ఘర్షణలు బహిరంగమైన తర్వాత ములాయం అక్టోబర్ 25న చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరింప చేసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు సిఎంను ఎన్నుకుంటారని చెప్పడం ఆయన రాజనీతికి నిదర్శనం. పార్టీలో సిఎం అభ్యర్థిగా అఖిలేష్ తప్ప మరెవ్వరూ లేరు. ఈ పరిస్థితులను గ్రహించిన శివపాల్- సిఎం అభ్యర్థిగా తన ఓటు అఖిలేష్‌కే అని ప్రకటించవలసి వచ్చింది. శివపాల్, ఆయన మద్దతుదారులను మంత్రి వర్గం నుండి అఖిలేష్ తొలగిస్తే ములాయం జోక్యం చేసుకోలేదు. మంత్రివర్గంలో ఎవరిని ఉం చుకోవాలో అన్నది అఖిలేష్‌కు సంబంధించిన అంశమని ములాయం తేల్చిపారేశారు. ఎస్‌పిలో శివపాల్, రామ్‌గోపాల్‌కు ఎంత ప్రాధాన్యత తగ్గుతూ వుంటే అఖిలేష్ పట్టు అంత పెరుగుతున్నదని అర్థం. ‘అభిమన్యుడి (అఖిలేష్)ని తిరుగులేని నేతగా చేయడానికి నేతాజీ (ములాయం) సృష్టించిన చక్రవ్యూహం ఇది..’ అంటూ ‘యాదవ కుటుంబం’లో చెలరేగిన ముసలం అని పార్టీ నేతలే అంటున్నారు. ఈ ముసలంలో అఖిలేష్ మాత్రమే విజేత కావడం ములాయం అభిలాష అనే సంకేతం కూడా వారు ఇస్తున్నారు. ఎంపీలు ధర్మేంద్ర, అక్షయ్, తేజ్‌ప్రతాప్ యాదవ్ సహా యాదవ కుటుంబంలోని యువతరం అంతా అఖిలేష్ వెనుకే వున్నారు. ఇది గ్రహించిన రామ్‌గోపాల్, శివపాల్ ‘తెగేదాక లాగడానికి’ సిద్ధంగా లేరు. అఖిలేష్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటం పట్ల ‘యాదవ్ కుటుంబ పరివారం’ నుంచి శివపాల్ విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయినా, శివపాల్‌ను సమర్ధిస్తున్నట్లు ములాయం ఉండటం, ఆయనకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం.. ఇదంతా ఆయనను కట్టడి చేయడం కోసమేనని పలువురు భావిస్తున్నారు.
ములాయం బంధువర్గంలో పార్టీపై ఆధిపత్యం వున్నది శివపాల్‌కు మాత్రమే. ఆయనను దూరంగా నెట్టివేస్తే పార్టీకి, అఖిలేష్‌కు నష్టం కలిగే ప్రమాదం వుంది. అతనిని తన పక్కనే వుంచుకోవడం ద్వారా పార్టీలో చీలికకు అవకాశం లేకుండా ‘నేతాజీ’ నివారిస్తున్నారు. కీలక పదవులను తాను చెప్పినవారికి ఇవ్వాలంటూ రామ్‌గోపాల్ తెస్తున్న వత్తిడి పట్ల అఖిలేష్ అసహనంగా వున్నారు. అందుకనే ఆయనను పార్టీ నుండి బహిష్కరించినా నోరు మెదపలేదు. రామ్‌గోపాల్ వల్ల తనకు పెద్దగా ప్రమాదం లేదని అఖిలేష్ భావిస్తున్నారు. శివపాల్ నుండి రాగల పెద్ద ముప్పు ఎన్నికల సమయంలో అభ్యర్ధుల ఎంపిక. పార్టీతో సంబంధం లేకుండా 350 సీట్లకు స్వయంగా అభ్యర్థులను ఎంపికచేసి జాబితాను అఖిలేష్ సిద్ధం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడైన ములాయం చివరగా అభ్యర్ధుల జాబితాను ఖరారు చేయవలసి వుంది. అఖిలేష్ ప్రయోజనాలు ములాయం తప్పక కాపాడగలరని అందరికీ తెలుసు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులంటే అసాంఘిక శక్తులని, దౌర్జన్యాలకు పాల్పడతారని ప్రజల్లో ఒక అభిప్రాయం నెలకొంది. ఈ అభిప్రాయం తొలగించడానికి అఖిలేష్ గత ఐదేళ్లుగా ప్రయత్తిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితులు ఆయనకు ఉపయోగపడే సూచనలు కనిపిస్తున్నాయి.
అభివృద్ధి, విద్య, ఉపాధి, శాంతి భద్రతలు వంటి అంశాలను ఈమధ్య కాలంలో యుపిలో ఏ నాయకుడు కూడా ప్రజల ముందు వుంచే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు అటువంటి ప్రయత్నం ద్వారా సాంప్రదాయకంగా తమ పార్టీకి మద్దతు ఇస్తున్నవారినే కాకుండా కొత్తతరం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అఖిలేష్‌ను నరేంద్ర మోదీ తరహా ఓబిసి నాయకుడిగా ఆయన మద్దతుదారులు అభివర్ణిస్తున్నారు. కులాలకతీతంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన పార్టీల మాదిరి అసెంబ్లీ ఎన్నికలను మాత్రమే దృష్టిలో వుంచుకుని ములాయం, అఖిలేష్ ఎత్తుగడలు వేయడంలేదు. మరో 20 ఏళ్ల వరకూ క్రియాశీలకంగా ఉండగల అఖిలేష్- బలమైన ఓటర్ల ప్రాతిపదికను, విస్తృత రాజకీయ వేదికను ఏర్పర్చుకునేలా ప్రయత్నం చేస్తున్నారు. విపక్షాలు భావిస్తున్నట్లు ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా అధికారాన్ని నిలుపుకోలేక పోయినా, బలమైన నాయకుడిగా అఖిలేష్ ఎదుగుతాడని ఎస్‌పి నేతల అంచనా. మున్ముందు జాతీయ స్థాయిలోను ఆయన ఎదిగే అవకాశాలు వుంటాయని నమ్ముతున్నారు.
యుపిలో బిజెపి,కాంగ్రెస్‌లకు ఇప్పట్లో బలమైన నాయకత్వం లభించే అవకాశాలు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కొన్నిసీట్లయినా గెలుపొందని పక్షంలో సోనియా ప్రాధాన్యత తగ్గక తప్పదు. పార్టీ నుంచి ఇంకెవ్వరూ బయటకు వెళ్లకుండా కట్టడి చేసుకోవడానికి ఆమె చాలా కష్టపడవలసి వస్తున్నది. బంధువర్గం నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టీలో, ప్రజల్లో కొడుకును తిరుగులేని నాయకుడిగా చేయాలన్న సంకల్పంతోనే ములాయం దృఢంగా అడుగులు వేస్తున్నారు.

-చలసాని నరేంద్ర