సబ్ ఫీచర్

మైనింగ్‌లో పారదర్శకతకు చోటెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూగర్భంలో నిక్షిప్తమైన అపార ఖనిజ సంపదను శాస్ర్తియ విధానంలో విచక్షణాయుతంగా వెలికితీయడం ద్వారా సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. కేంద్ర మంత్రిమండలి ఇటీవల ‘నూతన జాతీయ ఖనిజానే్వషణ విధానాని’కి ఆమోదముద్ర వేయడంతో భారతీయ గనుల రంగంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సహజ వనరుల వెలికితీతలో ఖనిజానే్వషణ, ఖనిజ విలువల మదింపులదే ప్రధాన పాత్ర. శాస్ర్తియమైన క్షేత్రస్థాయి అధ్యయనం, పరిశోధన, ప్రయోగాత్మక అనే్వషణతోనే ఖనిజ విలువ అంచనా సాధ్యమవుతుంది. ఈ పద్ధతుల వల్లే దేశంలోని వందలాది క్షేత్రాలలో ఖనిజాల అనే్వషణ సాధ్యమవుతుంది.
భారత్‌లో ప్రధానంగా బంగారం, వజ్రాలు, బొగ్గు, ఇనుము, మాంగనీసు వంటి ఖనిజాలే కాకుండా గ్యాస్, చమురు నిధులు కూడా అరకొరగా వున్నాయి. కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉండగా బొగ్గు క్షేత్రాల లీజు కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు చివరకు ఆ కేటాయింపులన్నింటినీ రద్దుపరుస్తూ సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో ఖనిజ క్షేత్రాల కేటాయింపుల్ని పారదర్శకంగా చేపట్టేందుకు మోదీ ప్రభుత్వం సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఖనిజ అనే్వషణ విధానాన్ని ప్రకటించి కార్యాచరణకు ఉపక్రమించింది. ఖనిజ క్షేత్రాల అనే్వషణకు ఔత్సాహికులైన ప్రైవేటు సంస్థలను ఎంపిక చేయడంలో నూటికి నూరు శాతం పారదర్శకత ఉండేలా ఈ-బిడ్డింగ్ ప్రక్రియను ఇక అమలు చేస్తారు. తొలుత ప్రాంతాల వారీగా ఖనిజ అనే్వషణను చేపట్టేందుకు ప్రభుత్వం నిర్దేశిత ఖనిజ క్షేత్రాలను ఎంపిక చేసి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలకు బదులుగా, ప్రైవేటు సంస్థలకే అనే్వషణ బాధ్యతల్ని అప్పగిస్తే వాణిజ్యపరంగా గిట్టుబాటయ్యే ఖనిజ వనరుల్ని గుర్తించడానికి అవకాశం కలుగుతుంది. ఫలితంగా ఖనిజాలున్న రాష్ట్ర ప్రభుత్వాలకు రాయల్టీ రూ పంలో ఆదాయ వనరులు పుష్కలంగా చేకూరుతా యి. నూతన ఖనిజ విధానంతో కేంద్రానికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఖనిజ వనరుల ప్రాంతాల్ని గుర్తించి వేలం వేయడం ద్వారా భారీ ఎత్తున ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయి. ‘గనులు- ఖనిజాలు (అభివృద్ధి నియంత్రణ) సవరణ చట్టం 2015’ను అమలుపరచే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలకు నాంది పలికింది. అందుకు అనుగుణంగా నూతన పథకాలను ప్రవేశపెడుతూ వస్తోంది. క్షేత్రస్థాయిలో వాటిని సక్రమంగా అమలు చేయడం, విధానాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించి, ఖనిజానే్వషణలో సమాచార వ్యవస్థను సమగ్రంగా నిర్వహించాలి.
ప్రైవేటు, కార్పొరేటు సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు ఆకర్షించడం, స్థూల దేశీయోత్పత్తిలో గనుల రంగం వాటాను గణనీయంగా పెంచడానికి ఈ విధానం బాగా దోహదపడుతుంది. నిర్దిష్టంగా ఖనిజ వనరుల లభ్యత సమాచారం లభించడం వల్ల ఔత్సాహికులైన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఖనిజాల వెలికితీకు సహజంగానే ముందుకు వస్తారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యం కలిగిన విదేశీ పెట్టుబడిదారులను సైతం భారత్ ఆకర్షించగలుగుతుంది.
ఖనిజ వనరుల వెలికితీత జాతీయ సర్వతోముఖ వికాసానికి ఎంతో తో డ్పాటు అందిస్తుంది. ఇదే సందర్భంలో పర్యావరణ ప్రాధాన్యత, ప్రకృతి పరిరక్షణకు విశేష ప్రాధాన్యతను ఇవ్వాలి. ప్రకృతి సహజంగా ఏర్పడిన అడవుల్ని సమూలంగా నాశనం చేయడం, గనుల తవ్వకాలలో విచక్షణా రహితంగా ప్రవర్తించడం, సహజ వనరులను వెలికితీసి నిషేధిత వ్యర్థ పదార్థాలను విచ్చలవిడిగా వదలివేయడం లాంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్ తరాలకు ఇబ్బంది కలుగుతుంది. ఇష్టారాజ్యంగా సహజ వనరులను దోపిడీ చేస్తే ప్రకృతి ప్రకోపాలకు గురి కావాల్సిన ప్రమాదం పొంచి ఉంటుంది. ఖనిజాల వెలికితీత వల్ల కాంట్రాక్టర్లకు, ప్రభుత్వాలకు లభించే ఆదాయం కన్నా- ప్రకృతికి, ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఖనిజ వనరులను వెలికితీసినపుడు కాంట్రాక్టర్లు, లీజుదారులపై ప్రభుత్వపరంగా పర్యవేక్షణ కొనసాగాలి. ఖనిజ వనరుల రవాణా కారణంగా రోడ్లు చిధ్రమైనా కాంట్రాక్టర్లు పట్టించుకోరు. ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులకు లొంగిపోయి తమ విధులను విస్మరిస్తుంటారు. అటవీ సంపద సమూలంగా నాశనమై, రహదారులు అధ్వానమై ఎంతో నష్టం జరుగుతుంది. ఈ పరిస్థితులను నివారించేందుకు ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి. లేకుంటే మైనింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రజలు నానాపాట్లు పడాల్సివస్తుంది.
ప్రభుత్వరంగ సంస్థలైన భారతీయ భూ విజ్ఞాన సర్వే సంస్థ (జిఎస్‌ఐ), ఖనిజ అనే్వషణ సంస్థ (ఎంఇసి), భారతీయ జాతీయ ఖనిజాభివృద్ధి (జిఎస్‌ఐ) జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండిసి)ల పర్యవేక్షణలో గనుల తవ్వకాల విషయంలో అనుసరిస్తున్న మార్గదర్శకాల గురించి సామాన్య ప్రజలకు సైతం తెలియాలి. ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వాలు పారదర్శకంగా వెల్లడించి, మైనింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఉంది.

- దాసరి కృష్ణారెడ్డి