సబ్ ఫీచర్

సర్కారీ బడులకు నీరసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని కోల్పోయారు. అందుకే అప్పు చేసైనా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. ప్రభుత్వం ప్రతినెలా కోట్లాది రూపాయలను విద్యావ్యవస్థ కోసం ఖర్చు చేస్తున్నా ఆ నిధులన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరువలె మారుతున్నాయి. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి మంచి మార్గంలో తీర్చిదిద్దవలసిన కొందరు ఉపాధ్యాయులు ఇతర వ్యాపకాలపై దృష్టి సారించి తమ వృత్తికే మచ్చ తెస్తున్న ఉదంతాలు కోకొల్లలు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్ల కొన్నిచోట్ల టీచర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రార్థన సమయానికి పాఠశాల చేరుకోవడం గాని, పాఠశాల వేళలు ముగిసేవరకు బడిలో ఉండడం అరుదుగా కనిపిస్తోంది. ఆలస్యంగా వచ్చిన వారిని మందలించినవారు లేరు. విధులకు డుమ్మాకొట్టే వారికి జీతంలో కోత విధించిన సందర్భాలు అసలే లేవు. కొన్ని జిల్లాలలో వారానికి ఒక్కసారి చుట్టపు చూపుగా వస్తూ, విధులకు గైర్హాజరు అవుతున్నా ప్రశ్నించే నాథుడే లేడు. గాడి తప్పిన వ్యవస్థను నియంత్రించవలసిన ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఉప విద్యాధికారులు, విద్యా శాఖ అధికారులకు ఈ పరిస్థితులు తెలిసినా పలురకాల కారణాలతో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.
పనిచేసే గ్రామంలో నివాసం ఉంటున్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించి ప్రభుత్వ ఖజానాకు గండిపెడుతున్నప్పటికీ పట్టించుకునేవారు లేరు. కొనే్నళ్ల క్రితం వివిధ జిల్లాల్లో బడికి డుమ్మా కొట్టి, విధులకు హాజరైనట్టు సంతకాలు చేసిన స్కూల్ ఇన్‌ఛార్జి గురించి విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు వెళ్ళినా ఆయన పట్టించుకోలేదంటే వ్యవస్థ ఎంత భ్రష్టుపట్టిపోయిందో తెలుస్తుంది. కొందరు ప్రభుత్వ టీచర్లే ప్రైవేట్ బడుల్లో పాఠాలు చెబుతూ అదనపు ఆదాయం పొందుతూ వృత్తికి ద్రోహం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మరికొందరైతే రియల్ ఎస్టేట్, బీమా ఏజెన్సీలు, వాస్తు కన్సల్టెంట్ తదితర వ్యాపారరంగాలకు పూర్తి కాలాన్ని కేటాయిస్తున్నా పర్యవేక్షణ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రంలో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు బినామీ పేర్లతో ప్రైవేట్ స్కూళ్ల యజమానులుగా అవతారం ఎత్తి నెలల తరబడి సర్కార్ విధులకు ఎగనామం పెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. సర్కార్ టీచర్లే ప్రైవేట్ పాఠశాలలను నిర్వహిస్తున్న తీరు విద్యాశాఖ అధికారులకు తెలియని విషయం కాదు. ఏటా సర్కార్ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బడి సంబరాలు’ కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలలో విద్యార్థులు చేరకున్నా అబద్ధపు ప్రకటనలు చేసిన ప్రధానోపాధ్యాయులు అభాసుపాలవుతున్నారు. విద్యార్థులెవరూ పాఠశాలలో చేరకముందే ప్రకటన చేసి బడి సంబరాల పరువుతీశారు. ఇలా అన్ని ప్రాంతాల్లో బడిబాట కార్యక్రమం విఫలమైంది. మరికొంత ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి ప్రతిభావంతులైన ప్రభుత్వ విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తూ బడి సంబరాల కార్యక్రమానికి తూట్లు పొడుస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప విద్యాధికారి 14మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలల్లో పాఠాలు బోధిస్తున్నందుకు షోకాజ్ నోటీసు జారీచేసిన విషయం బహిరంగ రహస్యమే. కాని ఇప్పటివరకు ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని దారిమళ్లిస్తున్న హెడ్‌మాస్టర్లపై రెవెన్యూ అధికారులు విచారణ జరిపించి నివేదికను పై అధికారులకు పంపిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను బెదిరించిన సంఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల భోజన నిర్వాహకులు, విద్యాశాఖ ఉద్యోగులు, టీచర్లు కుమ్మక్కై పేద విద్యార్థులకు అందవలసిన బుక్కెడు అన్నాన్ని అందకుండా చేస్తున్నారు. నిధుల ఖర్చుపై ఆరాతీసే అధికారులు లేనందున అవకతవకలకు అవకాశం ఏర్పడుతోంది. తరగతి గదులు, మరుగుదొడ్లు, కంప్యూటర్ లాబ్, ల్యాబరేటరీలు వంటి వౌలిక సదుపాయాలు లోపించడంతో ప్రభుత్వ పాఠశాలలు పాడుబడిన భూత్‌బంగ్లాలను తలపిస్తున్నాయి. ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, ఉచిత దుస్తులు, ఉచిత మధ్యాహ్న భోజనం తదితర సదుపాయాలను కల్పిస్తున్నప్పటికీ అది సజావుగా ముందుకు సాగడం లేదు. ఎలాంటి రాయితీలు లేని ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణం సర్కారీ బడులపై పర్యవేక్షణ లోపించడమేనని చెప్పక తప్పదు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను సర్కారీ బడుల్లోనే చదివించాలి. ప్రైవేట్ పాఠశాలలో చదివించినట్లయితే ప్రభుత్వం ఇస్తున్న పారితోషికాలను రద్దుచేయాలి. ఉపాధ్యాయుల పనితీరుపై ప్రభుత్వం ప్రతి మూడు నెలలకొకసారి ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలి. సకాలంలో సిలబస్ పూర్తిచేయని వారిపైనా తగిన చర్య తీసుకొని, వేతనంలో కూడా కోత విధించాలి. పాఠశాలల్లో విధులకు డుమ్మాకొట్టే ఉపాధ్యాయులపై నిఘా వ్యవస్థను ఏర్పాటుచేసి, తప్పుచేసినవారిని కఠినంగా శిక్షిస్తే ఇతరులు కూడా అలాంటి తప్పు చేయకుండా ఉంటారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలో బోధిస్తే అతన్ని సర్వీసు నుండి డిస్మిస్ చేయాలి. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించే విధంగా ప్రణాళిక రూపొందించాలి. ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ లాబ్స్, సైన్స్ లాబ్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. ప్రతినెలా క్రమం తప్పకుండా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వారి నైపుణ్యాలను అంచనా వేయాలి. మండల విద్యాధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు చేసి విధి నిర్వహణలో అలసత్వం చూపే టీచర్లపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పుస్తకాలు, భోజనం, దుస్తులు వగైరా పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందేవిధంగా విద్యాధికారులు చూడాలి.

--రావుల రాజేశం