సబ్ ఫీచర్

పొగాకు ఉత్పత్తులకు పాతరేద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(నేడు పొగాకు వ్యతిరేక దినం...)

వరల్డ్ హెల్త్ అసెంబ్లీ’ వారు 1987లో చేసిన ఒక తీర్మానం ద్వారా 1988 సంవత్సరం ఏప్రిల్ 7న ‘్ధమపాన వ్యతిరేక దినం’గా పాటించాలని అన్ని దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత 1988లో చేసిన మరో తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరం మే 31వ తేదీన ఈ దినాన్ని పాటించాలని మరో ప్రకటన జారీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) లోని సభ్య దేశాల ఆకాంక్షను అనుసరించి ‘పొగాకు వ్యతిరేక దినం’ పాటించాలని నిర్ణయించారు. వివిధ రూపాల్లో పొగాకు వినియోగం వల్ల జరుగుతున్న మరణాలను సంవత్సరానికి 3.5 మిలియన్ల మేరకు తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, పొగాకు ఉత్పత్తులైన పాన్ మసాలా, సిగరెట్లు, బీడీలు, అంబర్‌లు, గుట్కాలను నేడు గ్రామస్థాయి నుండి పట్టణాల వరకు వీధివీధినా విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న యువత వీటి బారిన పడి, చిన్న వయస్సులోనే అనారోగ్యంపాలై వివిధ వ్యాధులతో బాధపడుతూ చివరికి అకాలమృత్యువు పాలవుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా వీటి విక్రయాలు ఆగడం లేదు. కాలేజీలకు వెళ్లే యువకులు సిగరెట్లు తాగడం ఓ ఫ్యాషన్‌లా భావిస్తూ దమ్ము కొట్టి ఆనందపడుతున్నారు. పలురకాల గుట్కాలు బహిరంగ మార్కెట్టులో విరివిగా దొరుకుతున్నాయి. గ్రామాలలోని పాన్‌షాప్‌లు, కిరాణా దుకాణాలలో తోరణాలుగా కట్టి మరీ వీటిని అమ్ముతున్నారు. మహిళలు కూడా పొగాకు ఉత్పత్తులకు బానిసలవుతూ రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఉపాధి హామీ కూలీలు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, మోటారు వాహనాలు నడిపే డ్రైవర్లు, వ్యవసాయ కూలీలు అంబర్‌లను, గుట్కాలను అధికంగా వాడుతున్నారు. ప్రతీ రోజు సుమారు 20కి పైగా గుట్కాలు, అంబర్‌లు వాడేవారు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. రాత్రివేళ కూడా నోటిలో గుట్కా, అంబర్‌లు వేసి నిద్రపోతున్నారంటే వారు పొగాకు ఉత్పత్తులకు ఏ మేరకు అలవాటుపడ్డారో అర్థమవుతుంది. విద్యార్థులు కాలేజీ క్యాంపస్‌లలో, బహిరంగ ప్రదేశాలలో, పబ్‌లు, రెస్టారెంట్లలో సిగరెట్లు కాల్చుతూ ఏదో తెలియని మానసిక ఆనందాన్ని పొందుతున్నారు. సిగరెట్ల ధరలు ఎంత ఎక్కువైనా వాటిని కొనేందుకు వెనుకడుగు వేయడం లేదు. సిగరెట్లు తాగేవారు సమాజంలో గొప్పవారనే భావన కొంతమంది యువకుల్లో బలంగా నాటుకొంది. గ్రామాలలో పేదలు తాగే బీడీల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పొద్దంతా కాయకష్టం చేసే కూలీలు ఆడ, మగ అనే వ్యత్యాసం లేకుండా వీటికి దాసోహం అవుతున్నారు. క్యాన్సర్లు వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు.
టీవీలలో, సినిమా థియేటర్లలో ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రకటనలు ఇస్తున్నా ఎవరూ ఆ హెచ్చరికలను పాటించడం లేదు. రోగాలు సంభవించి వైద్యులవద్ద చికిత్స పొందిన తర్వాత కొందరు వీటిని మానేస్తున్నారు. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా పాన్‌షాపులు, కిరాణా దుకాణాల్లో భారీ ఎత్తున గుట్కాలు, అంబర్‌లు, సిగరెట్లు విక్రయిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో వీటిని సేవించడం నిషేధం అని తెల్సినా సిగరెట్లు, బీడీలు ముట్టిస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ధూమపాన వ్యతిరేక చట్టం ఉన్నా అధికారులు ఎవరికీ జరిమానాలు వేయడం లేదు. మంత్రులు, శాసనసభ్యులు వివిధ హోదాలలో గల వ్యక్తులు కూడా వీటిని వాడుతున్నారంటే పొగాకు ఉత్పత్తుల ప్రభావం ఎలా ఉందో అవగతమవుతుంది. సమయానికి భోజనం లేకున్నా ఫర్వాలేదు. కానీ ఓ దమ్ము లాగించేస్తే భోజనం చేసిన అనుభూతిని కల్గుతుందన్న భావనలో కొందరు ఉన్నారు. పొగాకు వాడకం వల్ల కంటిచూపు దెబ్బతినడం, ఆకలి మందగించడం, దంతాలపై మరకలు రావడం, గుండెపోటు ముప్పు, ఊపిరితిత్తుల క్యాన్సర్ మెదడులో చికాకు, క్షయవ్యాధి, నోటి, గొంతు క్యాన్సర్‌లు, నపుంసకత్వం వంటివి ఎదుర్కొనక తప్పదు. ధననష్టం, పరిసరాలను కలుషితం చేయడం, జీవితంలో నిర్దిష్ట లక్ష్యంపై దృష్టిపెట్టకపోవడం, అబద్ధాలు ఆడడం, నలుగురిలో కలిసి ఉండలేక పోవడం, అవమానంగా భావించడం, జీవిత భాగస్వామికి దూరం కావడం లాంటి నష్టాలు సంభవిస్తున్నాయి. పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాల గురించి మరింత లోతుగా ప్రచారం నిర్వహించాలి. ఉదయానే్న వీటిని సేవించేవారి సంఖ్య అధికంగా ఉంది. కళాజాతాల ద్వారా, రచయితల సంఘాల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా విద్యార్థులకు పలురకాల పోటీలు నిర్వహిస్తూ పొగాకు వినియోగం వద్దంటూ అవగాహన కల్పించాలి. అందరం ఏకమవుదాం- పొగాకు ఉత్పత్తులను తరిమికొడదాం. ప్రజలలోకి వెళ్లి అవగాహన కల్పిద్దాం. పోలీసు, ఎక్సయిజ్ శాఖల అధికారులు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న దుకాణాలు, పాన్‌షాప్‌లపై తరచూ దాడులు నిర్వహించి అమ్మకందార్లపై కేసులు నమోదు చేయాలి. నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్న కేంద్రాలను గుర్తించి సీజ్ చేయాలి. పాఠశాలలు, కళాశాలల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. అనర్థాలపై విస్తృత ప్రచారం కల్పించాలి. ‘పొగాకు ఉత్పత్తుల సేవనం-ఆరోగ్యానికి హానికరం’ అనే నినాదం సర్వత్రా మార్మోగాలి.

-కామిడి సతీష్‌రెడ్డి 98484 45134