సబ్ ఫీచర్

బంధం ఇష్టమైతే బాంధవ్యం పటిష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దలందరూ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు అని దీవిస్తూ వుంటారు. శ్రేయోభిలాషులంతా మీరు ఇష్టమైన ఫలితాలను పొందాలంటూ ఆకాంక్షిస్తూ వుంటారు. ఇష్టమైనవన్నీ లభ్యపడినాయంటే సుఖంగా జీవితాన్ని గడుపుతున్నట్లే లెక్క. అందరికీ అన్నివేళలా అన్నీ సమకూరడమంటే గొప్ప విశేషమే అవుతుంది.
రంగు, రుచి, ప్రదేశాలు, వేషధారణ, వ్యక్తులు, దైవం, కళలు, అలవాట్లు, పనులు మొదలైన విషయాలలో ఇష్టానిష్టాలు వుంటాయి. ‘లోకోభిన్నరుచిః’ ఒక్కొక్కరిదీ ఒక్కొక్క పద్ధతి, ఒకరికి ఇష్టమైనది మరొకరికి ఇష్టమైనది కాదు. అలాగని ఎవరినీ తప్పుపట్టడానికి వీలులేదు. ఎవరి అభిరుచి వారిది. ఇతరుల ఇష్టానిష్టాలను కూడా గౌరవించాలి.
మన ఇష్టం ఇతరులకు ఇబ్బందిని కలిగించకూడదు. ఇష్టరీతిలో వ్యవహరించేటపుడు సభ్యతా సంస్కారాలను కూడా గుర్తుంచుకోవాలి. గట్టిగా పాటలు వినడం ఇష్టమని వేళకాని వేళలో అందరికీ ఇబ్బందిని కలిగించడం, వాహనాలు నడపడం ఇష్టమని అడ్డదిడ్డంగా వాహనాలు నడపడం వంటివి చేయకూడని పనులు. ఇతరులను కష్టపెట్టని రీతిలో ఇష్టం వుండాలి. ఇష్టపడిన చదువునే చదవడం, ఇష్టపడే ఉద్యోగానే్న చేయవలసి రావడం, అన్ని సందర్భాలలో కుదరదు.
పరిస్థితుల ప్రభావంవల్ల ఇష్టంలేని చదువు చదవాల్సిరావడం, మనస్సుకు నచ్చని ఉద్యోగం చేయాల్సిరావడమో !
జరుగవచ్చు. అయినప్పటికీ అక్కడ చదువుకుగానీ, పనికి కానీ, ఉద్యోగానికి కానీ పూర్తిగా న్యాయం చేకూర్చాలంటే వాటిపట్ల తప్పకుండా ఇష్టాన్ని కల్పించుకోవాలి. చేసే పనులలో భాగంగా ఇతర నైపుణ్యాలు అలవరచుకోవాలన్న వాటిపై కూడా ఇష్టాన్ని ఏర్పరచుకోవాలి. అపుడు సంతృప్తి కలిగి ఆ పనులే ఇష్టమైన పనులుగా మారతాయి. ఇష్టానికి పరిమితులుంటాయి. ఇష్టమైన పదార్థం కదా అని అదేపనిగా తింటూ వుంటే వెగటు పుడుతుంది. ఒక వ్యక్తికి ఒక పదార్థమంటే ఇష్టమని ప్రచారం జరిగింది. ప్రముఖ వ్యక్తి కావడంతో అందరూ ఆ పదార్థానే్న తినిపించసాగారట. చివరకు విషయం తెలుసుకున్న సదరు వ్యక్తికి ఇష్టం పోయి ఆ పదార్థమంటే అసహ్యం పుట్టిందట. మావాళ్ళకు ఇవే ఇష్టం అనో, వాళ్ళకసలు ఇష్టమే లేదు అనో కొందరు ముద్రలు వేసేస్తూ వుంటారు. ఇటువంటి వాటివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని సందర్భాలలో సర్దుకొనిపోవలసివస్తుంది.
అర్థంపర్థంలేని విషయాల్లో ఈ విధంగా తీర్మానించడం తప్పే అవుతుంది. ఇష్టమైనవన్నీ పిల్లలకు ఇచ్చివేసే అలవాటుకూడా సమర్థనీయం కాదు. దానివల్ల పిల్లల్లో మంకుపట్టు పెరుగుతుంది. అలాగని మన ఇష్టాలను పిల్లలపై బలవంతంగా రుద్దకూడదు. ఇష్టంలేని చదువులవల్ల బలవన్మరణాలకు పాల్పడుతున్న విద్యార్థులే ఇందుకు ఉదాహరణ. ఇష్టాన్నిబట్టి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. సంగీతం, నాట్యం, కవిత్వం, ఆటలు మొదలైన రంగాలలో ఇష్టాన్ని కనబరచేవారు గొప్ప సంగీతజ్ఞులుగానో, కళాకారులుగానో, కవులుగానో, నిష్ణాతులుగానో మారేందుకు అవకాశాలు ఎక్కువ. ప్రకృతిని ఆరాధించేవారు భావుకులు అవుతారు.
ఇష్టం వయస్సునుబట్టి మారుతూ వుంటుంది. చిన్నపుడు ఉండే ఇష్టాలకు, పెద్దయ్యాక ఉండే ఇష్టాలకు తేడా వుంటుంది. చిన్నప్పుడు ఇష్టపడే వ్యక్తులు కొందరైతే పెద్దయ్యాక ఆ ఇష్టం మరొకరిపైకి మారవచ్చు. అంటే ఇపుడు మనం రోల్‌మోడల్ అని చెబుతున్నవారిలాంటి వారన్నమాట. అభిరుచుల్లో మార్పులవల్ల ఇష్టంలో కూడా మార్పులు వస్తాయి. చిన్నపుడు భక్తి ఇష్టం లేనివారు పెద్దయ్యాక పరమభక్తులు కావచ్చు. భక్తిపరులవుతారనుకునేవారు నాస్తికులు కావచ్చు. క్రొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు తమ దేశంవారో, తమ ప్రాంతంవారో కనిపిస్తే వారి ఆనందం రెట్టింపవుతుంది.
వారిపై ఇష్టమే దానికి కారణం. ఇక్కడ ఇష్టమంటే అభిమానమని అర్థం. అవసరానికి అనుగుణంగా ఇష్టం మారితే మాత్రం ఆలోచించవలసిందే. ఇష్టమైన ముఖప్రీతి మాటలు మాట్లాడేవారి పట్ల అప్రమత్తంగా వుండాలి. ఇష్టమైనవారు ఏ పని చేసినా ఇష్టంగానో వుంటుంది. ఆ ఇష్టమే విరసమైతే నేరాలే కనిపిస్తాయంటాడు బద్దెన. ‘‘తావలచింది రంభ, తామునిగింది గంగ’, ‘ఇష్టమైన కంపు ఇంగువతో సమానం’ వంటి సామెతలు ఇటువంటివే. తాము ఇష్టపడేవారు, తమని ఇష్టపడేవారు ఒకరే అయితే ఆనందమే కలుగుతుంది.
బంధాలను ఇష్టపడేవారు బాంధవ్యాలను పటిష్టంగా వుంచుకోగలుగుతారు. ఇష్టానిష్టాలు కొన్ని సందర్భాలలో మార్చుకోవలసి వస్తుంది. వ్యాధిగ్రస్తులు వ్యాధి నివారణకు చేదు మాత్రలనే ఇష్టంగా తీసుకోవలసివస్తుంది. ఆరోగ్యరీత్యా కొన్ని పదార్థాలంటే ఎంత ఇష్టం వున్నా తినడం మానుకోవాల్సి వస్తుంది. కొన్నిచోట్ల పరిసరాలు కూడా ఇష్టమైన రీతిలోనే వుండవు. అపుడు పరిసరాలకు అనుగుణంగా ఇష్టాన్ని మార్చుకోవలసి వస్తుంది. పనులంటే ఇష్టంలేనివారు పనిచేయవసి వస్తే ద్వేషిస్తూ చేయకుండా ఇష్టంతోచేయాలి. ఇష్టంతో చేస్తేనే సత్ఫలితాలుంటాయి. వ్యక్తిత్వ వికాస నిపుణులు కష్టమైన పనినైనా ఇష్టంతో చేయాలి అని పదే పదే చెబుతూ వుంటారు. ఇష్టంతో చేస్తే మనస్సుకు ఆనందం కలుగుతుంది. ముందుగా మనలను మనం ఇష్టపడాలి. మన జీవితాన్ని ఇష్టపడాలి. మన వృత్తిని ఇష్టపడాలి. మన పనిని ఇష్టపడాలి. అపుడు ఆనందానికి లోటుండదు.

- డా. కె.లక్ష్మీ అన్నపూర్ణ