సబ్ ఫీచర్

ఉ.కొరియా ప్రజల గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా, ఉత్తర కొరియా దేశాధినేతల మధ్య సింగపూర్‌లో తాజాగా జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. పూర్తిస్థాయి అణునిరాయుధీకరణకు ఉ.కొరియా అంగీకరించడం, ఆ దేశ భద్రతకు తమది పూచీ అని అమెరికా ప్రకటించడంతో ఏడు దశాబ్దాల ప్రతిష్ఠంభనకు, వైరానికి తెరపడింది. ఈ ఇరు దేశాల చర్చలపై చాలా రోజులుగా నెలకొన్న ఉత్కంఠ ముగిసింది. ఈ మొత్తం ప్రక్రియలో అదృశ్యంగా ఉన్న అంశాన్ని పసిగట్టడం ముఖ్యం. అదేమిటంటే- రెండు సిద్ధాంతాల మధ్య ఘర్షణ తగ్గడం, రెండు వ్యవస్థల మధ్య వైరుధ్యం సడలిపోవడం. సంపూర్ణ అణు నిరాయుధీకరణపై చర్చలు జరిగినా, అంతర్లీనంగా ఉత్తర కొరియా తన కమ్యూనిస్టు వ్యవస్థను కాపాడుకునేందుకు ఇన్నాళ్లూ చేసిన ప్రయత్నాన్ని సడలించుకుంది. కాలంతో కలిసి నడిచేందుకు సిద్ధమైంది. నిజానికి ఇది ఉ.కొరియా ప్రజల విజయంగా భావించాలి. అమెరికా సైతం ఓ మెట్టు దిగొచ్చింది.
ఉ.కొరియా ఆర్థిక వ్యవస్థ క్రమంగా దిగజారుతోంది. ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి. చైనాకు చేసే అరకొర ఎగుమతులు సైతం తగ్గాయి. చైనా రక్షణాత్మక చర్యలు చేపడుతూనే ఉదారంగా వ్యవహరించే తీరును తగ్గించుకుంది. సాటి కమ్యూనిస్టు దేశానికి సహకరించాలన్న అభిప్రాయం పలుచనైంది. దాంతో ఉ.కొరియాలో సమస్యలు పెరిగాయి. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా దురుసుగా ప్రవర్తించే అవకాశం లేకుండా పోయింది.
హస్తమశకాంతరం...
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వ్యత్యాసం హస్తిమశకాంతరం. దశాబ్దాల తరబడి ఉ.కొరియా ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. సోవియట్ యూనియన్ కుప్పకూలాక పరిస్థితి దారుణంగా మారింది. ఇదే సమయంలో ద.కొరియా అన్ని రంగాల్లో దూసుకుపోయింది. 2003లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి ఉ.కొరియా వైదొలగినప్పటి నుంచి కష్టాలు కమ్ముకున్నాయి. ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలు చావుదెబ్బతీశాయి. అయినా మొండివైఖరితో ఆ దేశం క్షిపణి, అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగించింది. అమెరికా మాటలను, ఐక్యరాజ్యసమితి సూచనలను బేఖాతరు చేసింది. దాంతో ఆ దేశ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకుంటూ వస్తున్నారు. దాదాపు దశాబ్దంన్నర కాలపు ఆర్థిక ఆంక్షలు ఆ దేశ పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసాయి. ఎగుమతులు బాగా పడిపోయాయి. చమురు దిగుమతులు తగ్గాయి. దాంతో ప్రజల్లో అశాంతి పెరిగింది. కమ్యూనిస్టు దేశం కావడంతో ప్రజాగ్రహం బయటి ప్రపంచానికి తెలియలేదు. కాని ఎంతో కొంత సమాచారం పొక్కకుండా ఎలా ఉంటుంది? కమ్యూనిస్టు వ్యవస్థ, నియంతృత్వ వైఖరి, అసమ్మతిని కఠినాతి కఠినంగా అణచిపెట్టే వైనం పాలకులకు శ్రీరామరక్షగా నిలిచింది.
అమెరికా తమ దేశాన్ని, వ్యవస్థను మార్చి పెట్టుబడిదారి వ్యవస్థను ప్రవేశపెడుతుందేమోనన్న ఒక ఊహాత్మక భయం ఉ.కొరియాను ఇంతకాలం వెంటాడుతూ వచ్చింది. ఆ భయాన్ని చూపించి ప్రజలను అన్ని విధాలా అణచిపెట్టారు. ప్రజల యోగ క్షేమాల కన్నా అణ్వాయుధాలు, క్షిపణుల నిర్మాణం ముఖ్యమని, అమెరికా బూచిని చూపించి నెట్టుకొచ్చారు. అణ్వాయుధాలుంటే అమెరికా తమ జోలికిరాదన్న వాదనను తరచూ వినిపించింది. అదొక నినాదంగా ఉపయోగించారు. అందుకే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని గత సంవత్సరం ఉ.కొరియా ప్రయోగించింది. అమెరికా నగరాలను చేరుకోగల సామర్థ్యం ఈ క్షిపణులకు ఉండటం విశేషం. దాంతో అమెరికా ఆగ్రహం చెందింది. ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. అంతర్జాతీయంగా మరింత ఒత్తిడి పెంచింది. సైనిక దాడులకు సిద్ధమైంది. దక్షిణ కొరియాతో కలిసి యుద్ధ విన్యాసాలను పెంచింది. ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రజల ఈతిబాధలు సైతం మరింత పెరిగాయి. అసమ్మతిరాగం బలపడసాగింది.
పసలేని ప్రచ్ఛన్న యుద్ధం...
ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాలో జరిగిన ఒలింపిక్ క్రీడలకు ఉ.కొరియా తమ క్రీడాకారుల బృందాన్ని పంపడం, అక్కడి అధికారులతో సంపర్కం ఏర్పడడం, చైనా నాయకులతో చర్చలు జరపటంతో వాస్తవ పరిస్థితి బోధపడసాగింది. ఉప్పు-నిప్పుగా చిటపటలాడే ఉ.కొరియా, అమెరికా నాయకుల మధ్య దౌత్యపరమైన సంబంధాలు పెరగడం, చర్చలకు అంగీకరించడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. జూన్ 12న చారిత్రాత్మకంగా ఆ చర్చలు ఫలప్రదం కావడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఎక్కడ అణుయుద్ధం వస్తుందోనని భయపడ్డ అనేక దేశాలు ఈ పరిణామంతో ఊరట చెందాయి. గతం గతః అంటూ చెలిమికి అమెరికా, ఉ.కొరియా నేతలు చేతులు కలపడంతో మిగతా దేశాలవారు ‘హమ్మయ్య’ అనుకున్నారు.
ఏడు దశాబ్దాలు సాగిన ఈ ప్రచ్ఛన్న యుద్ధం (కోల్డ్‌వార్)లో అపనమ్మకం, కమ్యూనిస్టు ఆధిపత్య ధోరణి, తమ మాటే నెగ్గాలన్న అహంభావంతో చేసిన విపరీత వ్యాఖ్యలు చివరికి విలువ లేకుండా పోయాయి. ఈ మెలకువ పాతిక సంవత్సరాల క్రితమే కలిగి వుంటే తూర్పు యూరప్ దేశాల్లో చోటుచేసుకున్న నూతన పరిణామాల సందర్భంలో, రష్యాలో సరికొత్త మార్పు జరిగిన వేళ మేల్కొని ఉంటే ఉ.కొరియా ప్రజలు ఎంతో మెరుగైన జీవితం ఇపుడు గడుపుతూ కనిపించేవారు. పేదరికంలో కునారిల్లేవారు కాదు. ద.కొరియా సోదరులతో సమానంగా కాకపోయినా కుడి ఎడమలుగానైనా జీవించేవారు. కాని పాలకుల అభిజాత్యం, సిద్ధాంత మూర్ఖత్వం, ఘర్షణ వైపునకే మొగ్గు చూపడంతో జరగవలసిన అపార నష్టం జరిగిపోయింది. ఎన్నో దశాబ్దాల వెనక్కి ఉ.కొరియా ప్రజలను అక్కడి పాలనా వ్యవస్థ నెట్టివేసింది. ఇది ఏరకంగా న్యాయ సమ్మతం? ఏ విధంగా ఆహ్వానించదగ్గది? ఇప్పటికైనా ఆ దేశ కమ్యూనిస్టు నాయకత్వానికి జ్ఞానోదయం కలగడం శుభసూచకం!
కమ్యూనిజపు కొసరు...
ఇప్పటికే దాదాపు అన్ని దేశాల్లో కమ్యూనిస్టు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవిలో వున్నపుడు క్యూబాలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. క్యూబా-అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. కాలానుగుణమైన ఒప్పందాలు కుదిరాయి. దాంతో కమ్యూనిస్టు వాసనలు క్రమంగా ఆ దేశంలో తగ్గాయి. తాజాగా ఉ.కొరియా ఆ పాత్రను పోషించబోతోంది. ఇంతకాలం ఆచరణ సాధ్యం కాని, ప్రపంచ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఊహాత్మక ప్రపంచంలో జీవిస్తూ, ఇతరులను అనుమానపు చూపులతో చూస్తూ, అపనమ్మకంపై ఆధారపడి కాలం గడపడంవల్ల ఆయా కమ్యూనిస్టు దేశాల ప్రజలు దారుణంగా వెనుకబడి జీవిస్తున్నారు. ఇప్పటికీ వెనుజుల దేశంలో ప్రజలు దారుణంగా వెనుకబడి జీవిస్తున్నారు. రొట్టెముక్క కోసం అగచాట్లు పడుతున్నారు. వారి కనీస అవసరాలు తీరడం లేదు. ప్రాణాధార ఔషధాలు సైతం అందుబాటులో లేవు. అరాచక పాలన కొనసాగుతోందని ఆ దేశ ప్రజలు, ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఇందుకు కారణం పూర్వపు ఆ దేశాధ్యక్షుడు కమ్యూనిస్టు నాయకుడు చావేజ్ అసంబద్ధ నిర్ణయాలని అక్కడి ప్రజలే వాపోతున్నారు. ఇప్పటికీ అవే విధానాలను ఆయన శిష్యుడు అమలు జరుపుతుండడంతో ప్రజలు ‘అన్నమో.. రామచంద్రా..’ అని అల్లాడుతున్నారు.
సిద్ధాంతాలా? సుఖ సంతోషాలా..?
21వ శతాబ్దంలోనూ ఈ అవస్థలు ప్రజలు చవిచూడాలా? ప్రజల సుఖ సంతోషాలు ముఖ్యమా? సిద్ధాంతాలు ముఖ్యమా? కమ్యూనిస్టు - మావోయిస్టు నాయకులకు సిద్ధాంతాలే ముఖ్యమని దశాబ్దాలుగా చాటి చెబుతున్నారు. అందుకోసం ప్రజలే ఆహుతిస్తున్నారు. ఈ విపరీత పరిస్థితి నుంచే ఉ.కొరియాలో సంక్షోభం తలెత్తింది. ఇది మానవీయ హృదయం గల వారెవరూ ఆహ్వానించరు. సిద్ధాంతాలతో హృదయాలకు తాళాలు వేసే రోజులు పోయాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రజలందరినీ పలకరిస్తూ వారి జీవన విధానాన్ని మెరుగుపరుస్తూ, తమ తమ శక్తి సామర్థ్యాల మేరకు ఎదిగేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నా అందుకోకపోవడం ఎవరిది తప్పు?
సాంకేతిక విప్లవానికి సిద్ధాంతం వాసన లేదు. స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ లాంటి ఆధునిక సౌకర్యాలకు సిద్ధాంతాల రంగు ఎలా పులుముతారు? భూమ్యాకర్షణ శక్తి సిద్ధాంతానికి ఏ రంగు పూస్తారు? ఇంత చిన్న సాధారణ విషయాన్ని విస్మరించి ఇనుప గోడలు లేపి విద్వేషం వ్యాప్తి చేసి, వర్గాల పేర కసిని రెచ్చగొట్టి అశాంతిని పెంచడం వల్ల పేదల బతుకులు బాగుపడ్డాయా?
ఏడు మాసాల క్రితం రష్యా విప్లవం శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. ఆ విప్లవం కన్న కలలు సాకారమయ్యాయా? లేదు- మార్కెట్ రహిత ఆర్థిక వ్యవస్థ అన్ని మూల సూత్రం సప్త సముద్రాల్లో కలిసిపోయి అన్ని దేశాలు అనాదిగా వస్తున్న వ్యాపార సూత్రాలను, మార్కెట్ అనుకూల వైఖరిని అనుసరిస్తూ ఉన్నాయి. మరి ఈ మాత్రం దానికి శతాబ్దానికి పైగా.. ఇంకా ఆ ‘మాయ’లో పడి ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం నేరంగాక ఏమవుతుంది? ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జింగ్ ఉన్ లీలగానైనా ఈ విషయాన్ని గ్రహించినందుకు అభినందనీయుడు.

-- వుప్పల నరసింహం 99857 81799