సబ్ ఫీచర్

‘సేవాదళ్’తో జాతీయవాదం సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) హిందూ మతతత్వ సంస్థ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే ఆరోపణలు సంధించడం సరికాదు. ప్రధాని నరేంద్ర మోదీ ‘సంఘ్’ భావజాలాన్ని అమలు చేస్తున్నారని, బడుగు వర్గాలను, మైనారిటీ మతస్థులను నిర్లక్ష్యం చేస్తున్నారని రాహు ల్ అభియోగం మోపడం అర్థరహితం. మోదీ నేతృత్వంలో ‘సూటు-బూటు ప్రభుత్వం’ సంపన్న వర్గాల కోసం పనిచేస్తోందని, పెద్దనోట్ల రద్దుతో పేదలను ఎన్డీఏ సర్కారు రోడ్ల పాలుచేసిందని కూడా కాంగ్రెస్ యువనేత అదేపనిగా విమర్శలు చేస్తున్నారు. రైతుల సంక్షేమం గురించి ఆలోచించడానికి మోదీకి తీరిక లేదని, విదేశీ పర్యటనలతోనే ఆయన కాలక్షేపం చేస్తున్నారని రాహుల్ అనుచరులు ఆరోపించడం పరిపాటిగా మారింది. ఆరెస్సెస్ సిద్ధాంతాల పట్ల ఎటువంటి అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు దేశం గురించి మాత్రం ఆలోచించడం లేదు.
కాగా, ఇటీవల నాగపూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల తృతీయవర్ష శిక్షణ శిబిరం ముగింపుకార్యక్రమానికి మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యఅతిధిగా హాజరు కావడంపై కాంగ్రెస్ అధినాయకులందరూ నానా రభస చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉన్నత పదవులు పొందిన ప్రణబ్ ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లడం అనైతికమని వారు తప్పుపట్టారు. అంతటితో ఆగకుండా ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠను రంగంలోకి దింపి తండ్రిని అవమానింపజేసే ప్రయత్నం చేశారు. ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులు, మేధావులు గతంలో ఆరెస్సెస్ సమావేశాలకు హాజరైన ఉదంతాలను కాంగ్రెస్ వారు విస్మరించారు.
ఆమధ్య పాకిస్తాన్‌పై మన సైనికులు చేసిన ‘సర్జికల్ స్ట్రైక్’కు ఆధారాలేమిటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించి, ప్రాణత్యాగానికి ప్రతీకలైన సైనికులను అవమానపరిచారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీని ప్రజలు తప్పుపట్టగానే, రాజకీయంగా పబ్బం గడుపుకొనేందుకు మోదీ ‘సర్జికల్ స్ట్రైక్’ను ప్రచారాస్త్రంగా వాడుకున్నారని కాంగ్రెస్ వారు మాట మార్చారు. దేశభక్తికి మారుపేరైన ఆరెస్సెస్‌పై విష ప్రచారం చేసేవారు సైనికుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడంలో ఆశ్చర్యం ఏముంది?
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై, విదేశాల్లో దాచిన నల్లడబ్బుపై మోదీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించడంతో రాహుల్ మద్దతుదార్లకు దిక్కు తోచలేదు. కాంగ్రెస్ నాయకుల సిఫార్సులతో బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొంది, విదేశాలకు ఎగిరిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ లాంటి ఆర్థిక నేరస్థులపై చర్యలకు మోదీ ప్రభుత్వం నడుం బిగించింది. ఇలాంటి నేరగాళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా శిక్షించిందా? విదేశాల్లో దాచిన నల్లడబ్బును ఇక్కడికి తేవడం అంత సులభం కాదని అనుభవ శూన్యుడైన రాహుల్‌కు తెలియక పోవడం వింతకాదు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జేడీ పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ పశుదాణా కేసుల్లో జైలుకు వెళ్లడం, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం తన కొడుకు కార్తీ చిదంబరం ముందస్తు బెయిలు తీసుకోవడం ఎవరి ఘనత? నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో, ఆరెస్సెస్ దాఖలు చేసిన కేసులో రాహుల్, ఆయన తల్లి సోనియా గాంధీ కోర్టు విచారణలను ఎదుర్కొంటున్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీల ఆస్తులను జప్తు చేయడం, వారిని భారత్‌కు రప్పించే ప్రయత్నంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించడం ప్రధాని మోదీ కార్యసాధనకు ప్రతీక. రాహుల్ ఎన్ని గుడులూ, గోపురాలూ సందర్శించినా, వివిధ పీఠాధిపతుల ఆశీస్సులు పొందినా కర్నాటకలో కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. 122 సీట్ల నుంచి 78 సీట్లకు ఆ పార్టీ దిగజారడం రాహుల్ నాయకత్వ పటిమకు నిదర్శనం! జాతీయవాదంతో కర్నాటకలో 40 నుండి 104 సీట్లకు భాజపా ఎదిగింది. దీన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ వారు ఆరెస్సెస్‌పైన, భాజపాపైన, మోదీపైన నిందలు వేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ‘సంఘ్’ సిద్ధాంతాలను నరేంద్ర మోదీ దేశప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని, ఇది మతాల మధ్య చిచ్చు పెడుతుందని వల్లెవేయడం రాహుల్‌కు అలవాటుగా మారింది. ఇదే రాహుల్ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ఆలయాలను సందర్శించడం, మఠాధిపతులతో మంతనాలు జరపడం ‘సెక్యులరిజం’ అంటారా? ఇలాంటి చేష్టలు, ‘సెక్యులరిజం’ మంత్రం 2019 ఎన్నికల్లో పనిచేయవని రాహుల్ ఇకనైనా గుర్తించాలి.
జాతీయత, దేశభక్తిని ప్రతిపౌరుడు ఆకళింపు చేసుకోవాలని మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్ వేదిక పైనుంచి ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ నాయకులు కంగుతిన్నారు. మసకబారిన సెక్యులరిజాన్ని వదిలేసినపుడే తమ ఉనికినైనా కాపాడుకుంటామని, లేకుంటే కమ్యూనిస్టుల పరిస్థితే తమకూ పడుతుందని కాంగ్రెస్ వారు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కనుమరుగైన కాంగ్రెస్ సేవాదళ్‌ను పునఃప్రతిష్ఠింపచేసే ప్రయత్నాన్ని వారు ముమ్మరం చేశారు. తొంబై మూడు సంవత్సరాలుగా నరనరాన జాతీయవాదాన్ని జీర్ణించుకొన్న ఆర్‌ఎస్‌ఎస్‌కు, నూట ముప్పయి సంవత్సరాలుగా కుహనా సెక్యులరిజాన్ని వంటబట్టించుకున్న కాంగ్రెస్‌కు పోలిక ఎక్కడ? ‘సేవాదళ్’ను తిరిగి తెర మీదకు తెచ్చినంత మాత్రాన కాంగ్రెస్ వారు జాతీయవాదానికి ప్రతీకలుగా మారగలరా?
ఆర్‌ఎస్‌ఎస్ మాదిరి కాంగ్రెస్ వారు జాతీయ వాదాన్ని పుణికిపుచ్చుకుంటే వారిని నమ్ముకొన్న ‘సెక్యులర్ పార్టీల’ గతేమిటి? ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవంలో రాహుల్ గాంధీతో సన్నిహితంగా మెలగడం దేనికి సంకేతం? ఇటీవల ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న వివిధ పార్టీల పెద్దలు, సెక్యులర్ వాదులకు ‘జాతీయవాదం’ నినాదం సరిపడుతుందా? రాహుల్ గాంధీతో వారు జట్టుకట్టగలరా? కాంగ్రెస్ చెప్పే ‘జాతీయవాదం’ బంగారు వర్ణంలో కనిపించిన మాయలేడి తప్ప- నిజం కాదని విపక్ష పార్టీల నేతలు అంగీకరించక తప్పదు.
సిద్ధాంతాలు వేరైనా అధికారం కోసం పొత్తుకు సిద్ధపడుతున్న విపక్ష పార్టీలు ఈ దేశాన్ని, జాతీయతను కాపాడగలవా? భాజపాను ఓడించడమే వీరి ఏకైక ఎజెండా అని దేశ ప్రజలకూ తెలుసు. కేవలం మోదీని నిలువరింప చేయడం కోసం పొత్తులు కొనసాగించడం- ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, జాతీయతను కాపాడడం అసాధ్యమని గతంలో రుజువైంది. అవన్నీ జనం ఏనాటికీ మరిచిపోలేని చేదు అనుభవాలే! 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవటానికి ‘ఎమర్సెన్సీ’ పేరుతో ప్రజాస్వామ్యాన్ని కాలరాచి, దేశాన్ని చీకటి రాజ్యంగా మార్చివేసింది. ప్రజస్వామ్యాన్ని పునరుద్ధరించుకొని దేశాన్ని కాపాడేందుకు ‘లోక్‌నాయక్’ జయప్రకాశ్ నారాయణ్ మార్గదర్శకత్వంలో అప్పుడు దేశంలోని వివిధ రాజకీయ పక్షాలు ‘జనతా పార్టీ’గా ఆవిర్భవించి, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ‘జనతా పార్టీ’ ప్రయోగం విఫలమయ్యాక దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినా అవి మనుగడ సాగించలేదు. ప్రజల మద్దతులేని పార్టీలు రాజకీయ విన్యాసాలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అప్రజాస్వామికం, అనైతికం. ప్రజల మనోభావాలకు భిన్నంగా ప్రభుత్వాలు ఏర్పడినా ఫలితం శూన్యం. సెక్యులర్ పార్టీలంటూ ప్రచారం చేసుకొనే కుటుంబ పార్టీల అధినేతలకు పరాభవం తప్పదు.

-బలుసా జగతయ్య 90004 43379