సబ్ ఫీచర్

మార్కెట్ రహిత ఎకానమీ వైపు ఎందుకు కదలాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాను ఆదర్శంగా చూపిస్తూ, యాభై ఏళ్ల క్రితం నక్సల్‌బరీ ఉద్యమాన్ని ప్రారంభించారు కొందరు కమ్యూనిస్టులు. అనంతరం వారే నక్సలైట్లయ్యారు, ఆ తర్వాత మావోయిస్టులయ్యారు. అప్పుడు ఏ చైనానైతే ఆదర్శంగా చూపారో అదే చైనా ఇప్పుడు వారి అంచనాలకు మించిపోయింది. ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్థికశక్తిగా ఎదిగింది. అనూహ్యంగా దూసుకుపోతోంది. రెండంకెల వృద్ధిరేటును సాధిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. అన్ని రంగాల్లో మేటి అనిపించుకుంటోంది. సూపర్ కంప్యూటర్ల నిర్మాణంలోనూ అగ్రభాగాన నిలిచింది.
ఈ ‘దృశ్యం’ అందరికి కనిపిస్తోంది. అటు కమ్యూనిస్టులకు, నక్సలైట్లకు- మావోయిస్టులకూ కనిపిస్తోంది. అయినా, ఆ అభివృద్ధిని వారు ఆదర్శంగా చూపేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఇప్పటి చైనా తమకు ఆదర్శం కాదని ముఖం చాటేస్తున్నారు. ఇది ఓ రకంగా ద్వంద్వ నీతిలాంటిదే. 50 ఏళ్ల క్రితం ఆదర్శప్రాయమైన చైనా ఇప్పుడు ఆదర్శవంతం కాదంటే ఏమిటి మతలబు? మార్క్సిస్టు పంథా వీడి తనదైన మార్గాన్ని చైనా చేపట్టి అభివృద్ధిని సాధించి అసంఖ్యాక ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చింది, అగ్రరాజ్యమైన అమెరికాతో పోటీపడుతోంది, అన్ని రంగాల్లో ఢీకొంటోంది. అయినా ఆ దేశాన్ని ఆదర్శంగా చూసేందుకు మావోలు ఇష్టపడటం లేదు.
వాస్తవానికి నక్సలైట్లకు- మావోయిస్టులకిప్పుడు ఆదర్శవంతమైన దేశమంటూ ఏదీ మిగలలేదు. తమతమ విధానాలను కాలానుగుణంగా మార్చుకుని తమ ప్రజల ఆర్థికాభివృద్ధికి అవసరమైన విధానాలను అనుసరిస్తూ అన్ని దేశాలూ అడుగు ముందుకేస్తున్నాయి. ఇది నక్సలైట్లకు-మావోయిస్టులకు నచ్చడం లేదు. పిడివాదులుగా మార్క్సిజం సిద్ధాంతాన్ని తు.చ. తప్పక పాటిస్తూ ఉండటమే ముఖ్యం తప్ప ఆర్థికాభివృద్ధి, సంపద దృష్టి, వనరుల పంపకం ముఖ్యం కాదని వాదిస్తూ అందరినీ వ్యతిరేకిస్తున్నారు.
ఈ పద్ధతిలోనే అటు రష్యా-చైనా, తూర్పు యూరప్ కమ్యూనిస్టు దేశాలు చిత్తశుద్ధితో, అంకితభావంతో ఆలోచించి అడుగులు వేసినా ఆశించిన ఫలితాలు రావట్లేదని- క్రమంగా ప్రపంచ పద్ధతిని అనుసరించడానికి సిద్ధమయ్యాయి. ఆ దారిలో పయనిస్తూ ప్రజల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పాలకులు ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యంగా సాంకేతికపరంగా చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులకు తలుపులు మూసి ఉంచలేమని గ్రహించి వారు తమ పిడివాదనలను సడలించుకుని, సంస్కరణలు చేపట్టి నూతన గాలులను ఆహ్వానించారు. ఈ మార్పు భారతదేశ మావోయిస్టులకు ఇష్టం లేదు. సాంకేతిక రంగంలో గాని ఇతర సంపద సృష్టిరంగాల్లోగాని విప్లవాత్మక మార్పులొచ్చినా పట్టించుకోరాదన్నది మావోయిస్టుల- నక్సలైట్ల వాదన. పూర్తి జడత్వంతో, పిడివాదంతో ‘మార్కెట్ రహిత’ వ్యవస్థకే అంకితమై కాలం వెళ్లదీయాలన్నది వారి భావన. వర్తమానంలో ఈ వైఖరి ఎవరినీ ఆకర్షించడం లేదు. ఎవరూ దాన్ని ఆలింగనం చేసుకోవడం లేదు. దాంతో భారతదేశ మావోయిస్టులు- నక్సలైట్లు ఒంటరివారయ్యారు.
50 ఏళ్ళ క్రితం చైనాలో సాంస్కృతిక విప్లవం తీసుకొచ్చిన ‘ఉన్మాదం’ అలాగే కొనసాగాలని భారతదేశ విప్లవకారులు ఆశపడుతున్నారు. ఆ ఉన్మాదం సరైనది కాదని, తప్పు జరిగిందని అక్కడి పాలకులే లెంపలేసుకుని ప్రపంచానికి క్షమాపణలు చెబితే భారతదేశంలోని ఆ ‘ఉన్మాదం’ అభిమానులకు మాత్రం అది తప్పేం కాదు, ముమ్మాటికి ఒప్పే. అది చారిత్రాత్మకమైన కదలిక, ఉత్తుంగ తరంగం, నూతన మానవుని సృష్టికి బీజం అది... ఆ నూతన మానవుడిని భారతదేశంలోనూ తయారుచేసేందుకు తాము కంకణం కట్టుకున్నామని కత్తులు నూరుతున్నారు. ఆ ప్రక్రియను ఇంకా కొనసాగిస్తున్నారు. చైనా పరిణామాలను అక్కడి నాయకులకన్నా, అక్కడి విశే్లషకులకన్నా, నిపుణులకన్నా భారతదేశ నక్సలైట్లు-మావోయిస్టులకు ఎక్కువ అవగాహన, అభినివేశం ఉన్నట్టు ఊగిపోయారు. ఇంకా ఊగిపోతూనే ఉన్నారు. ఆ మానసిక స్థితిని స్థిరపరచుకుని కాలం వెళ్ళబుచ్చుతున్నారు.
ప్రపంచంలో ఏ సమాజమైనా సరే ‘వర్తమానం’లోనే జీవిస్తుంది. భూత కాలంలో కాదు. అదేమిటో గానీ- మావోయిస్టులకు భూతకాలమంటే అధిక వ్యామోహం. ఆ వైఖరే వారి దృక్పథాన్ని, దృక్కోణాన్ని తెలియజేస్తోంది. ఈ వెనుకబాటుతనాన్ని ప్రేమించేవారు ప్రజలకు ఎలా నాయకత్వం వహిస్తారు? ఇది కోటి రూకల ప్రశ్న? ప్రపంచమంతటా ఇప్పుడు నాల్గవ పారిశ్రామిక విప్లవ ఫలితాలు వెల్లివిరుస్తున్నాయి. డిజిటల్ యుగం ప్రారంభమైంది. డిజిటల్ ఎకానమీ అవతరించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ , నానోటెక్నాలజీ, కృత్రిమమేధ ఇవన్నీ కలగలిసాక సంపద సృష్టి ప్రాథమ్యాలు మారిపోయాయి. మరికొన్ని సంవత్సరాల్లో అన్ని సమాజాలూ సమూల మార్పులకు లోనవనున్నాయి. ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విద్య-వైద్యం, రవాణా, పాలనా సమస్తం రూపాంతరం చెందనున్నాయి. ప్రస్తుతమున్న పద్ధతులు మూలనపడనున్నాయి. అవి ప్రాసంగికత కోల్పోనున్నాయి.
ఇంటర్నెట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చెయిన్, బిగ్ డేటా అనాలసిస్, కృత్రిమమేధ, త్రీడీ ప్రింటింగ్, బిట్-కాయిన్.. ఇలా ఒకటా రెండా? అనేకం ఈ సమాజాన్ని ముంచెత్తనున్న తరుణంలో మావోయిస్టులు దండకారణ్యంలో మకాం వేసి వీటన్నింటినీ ప్రజల్లోకి ప్రవహించకుండా అడ్డుకట్టవేసి, నిరోధించి అందులోని ‘విషా’న్ని ప్రజలకు విడమరిచి చెప్పి మార్కెట్ రహిత సిద్ధాంతంలోని ఔన్నత్యాన్ని విశదంగా వివరించి ప్రజల్ని అటువైపుకు నడిపిస్తామని ఆశపడుతున్నారు. అడవుల్లోకి నడిపిస్తామని చెబుతున్నారు. వినడానికైనా ఇది అర్థవంతంగా కనిపిస్తోందా? లేదు!
ఇలాంటి ప్రయత్నమే 1976-78 ప్రాంతంలో కాంబోడియాలో మావో ప్రియశిష్యుడు ‘పోల్‌పాట్’ చేసి లక్షలాది మందిని మసిచేశాడు. నరమేధాలకు పాల్పడి ప్రజాకంటకుడిగా చరిత్రలో మిగిలిపోయాడు. సాంకేతికత- నాజూకుదనం, జ్ఞానం ఇవేవి ఇష్టపడని పోల్‌పాట్ కాంబోడియా ప్రజల్ని అడవులకు, పొలాల వైపు తరలించి లక్షలాది మంది ప్రజల ఉసురుతీశాడు. కోట్లాది మంది ప్రజలు కెమ‘రోగ్’ పాలనలో అష్టకష్టాలు అనుభవించారు. అయినవారిని పోగొట్టుకున్నారు. ఆ పోల్‌పాట్ అంశలోనివారే ప్రస్తుత భారతదేశ మావోయిస్టులు. మార్కెట్ ఎకానమీని, సాంకేతిక అభివృద్ధిని, ప్రజల సాధికారతను పెంచడం ఇష్టం లేక కేవలం మార్క్సిజం- లెనినిజం సూత్రాల ఆధారంగామాత్రమే ఈ ప్రపంచం, ప్రజలు కదలాలి తప్ప పెట్టుబడిదారి విధానం ఏ మాత్రం ముందడుగువేసినా సహించబోమని మందుపాతరలు, మర తుపాకులు పేలుస్తూ నక్సల్-మావోలు భారత్‌లో చెలరేగుతున్నారు.
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో, అబూజ్‌మాడోలో వారి దాడులు-కదలికలు ఆదివాసీలకు ఉరిని బిగిస్తున్నాయి. ఒకప్పుడు మైదాన ప్రాంత అమాయక ప్రజలను బలిగొంటే ఇప్పుడు అమాయక ఆదివాసీలను దీపపు పురుగుల్లా మారుస్తున్నారు. ప్రజల సంక్షేమం,అభివృద్ధి కన్నా మార్క్స్- మావో సిద్ధాంతాలు, ఆలోచనలు ముఖ్యం కాదు. వారివారి దేశాల్లోనే నాయకులు ప్రాసంగికతను కోల్పోయారు. తూర్పు జర్మనీ కమ్యూనిస్టులు కట్టిన అడ్డు (బెర్లిన్) గోడను పాతికేళ్ళక్రితం కూల్చేశారు, మావోతో కలిసి లాంగ్‌మార్చ్‌లో పాల్గొన్న డెంగ్ జియావోపింగ్ చైనాలో సంస్కరణలు ప్రవేశపెట్టి 35 సంవత్సరాలు దాటింది. ఆ పునాదులపైనే నవ చైనా ప్రపంచ ప్రజలతో పోటీపడుతూ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. మరి భారతదేశ ప్రజలే ఎందుకు దండకారణ్యం వైపు మార్కెట్ రహిత ఎకానమీవైపుకదలాలి? ఎందుకు అసువులు బాయాలి?... ఎందుకు ఆస్తులను ధ్వంసం చేసుకోవాలి? ఎందుకు వెనుకబడిపోవాలి? ఎందుకు దేబిరిస్తూ బతకాలి? ఎందుకు వర్తమాన సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో జ్ఞానాన్ని పెంచుకోకూడదు? ఎందుకు నాల్గవ పారిశ్రామిక విప్లవంలో భాగస్వామ్యం కాకూడదు? ఎందుకు ఈ సైబర్ ప్రపంచంతో కలసి నడవకూడదు. ఎందుకు ఈ ‘డిజిటల్ యుగం’లో తమశక్తిని ధారపోసి తోటివారిని అటువైపు నడిపించకూడదు?... ఆ వ్యవస్థలోని ‘దోపిడీ’ కన్నా మావోయిస్టుల-నక్సలైట్ల ఆలోచనల దోపిడీ, వనరుల- మానవ వనరుల దోపిడీనే అధికంగా కనిపిస్తోంది. ఈ వైఖరిని, ద్వంద్వనీతిని అందరూ నిరసించాల్సిందే! నిగ్గుతేల్చాల్సిందే!

- వుప్పల నరసింహం 99857 81799