సబ్ ఫీచర్

ప్రధానమంత్రి పదవికి మాయావతి మంకుపట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత లోక్‌సభలో ఒక్క సీటు కూడా లేని జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. ఆ పార్టీ అధినేత్రి మాయావతి వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికలు, ఒక లోక్‌సభ ఎన్నికలలో స్వరాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో ఘోర పరాజయాలను చవిచూశారు. అయినప్పటికీ ఆమె దేశ ప్రధానమంత్రి పదవిపై ఆశలను వదులుకోవడం లేదు. ఆ దిశలో వ్యూహాత్మకంగా ఆమె వేస్తున్న అడుగులు కుటుంబం వారసత్వంగా ఆ పదవి కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కంటకప్రాయంగా మారింది.
దేశానికి తొలి దళిత ప్రధాన మంత్రి కావాలని ఆమె ఒకటిన్నర దశాబ్ద కాలంగా పట్టుదలతో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చంద్రశేఖర్, దేవెగౌడ, ఐ. కె.గుజర్ వంటి నేతలు ప్రధానమంత్రి పదవి అలంకరించిన తర్వాత పార్లమెంట్ లో ఏ పార్టీకి, కూటమికి స్పష్టమైన ఆధిక్యత లభించలేని పక్షంలో 40 నుండి 50 మంది ఎంపీల మద్దతు కూడదీసుకొంటే ఆ పదవి అలంకరించడం తేలిక అనే భావం నేడు సర్వత్రా వ్యాపిస్తోంది. ములాయం సింగ్ యాదవ్ నుండి అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వరకు సహితం అటువంటి కలల ప్రపంచంలోనే కాలం గడుపుతున్నారు.
ఇప్పటి వరకు ఎన్నికల ముందు మరే పార్టీ తో పొత్తుకు, సీట్ల సర్దుబాటుకు విధానపరంగా మాయావతి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే మొదటిసారిగా అందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. అయితే తన షరతులపైననే అది జరగాలని ఆమె స్పష్టం చేస్తున్నారు. తనకు గౌరవప్రదమైన సీట్లు ఇస్తేసరే, లేకపోతే తన దారి తనదే అని ఆమె స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికల పొత్తు విషయంలో గతంలో వచ్చిన ఓట్లు, గెలిచిన సీట్లను పరిగణ లోకి తీసుకొనే ఏ పార్టీ అయినా మరో పార్టీకి సీట్లు వదలడానికి సిద్ధపడుతుంది. అయితే మాయావతి అందుకు సిద్దపడటం లేదు. ఈ విషయంలో ఫార్ములాలు పనిచేయవని, తాను అడిగిన సీట్లు ఇవ్వవలసిందే అని స్పష్టం చేస్తున్నారు. ఆ మేరకు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో ఆమె అడిగిన సీట్ల గురించి కాంగ్రెస్ మీనమేషాలు లెక్క పెడుతూ ఉంటె ఛతీస్‌గఢ్‌లో గుట్టు చప్పుడు కాకుండా కాంగ్రెస్ తిరుగుబాటు నేత, మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి, ఆయనతో సీట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ఒక విధంగా కాంగ్రెస్‌కు షాక్ వంటిదే.
సొంతంగా పోటీ చేయడం వల్లన ఆమె పార్టీ ఎన్ని సీట్లను గెలుస్తుందో గాని దళిత్ ఓటర్లను చీల్చి తమకు మాత్రం భారీ నష్టం కలిగిస్తుందని కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో సహితం వామపక్షాలతో పొత్తుకు సిద్ధపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్న ఈ రాష్ట్రాలలో ఆమె అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు సహజంగానే కాంగ్రెస్‌కు చికాకు కలిగిస్తున్నది. ఇక ఆమెకు చెప్పుకోదగిన బలం ఉన్న ఉత్తరప్రదేశ్ లో సగం సీట్లు తనకు వదిలి, మిగిలిన సగంలో కాంగ్రెస్, ఆర్ ఎల్ డి వంటి వారికి కొద్దీ సీట్లు ఇచ్చుకోమని అఖిలేష్ యాదవ్ కు సూచిస్తున్నది.
2014లో బీఎస్పీ ఆమెను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆ ఎన్నికలలో ఒక్క సీట్ కూడా రాకపోయినా, ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో పరాభవం ఎదురైనా ఆమె దిగులు పడటం లేదు. సీట్లు రాకపోతున్నా చెప్పుకోదగిన ఓట్లు మాత్రం వస్తూ ఉండడంతో ఆమె రాజకీయ ప్రాధాన్యతను ఎవ్వరు తక్కువచేసి చూడలేక పోతున్నారు. తిరిగి గత మేలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో 2019 ఎన్నికలలో ఆమెను ప్రధానమంత్రి అభ్యర్థిగా మరోమారు ప్రకటించారు.
ఇటువంటి ప్రకటనలను ఆమె వేళాకోళంగా చేయడం లేదు. తద్వారా పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం కలిగించడం, దళిత వర్గాలలో భరోసా కలిగించడం ఆమె ఉద్దేశం. దళితుల పుత్రిక - అనే అభిప్రాయాలను వ్యాప్తి చేయడం ద్వారా 2019లో హంగ్ పార్లమెంట్ ఏర్పడితే కనీసం నిర్ణయాత్మక శక్తిగా అవతరించాలని భావిస్తున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ సహితం అటువంటి ఎత్తుగడలలోనే ఉన్నారు. సీట్లు రాకపోయినా ప్రతి పార్టీ బీఎస్పీ పట్ల సానుకూల ధోరణి అవలంభించడం ఎందుకంటే ఓట్లను బదిలీ చేయగల సామర్థ్యం ఉన్న పార్టీ దేశంలో బీఎస్పీ ఒక్కటే కావడం గమనార్హం. మిగిలిన పార్టీలతో పొత్తులు ఏర్పాటు చేసుకున్నా ఆయా పార్టీల ఓటర్లు తమకు వోట్ వేస్తారనే నమ్మకం ఉండదు. దేశంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీ కూడా బీఎస్పీ మాత్రమే. కేవలం కాంగ్రెస్‌తో మాత్రమే పొత్తు పెట్టుకోలేదు.
అందుకనే ప్రతిపక్ష కూటమి అనే పదం ఎప్పుడు వచ్చినా అందరి దృష్టి ఆమెపై పడుతుంది. చివరకు బిజెపి సహితం అవసరాన్ని బట్టి ఆమెతో చేతులు కలపడానికి వెనుకాడదు. వాస్తవానికి 1998లో 13 నెలల వాజపేయి ప్రభుత్వం ఒక్క వోట్‌తో పడిపోవడంతో ఆమె కీలక పాత్ర వహించారు. వాజపేయికి మద్దతు తెలుపుతామని కాన్షీరామ్ హామీ ఇచ్చినా, ఆమెతో పాటు ఐదుగురు ఎంపీలు చివరిలో మాట మార్చి వ్యతిరేకంగా వోట్ వేశారు.
2014 ఒక్క సీట్‌ను గెల్చుకోలేక పోయినా ఉత్తరప్రదేశ్ లో 19.8 శాతం, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో 4.5 శాతం చొప్పున ఓట్లు బీఎస్పీకు లభించాయి. కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో సహితం చెప్పుకోదగిన ఓట్లు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ లో తమ చిరకాల రాజకీయ ప్రత్యర్థి సమాజ్‌వాద్ పార్టీకి చెందిన అభ్యర్థులకు ఆమె ఇచ్చిన మద్దతు కారణంగా గోరఖ్‌పూర్, ఫుల్పూర్ ఉపఎన్నికలలో బిజెపి ఓటమి చెందడంతో ప్రతిపక్షాల ఐక్యతకి ఆమె అవసరం ఏమిటో వెల్లడైనది.
అప్పటి నుండి జాతీయ రాజకీయాలలో ఆమె ప్రాధాన్యత పెరుగుతూ వస్తున్నది. కర్ణాటకలో ఆమెతో పొత్తు ఏర్పాటు చేసుకోవడం జేడీఎస్ కు కొంతమేర ప్రయోజనం చేకూర్చింది. హెచ్.డి.కుమారస్వామి ముఖ్యమంత్రి కావడానికి దోహదపడింది. గెల్చిన సీట్లతో సంబంధం లేకుండా దేశం అంతటా దళిత్ ప్రజలు తమ బిడ్డగా ఆమెను గౌరవిస్తున్నారు. ఆమెపై అవినీతి ఆరోపణలు వచ్చినా -ఒక దళిత్ నేతను చూసి ఓర్వలేక పోతున్నారు అనుకున్నారు గానే, ఆమె పట్ల వైముఖ్యం పెంచుకోలేదు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఒక విధంగా మాయావతి ప్రాబల్యానికి పరీక్ష వంటిదని చెప్పవచ్చు. ఈ ఎన్నికలలో ఆమె తన ప్రభావాన్ని కొంతమేరకు చూపించుకో గలిగితే ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలలో కీలక పాత్ర వహించక తప్పదు. సీట్ల సర్దుబాటులో ఆమె డిమాండ్‌లకు కాంగ్రెస్ తలవంచక తప్పని పరిస్థితులు ఏర్పడవచ్చు.
తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఈ మూడు రాష్ట్రాలలోని బీజేపీ ప్రభుత్వాలు అధికారం నిలబెట్టుకోవడం లేదా అధికారం కోల్పోవడం 2019 ఎన్నికలపై నిర్ణయాత్మక ప్రభావం చూపే అవకాశం ఉంది. 2008లో ఆ విధంగా జరగలేదని ఇప్పుడు ఈ ఎన్నికల ప్రాధాన్యతను తక్కువగా చూడలేము.
దళితులు రాజస్థాన్‌లో 12 శాతం, మధ్య ప్రదేశ్‌లో 15.2 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 12 శాతం వరకు ఉన్నారు. ఈ మూడు రాష్ట్రాలలో 65 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఎప్పుడూ కూడా రాజకీయాలలో మాయావతి ఎటువంటి నిర్ణయం తీసుకొంటారో, ఎటువైపు అడుగు వేస్తారో ఊహించడం కష్టం. ఎవ్వరి అంచనాలకు అందని రీతిలో వ్యవహరిస్తూ ఉంటారు. మూడు దశాబ్దాల రాజకీయ వాదానికి స్వస్తి పలికి అఖిలేష్ యాదవ్‌తో జత కలుస్తారని ఒక సంవత్సరం ముందు కూడా ఎవ్వరు ఊహించనే లేదు.
రాహుల్ గాంధీ ఆశిస్తున్నట్లు బిజెపికి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థి పోటీ చేసే విధంగా మహాకూటమి ఏర్పాటు చేయాలనే ఆలోచనకు పలు ప్రతిపక్షాల నుండి సానుకూల స్పందన రావడం లేదని ఈ సందర్భంగా వెల్లడి అవుతున్నది. ఈ పార్టీలు అన్ని కాంగ్రెస్ బలహీనంగా ఉంటేనే తమ ప్రాధాన్యత పెరుగుతుందనే అంచనాతో ఉన్నాయని గ్రహించలేక పోతున్నారు. ఒక వంక బిజెపి సీట్లు తగ్గాలి, మరో వంక కాంగ్రెస్ కోలుకోకూడదు. అప్పుడే తాము కేంద్ర ప్రభుత్వంలో నిర్ణయాత్మక పాత్ర వహించే వీలు ఉంటుందని అభిప్రాయంతో ఉన్నారు. ఆ దిశలోనే ఎవ్వరికి వారుగా ఎత్తుగడలు వేస్తున్నారు. రాజకీయంగా తమ ప్రాధాన్యత లభించే రీతిలో పొత్తులకు సిద్ద పడితే కాంగ్రెస్‌తో చేయి కలపడానికి సిద్దపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం తో పొత్తు కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సిద్ధపడుతున్నా రాహుల్ గాంధీ మాత్రం మమతతో పొత్తు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ఈ విషయమై ఆమె నుండి ఎటువంటి సానుకూల సంకేతాలు వెలువడక పోవడం గమనార్హం. నరేంద్ర మోదీని ఓడించాలి అంటే ఉత్తరప్రదేశ్ లో బిజెపి సీట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే ఏకైక మార్గం. అందుకు మాయావతి కలసి రావడం అనివార్యం. ఆమె లేకుండా బిజెపిని ఎదుర్కోవడం కాంగ్రెస్ కు సాధ్యం కాదు. అందుకోసం మాయావతి పట్ల ఇతర రాష్ట్రాలలో కొంచెం ఉదారంగా కాంగ్రెస్ వ్యవహరించక తప్పదు. కానీ కాంగ్రెస్‌లో ఆ ధోరణి కనిపించడం లేదు.

--చలసాని నరేంద్ర 98495 69050