సబ్ ఫీచర్

నేటి రాజకీయ ‘చతురుడు’ ఎవరంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటికే ‘ప్లాన’వసర
మప్పటికా ‘ట్రిక్సు’చేసి అఖిల ప్రజలన్
తప్పేమి తనదికాన
ట్టెప్పటి కొప్పించు పాలిటిషియనె గ్రేటోయ్!
1940 వ దశకంలో ఒక సందర్భంలో బ్రిటన్ ప్రధాని చర్చిల్‌ను పత్రికా విలేఖరులు- ‘నిజమైన, తెలివైన రాజకీయ చతురుడు అంటే ఎవరు?’ అని అడిగారు. అప్పుడు చర్చిల్ చెప్పిన సమాధానం ‘ముందు ముందు దేశంలో ఎంతటి విపరీత పరిణామాలు రాబోతున్నాయో చెప్పాలి. ఎన్ని రాజకీయ ప్రమాదాలు, ఒడుదుడుకులు వస్తాయో చెప్పాలి. దేశం ఎంత అధోగతి పాలవుతుందో చెప్పి, ప్రజలకు కంగారు పుట్టించాలి. ఆ తరువాత తాను చెప్పినవి ఏవీ జరక్కపోతే అవి ఎందుకు జరగలేదో చెప్పాలి. అలా చెప్పేవాడే, చెప్పగలిగేవాడే నిజమైన రాజకీయ చతురుడు’ అని. ఇది అక్షరాలా తెదేపా అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సరిపోతుంది.
1977లో పురుడు పోసుకొని అప్పటికప్పుడు అధికారంలోకొచ్చిన జనతాపార్టీ కేవలం మూడేళ్ల ముచ్చటగానే చరిత్రలో నిలిచిపోయింది. 1980లో ఇందిరాగాంధీ ‘అఖిల భారత సింహాసనం’ మరోసారి అధిరోహించింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి పదవి పొందారు. ఆ తరువాత 1982లో పుట్టిన తెలుగుదేశం పార్టీలోకి మారటానికి కాంగ్రెస్‌ను ఆక్షేపించి, మామ ఎన్.టి.ఆర్.ను సంతోషపరచి, ఎన్నికలలో గెలిచి మళ్ళీ మంత్రి అయినారు.
కొన్నాళ్ళకు ఎన్.టి.ఆర్. పట్టుదలను, పద్ధతులను, రాజనీతి, కార్యనిర్వాహక విధానాలను వ్యతిరేకించి, కొంతమంది శాసనసభ్యులను కూడగట్టుకొని, ఒక ముఠాకట్టి, పబ్లిగ్గా రాజధాని నడిబొడ్డున అప్పటి వైస్రాయ్ హోటల్లో కలిపి కట్టిపడేశారు. తలుపులు మూయించి- ఒక పిట్టైనా బయటకు- లోపలకు పోకుండా వ్యూహం పూర్తి చేశారు. ఆఖరుకు ఆ ఉద్రిక్త క్షణాలలో ట్యాంక్‌బండ్ రహదారిన ఎన్.టి.రామారావు మీద ఎవరో చెప్పు విసిరేసినా కనీసం ఖండించలేదు ‘రాజకీయ చతురుడు’ చంద్రబాబు వ్యూహాత్మకంగా. అవును ఆయన నేడు అంటున్న ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది’ అనేది ఈరోజు మాట కాదు. ఆనాటిది కూడాను. 1980 దశకంలో విద్యుత్ చార్జీలు విపరీతంగా అతని ‘దొరతనం’ పెంచితే దానికి నిరసన తెలిపిన ప్రజాసమూహాన్ని బషీర్‌బాగ్‌లో గుఱ్ఱాలతో తొక్కించారు- నెత్తుటి గుఱుతులు చేదు గుఱుతులుగా చేసిపెట్టి. ఆ మార్నాడు తలకు కట్టుతో- దానం నాగేంద్ర అనుకుంటాను- శాసనసభలో కనిపించారు. కనీసం ‘సారీ’ అనలేదు ఆనాటి ముఖ్యమంత్రి ‘నారా’ వారు. అప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడలేదు ఆయన దృష్టిలో.
ప్రజాస్వామ్యబద్ధపు ఎన్నికలలో గెలిచి, గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోదీని గుజరాత్ అల్లర్లకు బాధ్యుడని నిందించిన నాయుడు 2014 ఎన్నికలలో అదే మోదీ నాయకత్వపు పార్టీతో ఎన్నకల పొత్తు కుదుర్చుకున్నప్పుడు తన స్వార్థ ఆశాంతరంగ స్వామ్యమే గొప్ప నిష్కల్మష ప్రజాస్వామ్యం- నీ వొకందుకు పోస్తే నేనొకందుకు తాగాను అన్నట్టు. తాను తఱచూ అంటుండే ‘అడ్డగోలు విభజనకు’ తల ఊపింది- ఆ బీజేపీయే అంతకుముందు నెలలో మరి. సీమాంధ్రలోని అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్ని అలక్ష్యం చేస్తూ రాత్రికి రాత్రే మాటమార్చి యూ టర్న్ తీసుకుంటూ రాష్ట్ర విభజనకు జై అన్న చంద్రబాబు రెండుకళ్ల చూపులో- ‘స్టేక్ హోల్డర్స్’ (విభజన వల్ల నష్టపోయే జనాలు, సంస్థలు) కనిపించలేదు. అప్పుడు సీమాంధ్ర ప్రజావాక్యము, అభిప్రాయస్వామ్యము ‘ప్రమాదంలో పడలేదు’. ‘ఆర్థిక నేరస్తుల జాబితాలో, కేసుల్లో కూరుకుపోయి ఉన్న జగన్ ఎలాగూ అధికారాన్ని అందుకోలేడు. అది ఇక దక్కేది తనకొక్కడికే’ అన్న ధీమాతో యూ టర్న్ తీసుకున్న ఆ నాయకుని ‘ఆశా విశ్వాసస్వామ్యం’ ప్రకారం సీమాంధ్ర ప్రజల మెజారిటీ ‘అభిప్రాయస్వామ్యం ప్రమాదంలో పడలేదు.’ కేంద్రంలో ఎన్‌డీఏ కూటమిలో మంత్రి పదవులు సంపాదించుకొని, ఆ అధికార ప్రభావ ఫలాలు సుమారు మూడేళ్ళపాటు అనుభవించి, తరువాత కేంద్రం ఇచ్చిన ఆర్థిక సహాయానికి తన లెక్కలు తాను చూపించి, తప్పంతా కేంద్రం మీద మోపి, బయటికి వచ్చి, బీజేపీని నానా తిట్లుతిట్టటమే బాబు మార్కు ‘ప్రజాస్వామ్యం.’
అలిపిరి దగ్గర తీవ్రవాదుల దుశ్చర్య నుంచి చంద్రబాబు తప్పించుకున్నందుకు అందరూ ఆనందించారు. ఆ సానుభూతిని సొమ్ముచేసుకోటానికి ప్రజలు అడక్కున్నా ముందస్తు ఎన్నికలు జరిపించటం ‘గొప్ప ప్రజాస్వామ్యం’!
2015లో గోదావరీ పుష్కరాలప్పుడు వీఐపీ పుష్కరఘాట్‌లో కాకుండా సాధారణ భక్తుల కోసం కేటాయించిన పుష్కరఘాట్‌లో చంద్రబాబు గంటల తరబడి అనేకమంది వీవీఐపీలతో కలసి ఉండటం, గడపటం, దీనివల్ల అమలైన నిషేధాజ్ఞలు, ట్రాఫిక్ ఆంక్షల కారణంగా లక్ష మందికి పైగా జనం పుష్కరఘాట్ దగ్గర చిక్కుబడిపోయి అవస్థలు పడటం, ఆ తొక్కిసలాటలో 28 మంది యాత్రికులు అకాల, అన్యాయ మృతికి లోనుకావటం- ఇదంతా చాలా ఘన ప్రజాస్వామ్యం. విజయవాడలో వీధుల వెడల్పు కోసం అక్కడి కొన్ని దేవాలయాలలో మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకుండా ఆగమశాస్తబ్రద్ధమైన పవిత్ర కార్య, ధర్మ, ఆచారాలకు సంబంధించిన ‘కళాపకర్షణ’అనే ప్రధాన క్రతువును ఏమాత్రమూ జరిపించకుండా గుడులను ప్రభుత్వ అధికారులు కూల్చేస్తే కనీసం అది తప్పు అనైనా అనకుండా- ముఖ్యమంత్రి ఏం చేస్తే అదే ‘ప్రజాస్వామ్యం.’
ఇసుక మాఫియా చేస్తున్న బహిరంగ ఘోర నేరాన్ని అడ్డుకోబోయిన రెవెన్యూ శాఖాధికారిణిని - మహిళ అని కూడా చూడకుండా- తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు అవమానించటం, అసభ్య పదాలతో దూషించటాలను వార్తావ్యవస్థ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూస్తూకూడా ఊరకుండటమే కాకుండా, పైగా తన అధికార పరిధి దాటి ఆమె వెళ్ళిందే తప్పు (దొంగను ఆమె పట్టుకున్నాసరే) అని తెలుగుదేశం పార్టీ తీర్మానిస్తే ఆ తీర్మానాన్ని ముఖ్యమంత్రి ఆమోదించటం ఒక ‘ఆదర్శ ప్రజాస్వామ్యం’. ముందుముందు ‘‘పక్కింట్లో దొంగలుపడి, ఆ ఇంట్లోవాళ్ళు గగ్గోలు పెడుతుంటే ఇవతలి ఇంట్లోవాళ్ళు వెళ్ళి దొంగను పట్టుకోవటం నేరం, ‘అది అమానుషం’-అని చెప్పటానికైనా సిద్ధపడే పరిస్థితిని ఊహంపజేసే అరాచకీయపు పక్ష అధినేతగా ఉండటం చంద్రబాబు మార్క్ ప్రజాస్వామ్యం.
కాంగ్రెస్ పార్టీ దుర్భర అవలక్షణాలను ఎండగట్టింది ఒకప్పుడు ఎన్‌టిఆర్., అతని పార్టీ వారూను. 2014లో సీమాంధ్రకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. ఆ అన్యాయానికి పశ్చాత్తాపం కూడా లేని పార్టీ కాంగ్రెస్. ఆ సంవత్సరపు ఎన్నికలలో తెలుగుదేశంపై దుమ్మెత్తిపోసిన పార్టీ కాంగ్రెస్. చివరకు ఎన్నికల ఫలితాలలో కనీసం ఒక్క నియోజకవర్గపు మెజారిటీ ప్రజల ఆమోదం కూడా పొందలేకపోయి సీమాంధ్రలో తుడిచిపెట్టుకుపోయిన పార్టీ కాంగ్రెస్.
నిన్నటి అలాంటి అంటరాని, అవాంఛనీయపు కాంగ్రెస్ నేడు ఒక కూటమిలో చంద్రబాబుకు ఆత్మీయ భావబంధపు పెద్దన్న, ఆపద్బంధువు, ప్రజాభిమాన వాక్యపు పార్టీ అయింది. అవును.. నిజంగానే చంద్రబాబు అన్నట్టు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది. ప్రజాస్వామ్యపు గొంతును కోసి, అర్ధరాత్రికర్ధర్ధరాత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటింపజేసి, ‘తస్మదీయు’లందర్నీ అరెస్ట్‌చేయించి, పత్రికా స్వాతంత్య్రాన్ని మంటగలిపిన ఇందిరమ్మ వదలివెళ్ళిన వారసులలోను, ఆ పార్టీలోను చంద్రబాబుకు ప్రజాస్వామ్య జన్యువులు కనిపిస్తున్నాయి!
ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం ఏర్పాటుచేసిన షా కమీషన్‌కు సహకరించని ఇందిరాగాంధీ ఒక ‘గొప్ప ప్రజాస్వామ్యవాది’. అదే భావం పుణికిపుచ్చుకున్న నేటి కాంగ్రెస్ యువ నాయకులను నమ్ముకొని, చంద్రబాబు ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది’ అంటూ నేడు జనాలను భ్రమాలోక సముద్రంలో ముంచి ఊదరగొట్టడం మాయల ఫకీరుకే టక్కుటమారాలు నేర్పే నేర్పరితనం.
1969లో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అధికారికంగానే ఇందిరాగాంధీని పార్టీనుంచి బహిష్కరిస్తే, ఇందిరాగాంధీ ‘వాళ్ళెవరు నన్ను బహిష్కరించటానికి? నేను ఎక్కడుంటే అదే కాంగ్రెస్’ అన్నది. ఇవ్వాళ చంద్రబాబుది కూడ అదే అహంభావ నిరంకుశత. తాను ఎక్కడుంటే అదే ప్రజాస్వామ్యం. తాను బీజేపీతో మైత్రిలో ఉన్నప్పుడు అక్కడ వర్ధిల్లినదే ప్రజాస్వామ్యం. తనకిప్పుడు బీజేపీ మిత్రపక్షం కాదు గనుక ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది’ట! ఇదీ- మసిబూసి మారేడుకాయ చేయటం అంటే. నిజంగానే చంద్రబాబు నిజమైన రాజకీయ ‘చతురుడు’! చర్చిల్ చెప్పిన దానికి నిలువెత్తు ‘నిదర్శనుడు.’

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 98497 79290