సబ్ ఫీచర్

వరాలు లేవు.. వంచన మిగిలింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వైఖరి ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఏపీకి ఇచ్చిన వరాలపై- నాలుగున్నరేళ్ళు గడిచినా మోదీలో ఎలాంటి చలనం లేదు. ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నతమైన పార్లమెంటు ఆమోదం పొందిన విభజన హామీలను అమలు చేయాలన్న ధ్యాస కేంద్ర ప్రభుత్వంలో లేకపోవడం విచారకరం.
పోలవరం సాగునీటి పథకం సీమాంధ్రుల జీవనాడి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన ఏకైక వరం కూడా ఇదే. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిన ‘పోలవరం’ నిర్మాణానికి జరిగిన ఖర్చులో మూడువేల కోట్లు ఇప్పటికే కేంద్రం చెల్లించాల్సి ఉంది. నూతన రాజధాని అమరావతికి కేంద్రం దమ్మిడీ కూడా ఇవ్వలేదు. విశాఖ రైల్వేజోన్ ఊసే లేదు. దుగరాజపట్నం ఎయిర్ పోర్టు ఆచరణ రూపం దాల్చలేదు. కడప ఉక్కు కర్మాగారంపై ఎలాంటి భరోసా ఇవ్వలేదు. ఐటీ సంస్థలు, వివిధ జాతీయ విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో రాలేదు. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన రు.350 కోట్ల నిధులను వెనక్కి లాగేశారు. ఆంధ్ర రాష్ట్రంలోని భాజపా నాయకులను ప్రోత్సహించి ‘అన్నీ ఇచ్చేశాం’ అన్న ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యూహాత్మక దాడి మొదలెట్టారు. భాజపా రాష్ట్ర నేతలు ఏపీ ప్రయోజనాలకు బదులు రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఒకపక్క ఏపీలోని ఐదున్నర కోట్లమంది ప్రజలు ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల అమలు కోసం గొంతు పగిలేలా నినదిస్తున్నారు. నిరంతర ఆందోళనలను చేపడుతున్నారు. భాజపా మినహా అన్నిపక్షాల రాజకీయ పార్టీలు తమ తమ స్థాయిల్లో విభజన హామీల అమలు కోసం ఆందోళనలు చేశారు కూడా. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు పూర్తిగా సీమాంధ్ర ప్రజలకు సంబంధించినవి. అవి వారికి రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కులు. గత ప్రభుత్వం కానీ, వర్తమాన ప్రభుత్వం కానీ హామీలిచ్చింది సీమాంధ్ర ప్రజలకే తప్ప రాజకీయ పక్షాలకు కాదు. రాజకీయ పక్షాలు కాలానుగుణంగా వ్యూహాలు మార్చవచ్చు. రాజకీయంగా ఎదగాలనే తాపత్రయంలో హామీలను కూడా మరచిపోవచ్చు. కానీ, చట్టబద్ధమైన ప్రభుత్వ విధానాలు మారకూడదు. ఏపీలోని రాజకీయ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం వాడుకోవాలని చూడటం సిగ్గుచేటు.
ఏపీ సీఎం చంద్రబాబు ఈ హామీలను సాధించేందుకు పలుసార్లు ఢిల్లీ వెళ్లొచ్చారు. ప్రధాని మోదీని స్వయంగా కలిశారు. పలు లేఖలు రాశారు. విభజన హామీల అమలులో కేంద్రం వైఖరికి విసిగివేసారి కేంద్ర మంత్రివర్గం నుంచి తెదేపా మంత్రులు వైదొలిగారు. ఎన్డీఎ కూటమి నుంచి తెదేపా నిష్క్రమించింది. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ధర్మదీక్షలు చేపట్టారు. ఐనా మోదీలో కించిత్ స్పందన లేకపోవడం విడ్డూరం. నాలుగేళ్లు కలసి ఉన్న ‘మిత్రుడు’ విడిపోయారనే బాధ కూడా లేదు. ఎపీపై ఎందుకింత వివక్ష? ప్రజలు చేసిన తప్పేంటి? ప్రత్యేక హోదాను పదేళ్ల పాటు ఇప్పిస్తామన్న ‘పెద్దమనుషులు’ ఏమయ్యారు? ఢిల్లీని తలదనే్న రాజధాని నిర్మాణానికి సాయం చేస్తామన్న ప్రధాని మోదీ శంకుస్థాపనకు వచ్చి కాస్త మట్టి, నీళ్ళు తప్ప ఏమిచ్చారు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో- ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అని ఆవేదన చెందిన ప్రధాని మోదీ ఆ తల్లిపై చూపిన ఔదార్యం ఏదీ? విభజన హామీలే పట్టనట్టు కేంద్రంలోని నేతలు వ్యవహరించడం సమంజసమా? రాజకీయ ప్రయోజనాలు, కక్షలు ముఖ్యమనుకుంటే- తెలుగు ప్రజలేం చేశారు? ఐటీ దాడులపై ఉన్న ఉత్సాహం- ఏపీకి ఇచ్చిన హామీలపై ఎందుకు లేదు? దక్షిణాదిపై ఉత్తరాది పాలకుల పెత్తనానికి ఇది పరాకాష్ఠా? ఈ వైఖరి ఎన్నాళ్ళు? ఇలాంటి పాలన దేశానికి ఏం సందేశం ఇస్తున్నట్లు? కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల రాష్ట్ర ప్రజల్లో ఆగ్రహం నానాటికీ పెరుగుతోంది. కాలం వెళ్లబుచ్చో, మసిపూసి మారేడుకాయచేసో సీమాంధ్రులను నమ్మించవచ్చు అనే భ్రమలు ఎన్నాళ్లు? వివక్ష వల్ల ఎలాంటి ఫలితాలు ఉండవు, పనిచేసి మెప్పుపొందటం తప్ప కేంద్రానికి మరో గత్యంతరం లేదు. సీమాంధ్రుల అసంతృప్తి జ్వాలలు ఇంకా చుట్టుముట్టక ముందే పరిస్థితిని చక్కదిద్దాలి. లేకుంటే వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమ సత్తా నిరూపించేందుకు సిద్ధంగా ఉంటారు..!

-పోతుల బాలకోటయ్య 98497 92124