సబ్ ఫీచర్

మావోయిస్టు నాయకత్వం మారితే ఒరిగేదేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు నియమితులైనట్టు ఆ పార్టీ అధికారికంగా ఇటీవల ప్రకటించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతి పాతిక సంవత్సరాలపాటు పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీకి సేవలు అందించి వృద్ధాప్యం, ఆరోగ్య కారణాల రీత్యా స్వచ్ఛందంగా ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలగినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజుకు మిలటరీ కార్యక్రమాల్లో, వ్యూహా ల్లో దిట్ట అన్న పేరుంది. దండకారణ్యంలోని మావోయిస్టు మిలటరీ వ్యవహారాలన్నీ ఆయన చూసేవారని, నిఘా విభాగాన్ని సైతం ఆయనే పర్యవేక్షించారని తెలుస్తోంది. బసవరాజుపై ప్రభుత్వం గతంలోనే రెండు కోట్ల రూపాయల రివార్డును ప్రకటించింది. దాంతో ఆయన ఎంత కీలకమైన వ్యక్తో అవగతమవుతున్నది. ఆ పార్టీ ఐదవ కేంద్ర కమిటీ సమావేశంలో ఈ నాయకత్వ మార్పు జరిగిందని, ఈ సమావేశం గత సంవత్సరం ఫిబ్రవరిలోనే జరిగిందని, అన్ని స్థాయిల్లో ఆ మార్పుపై చర్చ చేసేందుకు ఇంత సమయం తీసుకున్నారని తెలిసింది.
లక్ష్మణరావుకన్నా వయసులో కొంత చిన్నవాడు కావడం, ఎక్కువ దూకుడు స్వభావం గలవాడు కావడం, మిలటరీ వ్యవహారాల్లో దిట్ట కావడం, ఆయుధ విక్రయదారులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం మావోయిస్టు గెరిల్లా విముక్తి సైన్యాన్ని నడిపిన అనుభవం ఉండటం తదితర అనేక కారణాలరీత్యా పార్టీ పగ్గాలు బసవరాజుకు దక్కినట్టు అవగతమవుతోంది.
వాస్తవానికి ఏకవాక్య సిద్ధాంతమైన ‘దీర్ఘకాల సాయుధ పోరాటం’ మావోయిస్టులను ముందుకు నడిపిస్తోంది. ఆ సిద్ధాంతాన్ని ఎంత కఠినంగా ఆచరణలో పెడతారన్నదానిపైనే వారి మనుగడ ఆధారపడి ఉంటుంది. ప్రధాన కార్యదర్శిగా ఎవరున్నా కీలకమైన ఈ పంథా చుట్టూనే వారు పరిభ్రమిస్తున్నారు. నాయకత్వం మార్పు పెద్ద ప్రభావం చూపదు. ఎంత దూకుడు ప్రదర్శిస్తారన్నదే వారి సామర్ధ్యానికి గీటురాయిగా ఉంటుంది.
కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి కాలం నుంచి ఇదే వైఖరి తప్ప బాహ్య ప్రపంచంలో జరిగిన, జరుగుతున్న మార్పులను పట్టించుకుని తదనుగుణంగా స్పం దించే వైనం ఆ పార్టీలో శూన్యం. దీంతో బయటి ప్రపంచం ఎంతగా మారినా తమవైఖరి పోతపోసిన చందంగా ఒకే తీరుగా కొనసాగడంతో మావోయిస్టు పార్టీ తన ప్రాసంగికతను కనబరచలేకపోతోంది. కరడుగట్టిన భూస్వామ్య విధానం అమలులో ఉన్న సందర్భానికి, ఆధునిక ఇంటర్నెట్ ద్వారా స్వేచ్ఛగా ప్రజలు జీవిస్తున్న సమయానికి ఒకే తీరుగా స్పందించి అవే నినాదాలు, అవే ఎత్తుగడలు, అవే పాటలు- పద్యాలు పాడితే అవెలా సమంజసమవుతాయి? కొత్త తరాల అవసరాలు మారాయి, వారి ఆలోచనలు మారాయి. అంతర్జాతీయ పరిస్థితులు సమూలంగా మారాయి. సాంకేతిక పరిజ్ఞానం గతంలో ఎన్నడూ లేనంత పెద్దఎత్తున ప్రజాజీవితాన్ని తాకుతోంది. దానికి ప్రజలు ప్రభావితమవుతున్నారు. సంపద ప్రాథమ్యాలు మారాయి. ‘శ్రమ విధానం’ పూర్తిగా మారింది. వౌలికాంశాలను మావోయిస్టులు పట్టించుకోలేక పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం రూపాంతరం చెందింది. ఈ విషయాన్ని అటు రష్యా-ఇటు చైనాలో స్పష్టంగా తిలకించవచ్చు. మావోయిస్టు పోరాటాలు సైతం సంపూర్ణంగా మారాయి. నేపాల్, కొలంబియా, ఫిలిప్పైన్స్ తదితర దేశాల మావోయిస్టులు తమ పంథాను మార్చుకున్నారు. ప్రజానుకూలంగా రూపొందించుకున్నారు. మన పొరుగున ఉన్న నేపాల్‌లో దశాబ్దం క్రితమే మావోయిస్టులు ఆయుధాలు విసర్జించి పార్లమెంటరీ రాజకీయాల్లోకి అడుగిడారు. నేపాల్‌లో మావోయిస్టు నేత ప్రచండ ఏకంగా ప్రధాని పదవిని చేపట్టారు. అంతిమంగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలను చైతన్యపరచాలి, వారి అభివృద్ధిని కాంక్షించాలి, ఉన్నతికి తోడ్పడాలి. ఈ ప్రాథమిక సూత్రం ఆధారంగానే రాజకీయ పార్టీలు పనిచేయాలి. మరి భారత మావోయిస్టు పార్టీ మాత్రం నేపాల్, కొలంబియా తదితర దేశాల మావోయిస్టులకు భిన్నంగా తుపాకీ గొట్టం ద్వారానే, దీర్ఘకాల సాయుధ పోరాటం ద్వారానే అధికారం హస్తగతం అవుతుందని భావిస్తూ అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తే అదెలా భావ్యమనిపించుకుంటుంది?
వౌలికంగా భౌతిక పరిస్థితులు మారాయి, ప్రజల ఆలోచనలు మారాయి, ప్రపంచం ప్రజాస్వామ్యం వైపు మొగ్గింది. దీనికి భిన్నంగా ఏక స్వామ్యం ఆలోచనతో నియంతృత్వ భావనలతో, ‘మార్కెట్ రహిత వ్యవస్థ’ నిర్మాణం పేర కదం తొక్కుతామని కలలుకంటే అదెలా సాధ్యమవుతుంది? మన ఇరుగు-పొరుగున అలాంటి సమాజం- వ్యవస్థ ఉంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజల్ని ‘ఆర్గనైజు’ చేయొచ్చు. కాని అలాంటిదేమీ లేదు. ఒకప్పుడు చైనా ఆ ‘రంగు’తో కొంత కనిపించింది. వర్తమానంలో ఆ దేశం పూర్తిగా పెట్టుబడిదారీ విధానాలను అవలంబిస్తోంది. అనేకమంది ధనవంతులు, పెట్టుబడిదారులను చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసీ)లో చేర్చుకున్నారు. అధికారికంగా వారంతా పార్టీ సభ్యులు. అంతేగాక వారి నైపుణ్యం, శక్తియుక్తులు, సంపద సృష్టి కారణంగానే చైనాలో సోషలిజం నిర్మాణం జరుగుతోందని అక్కడి పార్టీ అధిష్ఠానం అభిప్రాయపడుతోంది. అక్కడ ‘జాక్‌మా’ వర్తమాన పెట్టుబడిదారుడు, సాంకేతిక దిగ్గజం, ఈ-కామర్స్‌ను చైనాలో ప్రవేశపెట్టి పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చాడు. అతనికి ఇప్పుడు జనం హారతులు పడుతున్నారు. చైనా సమాజంలో ఆయనకు కీలక స్థానం కల్పించారు. చైనా యువతరం ఆయనను ఆదర్శంగా తీసుకుంటోంది. కొత్త తరాన్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఇలా ఎందరో ధనవంతులు, స్థిరాస్తి వ్యాపారులు, పెట్టుబడిదారులు సంపద సృష్టిస్తూ పంచుతున్నారు. ప్రభుత్వానికి వారిప్పుడు కీలక వ్యక్తులయ్యారు. ఒకప్పుడు ఇలాంటివారిని ‘వర్గ శత్రువులు’గా కమ్యూనిస్టులు భావించారు. కాని ప్రస్తుతం వారంతా తోటి ‘కామ్రేడ్లు’గా గౌరవం-గుర్తింపు పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. దీన్ని పసిగట్టాలి కదా? ఏ దేశ పౌరులు ఆ దేశ ఆదాయాన్ని పెంచాలి, పంచాలి. ఈ వౌలికాంశాన్ని ప్రజలు గుర్తించారు.
అటువైపు వ్యవస్థలు- వ్య క్తులు కదులుతున్నారు. దీన్ని ‘నెగేట్’ చేసి తద్భిన్నమైన వ్యవస్థ కోసం కలలుకంటూ అందుకోసం ఆదివాసీల, పేద ప్రజల ప్రాణాలను పణంగా పెడతామనడం ఏవో కొన్ని పరాయి దేశ సూత్రీకరణలను- సిద్ధాంతాలను అరువుతెచ్చుకుని ఆవేశపడటం అంతగా నప్పని వ్యవహారం. మార్క్సిజం- లెనినిజం- మావో ఆలోచనా విధానం పుట్టిన దేశాల్లోనే వాటి అస్తమయం జరిగింది. యూరప్‌లో, తూర్పు యూరప్‌లో ఒకప్పుడు మార్క్సిజాన్ని ఒక ‘మతం’ కన్నా ఎక్కువ విశ్వసించిన వారిప్పుడు ‘స్వేచ్ఛా సమాజం’ కోసం పాటుపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చిన ‘మార్పు’ పాత ఆలోచనల్ని తుడిచేసింది. మార్క్సిజం ఆలోచనలిప్పుడు ఆయా దేశాల యువతరంలో కలికానికైనా కానరావు. పూర్తిగా వర్తమాన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న సరళతర, సులభతర, సౌకర్యవంతమైన జీవితానికి అలవాటుపడ్డారు. నూతన ఆవిష్కరణల పట్ల అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రపంచం అతి చిన్నదని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు.
పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరగడంతో జవాబుదారీతనం పాలకుల్లోనూ కనిపిస్తోంది. దీన్ని మరింత మెరుగుపరిచే దిశగా ఆయా సమాజాలు కదులుతున్నాయి. ‘వర్గాలు’ అన్న మాట లుప్తమైంది. ఆ మాట లుప్తమైనప్పుడు కమ్యూనిజం అన్న మాటే లేదు. కమ్యూనిజమే లేనప్పుడు మావోయిజం ఎక్కడ నిలుస్తుంది? ఈ అతిసాధారణ విశే్లషణ వైపు మావోయిస్టులు ‘చెవి’పెట్టకపోవడం విడ్డూరం.
భారతదేశ మూలాలు ఏ మాత్రం లేని మావోయిజం ఈ దేశంలో ఎలా పాదుకుంటుందన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా? పైగా ఆ ‘ఇజం’ ఎంతోకొంత బతికి బట్టకట్టిన దేశాల్లో ‘ఆవిరి’ అయిపోయిన సందర్భంలో ఇలా దండకారణ్యంలో ‘ప్రజాసైన్యం’ రూపకల్పన చేయడం పూర్తిగా కాలం చెల్లిన ఆలోచన. పాలకులు-పాలితులు వేర్వేరుగా లేనప్పుడు, సమాజంలో వర్గాలు లుప్తమైనప్పుడు, అందరికీ అన్ని అవకాశాలు లభ్యమవుతున్నప్పుడు, జ్ఞాన ఆధార సమాజం నిర్మితమవుతున్న వేళ, పేదవాడు జ్ఞానవంతుడు అయితే అతను అతి స్వల్పకాలంలో అందలం ఎక్కుతున్న ‘దృశ్యం’ కళ్ళముందు కనిపిస్తుండగా, ఓ దశాబ్దం- దశాబ్దన్నర కాలంలో బడుగు-బలహీన వర్గాల్లో లక్షలాది మంది తమ ఆర్థిక స్థాయిని పెంచుకుని సామాజిక నిచ్చెన మెట్లు ఎక్కి సాధికారతతో జీవిస్తున్న వైనం కళ్ళముందు కనిపిస్తుండగా ఎవరిని రెచ్చగొట్టి ప్రజాసైన్యం నిర్మిస్తారు? అలాచేస్తే దానికేమైనా ‘మాన్య త’ఉంటుందా?
ఈ ప్రపంచం మాది, మేమే దీన్ని మా ఆలోచనలకు అనుగుణంగా మార్చుకుంటామని యువత పిడికిలి బిగించి ముందుకు కదులుతుండగా మావోయిస్టులు కీకారణ్యం లాంటి దండకారణ్యంలో సమావేశమై తమ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని మార్చుకుని మరింత దూకుడుగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలిస్తే భారత ప్రజలకు ఒరిగేది ఏమిటి? కోట్లాది ప్రజలు పాల్గొంటున్న శాసనసభ- పార్లమెంట్ ఎన్నికల వ్యవహారం కల్పించే ప్రభావాన్ని తలకిందులు చేయలేరుగా? పేద ప్రజల కోసం ఎక్కువ తాపత్రయ పడతారన్న మావోలు తమ వైఖరి మార్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు అవిభక్త కమ్యూనిస్టుపార్టీ ఇలాగే దూకుడుగా పోరాటాలు నడిపి, అనంతరం విరమించుకున్న సంగతి గుర్తెరగాలి. ఆయుధాలు-పోరాటాలు- మరణాలు ముఖ్యం కాదు. ప్రజల బాగోగులు, వారి చైతన్యం ముఖ్యం. దీన్ని విస్మరించి ఎన్ని ఎత్తుగడలు-వ్యూహాలు పన్నినా అది చరిత్రలో నిలవని వ్యవహారమే అవుతుంది. బూడిదలో పోసిన పన్నీరు చందంగానే ఉంటుంది!
అంతిమ సారాంశమేమిటంటే... ముప్పాళ పోయి నంబాళ్ల వచ్చినా, ఆయన పోయి మల్లోజుల వచ్చినా పేద ప్రజలకు ఒరిగేది శూన్యం అన్నది సంపూర్ణ సత్యం. పేద ప్రజలను వర్తమాన సమాజానికనుగుణంగా తీర్చిదిద్దినవాడే నేడు మొనగాడు, విప్లవకారుడు. అలాంటివారికే లాల్ సలామ్!

-వుప్పల నరసింహం 99857 81799