సబ్ ఫీచర్

అమెరికా చదువుకు ... వెంపర్లాటెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో దిగిన వెంటనే విద్యార్థులను విమానాశ్రయంనుంచే వెనక్కి పంపించేసిన వార్త చదివినప్పుడు సుమారు ఇరవై ఏళ్ళనాటి సంఘటన గుర్తుకొచ్చింది. అప్పట్లో మా అబ్బాయి అమెరికా వెళ్లి స్టూడెంట్‌గా ఉన్నప్పుడే మాకు ఆ దేశాన్ని చూపిస్తాడనీ కానీ, అక్కడ అయిదు లక్షల డాలర్ల ఉద్యోగంలో ఉంటాడని కానీ ఊహకి కూడా అందని విషయం. ఇరవై ఏళ్ళనాడు ఒక ఫంక్షన్‌లో ఒకావిడ అమెరికాలో ఉన్న తన కూతురి ఫొటోలు చూపించింది. చూసినవారంతా ఆమె అదృష్టానికి పొంగిపోడమో, అసూయపడడమో చేశారు. నిజమే, అమెరికా అంటే భూతలస్వర్గం. డాలరు అరవై రూపాయల పైమాటే. రోజుకి యాభై డాలర్లు సంపాదించినా చాలు. నెలకి దగ్గర దగ్గరగా లక్ష రూపాయలు. ఈ ఊహతోనే విద్యార్థులు విమానాలెక్కారు. వెనక్కి వచ్చేశారు.
అమెరికాలో జీవనం గురించీ, ఆదాయం గురించీ ఎలా తెలుసుకుంటున్నారు. ఎప్పుడో అక్కినేని నాగేశ్వరరావు అమెరికా అనుభవాలను పత్రికాముఖంగా సీరియల్‌గా వ్రాస్తే అపురూపంగా, ఆశ్చర్యంగా చదివిన కాలం కాదిది. దిగువ మధ్యతరగతి కుటుంబాలలో సైతం అప్పో, సొప్పో చేసి ఇంజనీరింగ్ కోర్సు చదివించి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు పంపుతున్నారు. సంఖ్య పెరిగిన కారణంగా అమెరికాలోని జీవితం గురించి చెప్పేవారి సంఖ్య పెరిగింది. చెప్పేవారు రెండు రకాలు. మొదటి గ్రూపులో అక్కడ ఉద్యోగం చేస్తున్నవారుంటారు.
రెండవది అక్కడున్నవారి తల్లిదండ్రులు. అమెరికాలో పనివాళ్ళ జీతాలు చాలా ఎక్కువ. డెలివరీ అయిన అమ్మాయిలకు ఉద్యోగం మానడం ఇష్టముండదు. వారికొచ్చే జీతంతో ఇంట్లో పనిమనిషిని పెట్టుకోవడం కానీ, పిల్లలను క్రష్‌లో ఉంచడం కానీ సాధ్యంకాదు. అమ్మా నాన్నలను (కుదిరితే అమ్మని మాత్రమే. ఒక విమానం టిక్కెట్టు మిగిలినా మంచిదే) పిలిపించుకుంటారు. అంతగా చదువుకోని దిగువ మధ్యతరగతి మహిళ అక్కడ సదుపాయాలనూ, ఆడంబరంగా చేసే ఫంక్షన్లనూ చూసి మూర్ఛపోయినట్లుగా ఫీలవుతుంది. ఇండియా వచ్చి బంధు మిత్రులకూ, వీలయితే పత్రికా ముఖంగానూ- అక్కడ గొప్పలు చెప్తుంది. ఇక ఇండియా నుంచి తమ పిల్లలను పంపేదాకా ఎవరికీ నిద్రపట్టదు.
తల్లిదండ్రులలో పిల్లలను అమెరికా పంపించడానికి కంకణం కట్టుకున్న వారుంటారు. తామే వెళ్ళాలని ఆరాటపడే యువతీ యువకులున్నారు. మూడోవర్గం కూడా అక్కడక్కడ కన్పిస్తుంది. భర్తలను ముందుగా పంపి, ఆపైన తాము వెళ్లాలని ఆశపడే భార్యలుంటారు. మహిళల పుట్టింట్లో అన్నతమ్ములో, అక్కచెల్లెళ్లో అమెరికా అనే భూతల స్వర్గ విశేషాలు చెప్పగానే, వెళ్ళాలన్న కోరిక భారతదేశంలో ఉన్న ఆడదానికి కల్గుతుంది. వెంటనే ఇంట్లో పోరు మొదలవుతుంది. భర్త ఈ దేశంలో మంచి ఉద్యోగంలో ఉన్న విషయం గురించి స్పృహ ఉండదు. ఈ ఇతివృత్తంతో ఒక డాక్టరు రచయిత నవల కూడా వ్రాశారు. ప్రభుత్వం నుంచి మెరిట్ సర్ట్ఫికెట్ కూడా పొందిన డాక్టరు టూరిస్టు వీసాపై అమెరికా వెళ్లి అగచాట్లు పడి, చావు తప్పి కన్నులొట్టపోయి వెనక్కి వచ్చిన కథ. అమెరికాలో ఉద్యోగం దొరికి, సరైన వీసాతో వెళ్లాలి కానీ చదువుకున్నవారు కూడా తప్పుమార్గంలో వెడితే ఎలా?
ప్రస్తుతం వెనక్కి పంపబడిన విద్యార్థులు చేసిన పని అదే. అమెరికాలో ఉన్నవారూ, బేబీ సిట్టింగ్ చేసి వచ్చినవారూ కాకుండా అమెరికా గొప్ప గురించీ, డాలరు విలువ గురించీ చెప్పే ఇంకొక వర్గం బయల్దేరింది. అదే కన్సల్టెంట్ ఏజెన్సీలు. ఇదివరకు గల్ఫ్‌కి వర్కర్లుగా పంపే ఏజెన్సీలు మాత్రమే ఉండేవి. ఇపుడు కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్‌తో తామరతంపరగా ఇంజనీర్లు తయారవుతున్నారు. వారిలో ఉద్యోగం సంపాదించుకునే శక్తి ఉన్నవారు తక్కువ. అలాంటివారిని అమెరికాలో పేరులేని యూనివర్సిటీలలో ఎమ్.ఎస్. చెయ్యవచ్చుననీ, చదువుకుంటూనే గంటకి పది డాలర్లదాకా సంపాదించుకోవచ్చుననీ మోసపు మాటలతో వలలో వేసి, డబ్బు సంపాదించే ఏజెన్సీలు పుట్టుకొచ్చాయి. చదువుకుందుకు మాత్రమే వీసా ఇవ్వబడుతుంది కానీ ఉద్యోగం చెయ్యడానికి కాదు. ఉద్యోగం చెయ్యడానికే వీసా దొరికితే చదువుకుందుకుండదు. ఈ విషయాలు తెలుసుకోకుండా విమానం ఎక్కి అమెరికాలో అడుగుపెట్టకుండానే వెనక్కి వస్తే, అగ్రరాజ్యపు అహంకారం అని దూషించడం తగదు.
వెనక్కి వచ్చిన వారి సంగతిని పక్కనపెడితే పట్టుబడకుండా ఇదివరలో వెళ్లిన వారి సంగతేమిటి? చిన్న ఫ్లాట్‌లో పదిమంది సద్దుకుని, దొంగతనంగా ఉద్యోగం చేస్తే మాత్రం ఎంత సంపాదించగలరు, అందులో ఎంత మిగల్చగలరు, ఇండియాలో చేసిన అప్పు ఎప్పటికి తీర్చగలరు?
ఈ ప్రశ్నలను పేరులేని యూనివర్సిటీలలో చదువుతూ, సంపాదించాలనుకునేవాళ్ళే కాదు, గుర్తింపున్న యూనవర్సిటీలలో సీటు తెచ్చుకున్నవాళ్ళూ ఆలోచించాలి. అమెరికాలో ఏవరేజి విద్యార్థి చదువుకి అరవై లక్షలైనా ఖర్చవుతుంది (యూనివర్సిటీని బట్టీ, రాష్ట్రాన్ని బట్టీ తేడాలుండచ్చు). చదివిన తర్వాత వచ్చే ఉద్యోగమేమిటి, ఆదాయమెంత? మన శక్తి సామర్థ్యాలను బట్టి మాత్రమే మనకు దొరికే ఉద్యోగముంటుంది. ఇండియాలో జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం మాత్రమే తెచ్చుకోగలిగినవాడికి అమెరికాలో నల్లజాతి శ్రామికుల పిల్లలు చదివే స్కూల్లో ఉద్యోగం దొరుకుతుంది తప్ప ఎమ్.ఐ.టి.లో ప్రొఫెసర్‌గా పనిదొరకదు. అమెరికా వెళ్ళిన వారందరూ ఇంద్రనూరుూ, సత్యనాదెళ్ల, సుందర్ పిచ్చైలు కాలేరు. సమర్థులు ఇండియాలోనే ఉండి అబ్దుల్ కలాం, నారాయణమూర్తిలూ కావచ్చు. ఏ దేశంలో ఉన్నా సమర్థులు శిఖరాలు చేరుకుంటారు, అసమర్థులు అట్టడుగునే ఉంటారు. దిగువ మధ్యతరగతివారు ఇక్కడ హోల్‌సేల్ మార్కెట్లో కనుక్కున్నట్లే, ఆ దేశంలోనూ ఊరి చివర సూపర్ మార్కెట్లలో డజన్ల లెక్కన కొనుక్కుంటారు. ఇక్కడ రేషన్ షాపులుంటే అక్కడ ఫుడ్ స్టాంపులున్నాయి. ఇక్కడకన్నా అక్కడ రోడ్లూ, కరెంటూ, నీళ్ళూ మొ దలైనవి కొంత బాగుంటా యి. అందుకోసమే అయి తే అమెరికా వెళ్లండి. ఇక్కడకన్నా అక్కడ ఏదో పొడిచేస్తామన్న ఆశ (దురా శ)తో మాత్రం వెళ్ళద్దు.
**
అమెరికాలో ఉన్నత విద్య చాలా ఖరీదు.
బాగా చదువైనా రావాలి, ఖర్చుపెట్టడానికి ఇష్టపడే సమర్థులైన తల్లిదండ్రులైనా ఉండాలి. ఆ కారణంగా అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు- అందునా భారతీయులవలె తక్కువ జీతాలకు పనిచేసేవారికి డిమాండ్ ఉంది. అందువల్ల మన దేశంనుండి 1990 దశకంలో అమెరికాకు ఉద్యోగానికి వెళ్ళేవారి సంఖ్య పెరిగింది. ఏడాదికి సుమారుగా ఎనభై వేల డాలర్ల కుటుంబ ఆదాయం ఉండేలా (టాక్స్ కట్స్‌కి ముందు) చూసుకోవచ్చు.
**
అందరూ న్యూజెర్సీ, కాలిఫోర్నియా వంటి పురోగమించిన రాష్ట్రాలలో ఉండాలని లేదు. లూసియానా, మిస్సిస్సిపి వంటి దక్షణ రాష్ట్రాలలోనో, కాన్సస్ వంటి మధ్య అమెరికా ప్రాంతంలోనో కూడా ఉండవచ్చును. ఎక్కడున్నా కూడా నూటికి ఎనభై శాతంపైగా భారతీయులు పెద్ద చెరువులో చిన్న చేపలవలెనే ఉంటారు. ఇండియా వచ్చేసరికి వారికి చిన్న చెరువులో పెద్ద చేపలమన్న భావం కలిగి అమెరికా విషయంలో గొప్పలకి పోతారు.

- పాలంకి సత్య