సబ్ ఫీచర్

ఫలిస్తున్న మోదీ ఆర్థిక విధానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కొత్త ఆలోచనలను చేయకపోవటం కంటే పాత ఆలోచనల నుండి బయటపడకపోవటమే నష్టదాయకం’ అని ప్రఖ్యాత ఆర్థిక శాస్తవ్రేత్త జాన్ మీనార్డ్ కీన్స్ అంటాడు. ఆర్థిక విధానాల వల్ల సుదీర్ఘకాలంలో ఒనగూరే ప్రయోజనాల కంటే స్వల్పకాలంలో జరిగే లాభనష్టాలను జాగ్రత్తగా అంచనా వేసి, సమీప భవిష్యత్‌కు అనుగుణమైన విధానాలకే ప్రాధాన్యతను ఇవ్వాలన్నది కీన్స్ అభిప్రాయం. ఇటీవల పార్లమెంటులో మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను ప్రస్తావిస్తూ కీన్స్ వ్యాఖ్యలను ఉటంకించారు.
స్థూల జాతీయోత్పత్తిలో 20 నుండి 30 శాతం ప్రభుత్వ లెక్కలలోకి రావటం లేదని, దాన్ని బయటకు తీసుకొనిరావటానికే పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొంది. మన్‌మోహన్‌తోపాటు పెద్దనోట్ల రద్దును విమర్శించే అనేకమంది- కీన్స్ పెద్దనోట్ల రద్దుకు అనుకూలమన్న విషయాన్ని మర్చిపోతున్నారు. సమష్టి డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం పూనుకొని తన వ్యయాన్ని పెంచకపోతే, కేవలం ప్రైవేటువ్యక్తుల, సంస్థల వ్యయంతో అభివృద్ధి కానీ, ఉపాధి కల్పన కానీ పెరగదని కీన్స్ సూత్రీకరించారు. పన్నురేట్లు ఆకర్షణీయంగా ఉండాలని, ప్రభుత్వ పెట్టుబడి వ్యయం ఎక్కువగా ఉండాలని కీన్స్ ప్రతిపాదించాడు. ద్రవ్య విధానం కంటే కోశ విధానానికే కీన్స్ ఎక్కువ విలువనిచ్చాడు. పెద్ద నోట్లరద్దు ద్రవ్య, కోశ లోట్లను తగ్గిస్తుంది. పకడ్బందీగా అమలు చేస్తే ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది. అసంఘటిత రంగాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకొని రావటానికి వున్న మార్గాలలో ఇదొకటి.
కీన్స్ సిద్ధాంతం రెండు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంది. మొదటిది పెట్టుబడి గుణకం (ఇనె్వస్ట్‌మెంట్ మల్టిప్లయర్). రెండవది ద్రవ్యత్త్వ బోను (లిక్విడిటీ ట్రాప్). ప్రభుత్వ వ్యయం- ముఖ్యంగా పెట్టుబడుల వ్యయం 100 కోట్లు పెరిగితే గుణక పరిమాణం బట్టి ఆదాయం, ఉత్పత్తి, ఉపాధి కొన్ని రెట్లు ఎక్కువగా పెరుగుతుంది. ఉపాంత వినియోగ ప్రవృత్తి (మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్) ఎక్కువగా ఉంటే గుణకం పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక పెట్టుబడి వ్యయం పెరుగుదలకు కొన్ని రెట్లు ఎక్కువగా స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది. ద్రవ్యత్త్వ బోను అంటే వడ్డీ రేట్లు పడిపోయినా, పెట్టుబడులకు నిధులు సమకూరుతున్నా, పెట్టుబడులు చేయటానికి ఔత్సాహికులు ముందుకురాని ఒకానొక స్థితి. ఎందుకంటే ద్రవ్యం వేగంగా చేతులు మారకపోవటమే కాక, ప్రజలు వ్యయం చేయటానికంటే దాచుకోటానికే ఇష్టపడినపుడు, సమిష్టి డిమాండ్‌లో లోటు ఏర్పడుతుంది. 1930 దశకంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యానికి ప్రధాన కారణం ఈ ద్రవ్యత్త్వ బోను స్థితి. దీని నుండి బయటపడటం అంతతేలిక కాదు. ఆర్థిక వ్యవస్థలు ఈ ద్రవ్యత్త్వ బోను బారిన పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. 2008లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి అనేక ఇతర కారణాలతోపాటు ఈ ద్రవ్యత్త్వ బోను కూడా కారణం. అమెరికా సహా పలు అభివృద్ధి చెందిన దేశాలలో వడ్డీ రేట్లు శూన్యస్థాయికి పడిపోయినా సమీప భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించకపోవటంతో పెట్టుబడులు పెరగలేదు.
పెద్దనోట్ల రద్దు ద్వారా మోదీ ప్రభుత్వం ఈ ద్రవ్యత్త్వ బోనుబారి పడకుండా ఆర్థిక వ్యవస్థను కాపాడింది. పెద్దనోట్ల రద్దుతో ద్రవ్య చెలామణి రేటు పెరిగింది. తద్వారా డిమాండ్ పెరిగింది. ఉత్పత్తి ఉపాధి రెండూ పెరగటానికి అవసరమైన కార్యరంగం సిద్ధమైంది. నోట్ల రద్దుతో స్వల్పకాలంలో అభివృద్ధికి అంతరాయం తప్పనిసరి. నోట్ల రద్దుతో నష్టపోయిన వర్గాలు అస్తవ్యస్థ పరిస్థితిని మరింత జటిలం చేశాయి. కానీ 5-10 ఏళ్ళలో పరిస్థితి చాలా సానుకూలంగా మారుతుంది. పెద్దనోట్ల రద్దు ‘చేదుమాత్ర’ వంటిది. అభివృద్ధి రేటును సుస్థిరం చేయటమే కాక వృద్ధి రేటును 8 శాతం కంటే ఎక్కువగా తీసుకెళ్లగలిగిన సత్తా దానికి ఉంది. అమెరికా రిజర్వు బ్యాంకు ఫెడరల్ రిజర్వు దగ్గర నాలుగు ట్రిలియన్ డాలర్ల మేర నిధులు పెరిగినా దాని స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదల రేటు 2014, 2015లలో 2.4శాతానికి మించలేదు. అమెరికాలో నిరుద్యోగితా శాతం 5 కంటే తక్కువే. 48 మిలియన్లమంది నిరుద్యోగ భృతిని తీసుకోవటానికి ఇష్టపడటమే అందుకు కారణం.
127 కోట్లమంది జనాభా ఉన్న మనదేశంలో కేవలం 5 కోట్ల మందే మొన్నటివరకూ వ్యక్తిగత ఆదాయపు పన్ను కట్టేవారు. అంత తక్కువమంది ఆదాయపు పన్ను కట్టటం అంటే ఎక్కడో లోపం ఉన్నట్టే. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ లోపాన్ని సవరించలేకపోయాయి. నోట్ల రద్దు ద్వారా, ఆధార్, పాన్‌లతో అనుసంధానం ద్వారా అదనంగా అనేక కోట్లమందిని ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు. డాలర్ విలువ నవంబర్‌లో బాగా పెరిగింది కానీ, రూపాయి తన విలువను 2.5శాతం మాత్రమే కోల్పోయింది. అదే సమయంలో చైనా కరెన్సీ విలువ కనిష్టాస్థాయికి పడిపోయింది. 2013 ఆగస్టులో రూపాయి విలువ ఒక్క నెలలోనే 8.1 శాతం పడిపోయిందన్న విషయం చాలామంది మర్చిపోయారు. అప్పుడు అధికారంలో ఉన్న మన్‌మోహన్‌సింగ్ రూపాయి విలువ ఎందుకు పడిపోయిందో కూడా చెప్పలేదు. 2013లో మన విదేశీ మారకద్రవ్య విలువలు 289 బిలియన్ డాలర్లుగా వుంటే మొన్న నవంబర్ నాటికి 367 బిలియన్ డాలర్ల స్థాయికి అవి చేరాయి. ద్రవ్యోల్బణం ఇటీవల బాగా పడిపోయింది. వినియోగదారుల ధరల సూచీ నవంబరు 2013లో 11.6 శాతంగా వుంటే ఈ ఏడాది అక్టోబరు నాటికి 4.2శాతానికి పడిపోయింది. ఆహార ధరల సూచీ అదే సమయంలో 14.72 శాతం నుండి 3.32కు పడిపోయింది.
ద్రవ్యోల్బణం అనేది పెద్ద తిరోగమన పన్ను. దాని వల్ల పేదలు నష్టపోతారు. అల్పాదాయ వర్గాల నుండి ధనిక వర్గాలకు ఆదాయం బదిలీ అవుతుంది. ద్రవ్యోల్బణాన్ని మోదీ ప్రభుత్వం సమర్థవంతంగా అరికట్టగలిగింది. మన్‌మోహన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకొనిపోయి అసలు సమస్యలను గాలికి వదిలేసింది. దాన్ని సరిచేసే బాధ్యతను మోదీ ప్రభుత్వం తన భుజాలకు ఎత్తుకొన్నది. విదేశీ వాణిజ్యానికి సంబంధించి కూడా మోదీ ప్రభుత్వం విశేషమైన ప్రగతిని సాధించింది. 2013 డిసెంబరు 3వ త్రైమాసికానికి కరెంటు ఖాతాలోటు ప్రమాదకర స్థాయికి 6.7 శాతానికి చేరి, 2012-13లో 4.8 శాతానికి పడిపోయింది. కోశ లోటు 2011-12లో 5.7శాతంగా నమోదై, ఆ తరువాతి సంవత్సరంలో 4.9 శాతమైంది. కోశలోటు, కరెంటు ఖాతా లోటు అధికంగా వున్న కారణం చేత మన దేశపు ఋణ అర్హత రేటింగు ఆ సంవత్సరాలలో బాగా పడిపోయింది. మోదీ ప్రభుత్వ విధానాలతో 300 బిలియన్ డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 2016-17లో కరెంటు ఖాతా లోటు 0.5శాతంగా నమోదైంది. కోశ లోటు 2105-16లో 3.9శాతమై 2016-17లో 3.5శాతానికి పడిపోయింది. విదేశీ రుణాలు 2013లో 409 బిలియన్ డాలర్లుగా ఉంది. రుణసేవా కవరేజ్ నిష్పత్తి 5.9 శాతం నుండి 8.8 శాతానికి పెరగటం విదేశీ రుణాలమీద తక్కువ ఆధారపడటాన్ని సూచిస్తుంది. స్వల్పకాలిక విదేశీ రుణాల శాతం 23.6 శాతంనుండి 17.2 శాతానికి పడిపోయింది.
అనేక పరోక్ష పన్నుల స్థానే ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ)తో దేశమంతా ఒకే పెద్ద ఉమ్మడి మార్కెట్ అయింది. రాష్ట్రాల మధ్య వున్న ఆర్థిక అడ్డుగోడలను తొలగించి దేశమంతా ఒకే మార్కెట్‌ను చేయటంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించింది. ‘ఒకే దేశం-ఒకే పన్ను’ నినాదంగా మిగిలిపోక కార్యరూపం దాల్చింది. ‘ఆధార్’తో అనుసంధానం ద్వారా రాయితీలు పక్కదారి పట్టకుండా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రజలకే నేరుగా బదిలీ చేశారు. కొత్తగా తీసుకొని వచ్చిన దివాలా స్మృతి, అందులో భాగంగా నెలకొల్పిన ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా పెద్ద పెద్ద ఋణగ్రహీతలను దారికితెచ్చే పనికి పూనుకొన్నారు. కావాలని రుణాలు ఎగగొట్టడం ఇప్పుడు అంత తేలిక కాదు. ఇపుడు పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు బకాయలను చెల్లించటానికి ముందుకు వస్తున్నాయి. బినామీ ఆస్తుల స్వాధీన చట్టంతో వేరొకరి పేర్లతో ఆస్తులు సమకూర్చుకోవటం ఇప్పుడంత తేలిక కాదు. పన్నుల ఎగవేతకు చట్టబద్ధ మార్గాన్ని సుగమం చేసిన ద్వంద్వ పన్నుల రద్దు ఒప్పందాలను గత ప్రభుత్వాలు చేసుకొన్నాయి. సైప్రస్, లక్సెంబర్గ్, మారిషస్‌కు నిధులు అక్రమ మార్గాలలో తరలించి, అక్కడి నుండి విదేశీ పెట్టుబడుల రూపంలో చట్టబద్ధంగా నిధులను మన దేశంలోకి ఇంతవరకూ తరలిస్తూ వచ్చారు. ఈ ద్వంద్వ పన్నుల రద్దు ఒప్పందాలకు సవరణలు తీసుకొని వచ్చి మన దేశం నుండి ఆ దేశాలకు నిధుల వెల్లువకు అడ్డుకట్ట వేయగలిగారు. రాజకీయంగా దమ్మున్న మోదీ వంటి నాయకుడే ఇటువంటి పనులు చేయగలడు.
దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తులను తిరిగి రప్పించటానికి చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి. పెట్టుబడిదారీ దేశాలు తమ దేశస్థులు ఆర్థికంగా నిజాయితీతో ఉండాలని కఠిన చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తుంటాయి. అదే సమయంలో ఇతర దేశాల నుండి వచ్చే ఆర్థిక నేరస్థులకు ఆశ్రయం ఇస్తున్నాయి. అక్రమంగా కూడపెట్టిన నల్లధనాన్ని తమ దేశాలలో దాచుకోవటానికి వీలు కల్పిస్తున్నాయి. ఆ దేశాల దంద్వ నీతివలన మన దేశం తీవ్రంగా నష్టపోతున్నది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి ఆర్థిక నేరస్థులను తిరిగి రప్పించడానికి- వారికి ఆశ్రయం ఇచ్చిన దేశాలలో సుదీర్ఘ న్యాయ పోరాటం చేయవలసి వస్తున్నది. ఈ పోరాటాల్లోనూ మోదీ ప్రభుత్వం విజయం సాధిస్తున్నది. ఆయుష్మాన్‌భవ, పోషణ అభ్యాన్, ఆవాస్ యోజన మొదలైన పథకాలతో లక్షలాదిమంది లబ్దిపొందుతున్నారు. అయితే- తన ఆర్థిక విజయాలను చెప్పుకోవలసినంతగా చెప్పవలసిన రీతిలో చెప్పకపోవటమే మోదీ సర్కారు వైఫల్యం.

-డా బి.సారంగపాణి