సబ్ ఫీచర్

గణతంత్ర వేడుకలకు సర్వభాషా కవి సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘భిన్నత్వంలో ఏకత్వం, వైవిధ్యంలో సౌందర్యం’ అని మనం తరచూ చెప్పుకునే భావనకు చక్కని ప్రతీక- ప్రతి సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవానికి ‘ఆకాశవాణి’ ప్రసారం చేసే సర్వభాషా కవిసమ్మేళనం. దేశంలోని 22 భాషలలోని కవిత్వం ఏకకాలంలో ఆ 22 భాషల్లో అనువదింపబడి జన సామాన్యానికి అందించడం ఇందులోని విశేషం. దేశవ్యాప్తంగా సంవత్సరం పాటు జరిగే ప్రక్రియకు తుదిదశగా ఏటా జనవరి 25న రాత్రి 10 గంటలకు అన్ని ‘ఆకాశవాణి’ కేంద్రాలన్నీ ప్రసారం చేయడం ఆనవాయితీ. ఇది ‘ఆకాశవాణి’ కవితోత్సవం. ఇది మంచి కవిత్వాన్ని మరింత మందికి విస్తృతంగా ఇవ్వడం మాత్రమే!
వస్తుపరంగా, ప్రక్రియాపరంగా ‘ఆకాశవాణి’లో వైవిధ్యం పుష్కలంగా ఉంది. రైతులకు, మహిళలకు, పిల్లలకు కార్మికులకు, వృద్ధులకు, యువతకు- అనే వర్గీకరణ., వార్తలు, ప్రసంగాలు, పరిచయాలు, చర్చలు, నాటకాలు, రూపకాలు, నివేదికలు, కచేరీలు- అనే మరో వర్గీకరణ; వ్యవసాయం, ఆరోగ్యం, అభివృద్ధి, సైన్స్, సాహిత్యం, హాస్యం అనే ఇంకో వర్గీకరణను గమనించవచ్చు. ఆకాశవాణి సంగీత సమ్మేళనం, నాటక సప్తాహం వంటి సందర్భాలు ఆయా విభాగాలకు ఉత్సవాలు. కవిత్వానికి సంబంధించి ఆకాశవాణి సర్వభాషా కవి సమ్మేళనం వైవిధ్య భరితం.
ప్రతి భాషలో, ప్రతి ఆకాశవాణి కేంద్రంలో నిత్యం ప్రసారమయ్యే కవితల నుంచి మూడు నెలలకోసారి రెండు ఉత్తమ కవితలు ఆయా కేంద్రాలు ఎంపిక చేస్తాయి. మూడున్నర నిమిషాల వ్యవధి, ఉపయోగపడే కవితా వస్తువు, మంచి కవితా శిల్పం ఉన్న ఏ కవిత అయినా పరిగణనలోకి వస్తుంది. ప్రతి భాషలో ప్రతి మూడు నెలలకు ఒకసారి వాటినుంచి రెండు కవితలు ఎంపిక అవుతాయి. అంటే సంవత్సరానికి ఎనిమిది. ఈ ఎనిమిదింటినీ ఇంగ్లీషులోకి అనువదించి ఢిల్లీకి పంపుతారు. అక్కడ ఆ ఎనిమిదింటి నుంచి ఒక ఉత్తమ కవిత ఆ సంవత్సరానికి, ఆ భాషకు ప్రతీకగా ఎంపిక అవుతుంది. ఇలా 22 భాషలకూ ఈ తతంగం ఉంటుంది. ఎం పికైన తర్వాత హిందీ భాషకు ఇద్దరు, మిగతా భాషలకు ఒకటి చొప్పున మొత్తం 23 మంది కవులను ఆహ్వానిస్తారు. గతంలో ఇది ఢిల్లీలో జరిగేది. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఒక్కో సంవత్సరం ఒక్కో రాష్ట్ర రాజధానిలో నిర్వహిస్తున్నారు. 2014లో హైదరాబాదులో నిర్వహించగా, ఇటీవల చెన్నైలో నిర్వహించారు. సంస్కృతితో మొదలై, ఆంగ్లభాష అక్షర క్రమంలో 22 భాషల కవితల ప్రసారం ఉంటుంది.
రాష్ట్ర రాజధానిలో ఈ 23 కవితలను స్థానిక భాషలో ప్రముఖ అనువాద కవులతో తర్జుమా చేయిస్తారు. హిందీ, ఇంగ్లీషు భాషల అనువాదాల ఆధారంగా ఈ కవులు ఆంధ్రీకరణం చేస్తారు. మూల భాషలో కూడా కవితా పఠనం విని సాధ్యమైనంత స్థాయిలో ప్రజెంటేషన్ కూడా అదే పద్ధతిలో అనువాదం, పఠనా విధానం సాగాలి. ఆయా కేంద్రాలు ప్రసారంలో సంస్కృతంతో ప్రారంభించి, స్థానిక భాషతో ముగించాలి. ప్రసార సమయంలో మూల భాషలో కవితని కొద్దిగా వినిపించి పిమ్మట అనువాదం కొనసాగిస్తారు. ఆ మూల భాషను ఇతర భాషల వారికి పరిచయం చేయాలన్నది మరో లక్ష్యం.
ఈ ప్రయోగం, ప్రయత్నం విలక్షణమైనవి. ఇది 1956లో మొదలైంది. గత 64 సంవత్సరాలుగా జరుగుతోంది. ఏక కాలంలో 22 భాషల కవిత్వం తీరూతెన్నూ ఇక్కడ పరిశీలించి అధ్యయనం చేయవచ్చు. స్థానిక భాషలలో అనువాదం పద్ధతి, వ్యవహారం తెలుసుకోవచ్చు. కొన్ని సంవత్సరాల కవితలూ, వాటి అనువాదాలు గమనిస్తే వాటి పరిణామ విధానం సైతం బోధపడుతుంది. తెలుగు ఆకాశవాణి కేంద్రాలు జనవరి 25న రాత్రి 10 గంటలకు రెండు గంటలపాటు ఈ సర్వభాషా కవిసమ్మేళనాన్ని ప్రసారం చేస్తాయి. మరుసటిరోజు (జనవరి 26)న ఉదయం 7.15 గంటలకు పునఃప్రసారం కూడా ఉంటుంది. మీరు కవితా ఉత్సవాన్ని ఆనందించడమే తరువాయి!

-డా. నాగసూరి వేణుగోపాల్ 94407 32392