సబ్ ఫీచర్

అగ్రవర్ణ పేదలపై కపట ప్రేమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంలో బీజేపీ నాలుగేళ్ల ఎనిమిది నెలల అస మర్థ పాలనతో దేశం అన్ని రంగాలలో దివాలా తీసింది. అప్పుల పాలైంది. తాజా గణాంకాల ప్రకారం మోదీ పాలన కాలంలో అప్పులు 50 శాతం పెరిగిపోయాయి. పెద్ద నోట్ల రద్దు, అడ్డగోలుగా జిఎస్‌టి అమలు, యథేచ్ఛగా ప్రైవేటీకరణ, కార్మికులు-కర్షకులను కాదని కార్పొరేట్లకు మేలు చేసే నిర్ణయాలు, బ్యాంకుల దివాలా, ఆర్థిక నేరగాళ్లకు అండగా నిలవడం, దళితులు, మైనారిటీలపై , సాహితీ మేధావులపై, విద్యార్థి నాయకులపై దాడులు, రాజకీయ వేధింపుల కోసం చట్టబద్ధ సంస్థల దుర్వినియోగం వంటివి చూస్తున్నాం. నిరంకుశ, ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులపాలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వరూపాన్ని మనం చూస్తున్నాం. ఇటీవల వెలుగు చూసిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంతో- ఓ కార్పొరేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు దేశ రక్షణను సైతం పణంగా పెట్టారన్న విషయం బట్టబయలైంది. రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలు విషయంలో అనిల్ అంబానీకి చెందిన సంస్థకు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టిన వైనానికి సంబంధించి తిరుగులేని సాక్ష్యాలు బయట రావడంతో మోదీ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తుంటే సమా ధానం చెప్పుకోలేక ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు నీళ్లు నములుతున్నారు.
దేశ వ్యాప్తంగా బీజేపీకి, ప్రధాని మోదీకి ఎదురు గాలి వీస్తోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మూడు చోట్ల బీజేపీ అధికారం కోల్పోవడమే ఇందుకు తార్కాణం. మరో మూడు నెలల్లో జరిగే సార్వ త్రిక ఎన్నికలలో ఓటమి ఖాయమని గ్రహించిన మోదీ రాజకీయంగా లబ్ధి పొందేందుకే చివరి అస్త్రంగా అగ్ర వర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి నాటకాలు ఆడుతున్నారు. దేశంలో అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నారు. తన గెలుపు కోసం కుల ప్రాతిపదికన దేశ ప్రజలను విడగొట్టాలని చూస్తున్నారు.
మోదీకి నిజంగా అగ్రవర్ణ పేదలపై ప్రేమ ఉంటే నాలుగున్నరేళ్లు ఏం చేశారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను అందిస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన ఆయన నిరుద్యోగ యువతకు కనీసం లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు. కొత్త ఉద్యోగాల భర్తీ పక్కనబెట్టినా, పదవీ విరమణలతో ఖాళీ అయన ఉద్యోగాలను కూడా భర్తీ చేయని దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలలో లక్షలాది ఉద్యోగ ఖాళీలకు నియామకాల జరపకుండా చోద్యం చూస్తున్న ఈ ప్రభుత్వం కొత్తగా రిజర్వేషన్లు తీసుకొచ్చి ఒర గబెట్టేదేమీ లేదు.
ఇప్పటికే సామాజిక భద్రత లేకుండా జీవిస్తున్న అనేక అణగారిన కులాలకు సైతం రిజర్వేషన్లు వర్తింప చేయా లని, అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మోదీకి చిత్త శుద్ధి ఉంటే ఖాళీలను భర్తీ చేయడంతోపాటు బలహీన వర్గాలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి. అంతే కాని ఎటువంటి ప్రాతిపదిక లేకుండా అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం వెనుక అసలు లక్ష్యం ఇప్పటికే అమలవుతున్న రిజర్వేషన్లకు గండి కొట్టడమేనన్న అనుమానం వస్తున్నది. అందుకే సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో రిజర్వేషన్ల చిచ్చును రగిలించారు. ఏ ప్రాతిపదికపై అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇస్తా మంటున్నారో తెలియదు. అగ్రకులాల్లో ఆర్థికంగా వెను కబడిన వాళ్లకు రిజర్వేషన్లనే పేరుతో ప్రభుత్వం ఇనే్నళ్ల రిజర్వేషన్ల విధానంలోకి కొత్త ఒరవడిని తీసుకొని వచ్చింది. రిజర్వేషన్లకు ఆర్థిక వెనుకబాటుతనం, పేదరికం ప్రాతిపదిక కాదు. అంటరానితనం, సామాజిక వివక్ష మాత్రమే రిజర్వేషన్ల కల్పనకు పునాది అనేది మన రాజ్యాంగ నిర్మాతల మనోగతమని మనం గుర్తెరగాలి.
ప్రస్తుతం దేశంలో వెనుకబడిన తరగతులు (బీసీ) లకు 27 శాతం, షెడ్యూల్డు కులాలు, తరగతులకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఓబీసీలు తదితరులకు కలిపి మొత్తంగా 49.5 శాతం వరకు రిజర్వేషన్లు అమ లులో ఉన్నాయి. ఇప్పుడు అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే అది 59 శాతానికి పెరుగుతుంది. ఇది సాకారం కావడం ముమ్మాటికీ అసాధ్యం. రాజ్యాంగం ప్రకారం వార్షిక ఆదాయం లక్ష రూపాయల కన్నా తక్కువ ఉన్న పౌరులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి సామాజిక వర్గాలకు చెందనివారు ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా పరిగణింపబడతారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల గురించి రాజ్యం గంలో ఎటువంటి నిర్వచనం లేదు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఈ పది శాతం రిజర్వేషన్లు అమలు చేయొచ్చని ప్రభుత్వం చెబుతున్నది. అయితే దీనికి విధించిన అర్హతలు చూస్తే నవ్వొస్తున్నది. వృత్తిపరంగా, వ్యవసాయపరంగా కుటుం బ వార్షికాదాయం ఎనిమిది లక్షలకన్నా తక్కువగలవారు, అయిదెకరాల వ్యవసాయ భూమి, వెయ్యి చదరపు అడుగులకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇళ్లు కలవారు, నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో వంద గజాలు, నాన్‌నోటిఫైడ్ ప్రాంతాల్లో రెండొందల గజాలకన్నా తక్కువ స్థలంలో ఇళ్లు ఉన్నవారు తాజా రిజర్వేషన్ పొందడానికి అర్హులని కేంద్ర ప్రభుత్వం తీర్మానించింది. ఇవి న్యాయ పరీక్షకు నిలబడజాలవు. ఇతర వెనకబడిన కులాల్లో (ఓబీసీ) సంపన్న శ్రేణిని గుర్తించడానికి 1993లో లక్ష రూపా యలుగా ఉన్న వార్షికాదాయ పరిమితి 2013 నాటికి ఆరు లక్షలుగా, 2017లో ఎనిమిది లక్షలుగా కేంద్రం నిర్ధారించింది. అగ్రవర్ణాల్లోని ఆర్థిక వెనకబాటు తనానికి బహుశా అదే ప్రాతిపదికగా కేంద్రం పరిగణించి ఉండాలి. ఏటా ఎనిమిది లక్షలు ఆర్జించేవారు ఆదాయపు పన్ను శ్లాబులో 20 శాతం వంతున చెల్లిస్తున్నప్పుడు ఆ శ్రేణిని ఆర్థికంగా వెనకబడినట్లు ఎలా ప్రకటిస్తారన్న ప్రశ్నకు, రాజ్యాంగ సవరణ చేశాం గనక ఎటువంటి న్యాయ సమస్యలు ఉత్పన్న కావని చెబుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వద్ద సమాధానం లేదు.
మరో అంశం కొత్త రిజర్వేషన్ల అర్హతా ప్రమాణాల పరిధిలోనే ఎకాఎకి 95 శాతం మంది అగ్రవవర్ణాల వారు వస్తారంటున్నప్పుడు, ఏడాదికి లక్ష రూపాయల రాబడి కూడా లేని రైతులు, దిగువ మధ్యతరగతి వర్గాల పిల్లలు ఏ ప్రయోజనాలు పొందగలరో ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. ఓబీసీల సంపన్న శ్రేణి నిర్ధారణకు కుటుం బ సభ్యులందరి జీతాలను కూడి గణించడం, వ్యవసాయ ఆదాయాన్ని కుటుంబ ఆదాయంగా పరిగణించడం కూడదని మద్రాస్, డిల్లీ హైకోర్టులు గతంలోనే తీర్పు లిచ్చాయి. ఇప్పుడా నిబంధనల్ని అగ్రవర్ణాల్లోని ఆర్థిక వెనకబాటుతనానికి వర్తింపజేయడం అసంబద్ధంగా ఉంది. వీటికితోడు రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ యాభై శాతానికి మించరాదన్న ‘సుప్రీం’ తీర్పును కాదనడం, కొత్త కోటాకు ఆర్థిక స్థితినే ప్రాతిపదికనే తీసుకోవడం విడ్డూరంగా ఉంది. రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్లకు ఎలాంటి అడ్డంకీ ఉండబోదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇది పరమ లోపభూయిష్టమనేది స్పష్టంగా తెలుస్తున్నది. ఇక ఈ రిజర్వేషన్ల అమలు విషయాన్ని రాష్ట్రాల ఇష్టాయి ష్టాలకు వదిలేయడం- ఓ కొత్త మెలిక.
1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు మార్పులతో ఓబీసీ కోటాను ఆమోదిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటి ప్రభుత్వం రిజర్వేషన్ కిందకు రాని ఇతర కులాల్లో ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్నవాళ్లకు 10 శా తం రిజర్వేషన్లను ప్రస్తావించగా, 1992 లో తొమ్మిదిమంది సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం దానిని కొట్టి వేసింది. పౌరుల్లో వెనకబడిన వర్గాలను గుర్తించడానికి ఆర్థిక స్థితి ఒక్కటే ఏకైక ప్రాతిపదిక కాజాలదని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. 2015లో జాట్ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కూడా రిజర్వేషన్లు కల్పించే అధికారం కేంద్రానికి ఉన్నా పాత లెక్కల ఆధారంగా కోటాలు కట్టబెట్టే వీల్లేదని సుప్రీం కోర్టు కుండబద్దలు కొట్టింది. కోర్టుల తీర్పులను పరి గణనలోకి తీసుకోకుండా, ఎటువంటి అధ్యయనాలు నిర్వహించకుండా, పార్లమెంటులో చర్చించకుండా, సెల క్షన్ కమిటీకి పంపకుండా మరో మూడునెలల్లో పదవీ కాలం ముగుస్తుందనగా- పార్లమెంటులో మెజారిటీ ఉందన్న అహంకారంతో ఇటువంటి నిర్ణయం తీసు కోవడం- కచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమే తప్ప మరో మంచి ఉద్దేశం మోదీ సర్కారుకు లేదు. పైగా దేశంలో కులాల కుంపటి రగల్చడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. కేవలం ఎన్నికలను ఎదుర్కోవడం కోసం దేశా న్ని కులాలు, మతాల ప్రాతిపదికన చీల్చడానికి యత్నిస్తున్న భాజపా సర్కారు ఎత్తుగడలను ప్రజలంతా తీవ్రంగా నిరసించాలి. ఇలాంటి రాజకీయ జిమ్మిక్కులకు జనం మోసపోరు.

-కొలనుకొండ శివాజీ