సబ్ ఫీచర్

‘అవినీతి నేతల కూటమి’ని జనం నమ్మేదెట్టా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా ‘మహాగటబంధన్’పై చర్చ జోరుగా జరుగుతున్నది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షనేతలంతా ఏకమవుతామని అంటున్నారు. కర్నాటకలో దొడ్డిదారిన సంకీర్ణ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజున చాలామంది విపక్ష నేతలు కలసి పోజులిచ్చారు. ఆ తరువాత ఎవరి దారి వారిదే. తాజాగా ఈ కూటమిలో ఎవరికివారు ప్రధాని కావాలనుకుంటున్నారు. మాయావతి, అఖిలేశ్ జట్టు కట్టారు. మాయావతికి ప్రధాని కావాలనుంది. ప్రధాని పదవిపై ఆశ పడుతున్న మమతా బెనర్జీకి ఇది నచ్చడం లేదు. స్టాలిన్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబుకు అది ఇష్టం లేదు. మమత ప్రధాని కావడం ఇష్టం లేని రాహుల్, సోనియా, మాయావతి కోల్‌కత ర్యాలీకి డుమ్మాకొట్టారు. చంద్రబాబు, రాహుల్ చేతులు కలిపినా ఏపీలో కలసి పోటీ చేయరట. భాజపాలో వుంటూ యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, శతృఘ్న సిన్హా మమత ర్యాలీకి హాజరయ్యారు. వీళ్లకి ఏదో పదవిని మోదీ ఇచ్చి ఉంటే గమ్మున పడుండేవారు. భాజపాతో విభేదిస్తున్నా శివసేన నేతలు మమత ర్యాలీకి వెళ్ళలేదు. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు లేదంటునే ‘ఆప్’ అధినేత కేజ్రీవాల్ మమత ర్యాలీకి వెళ్ళారు. బీజేడీ, వైకాపా, తెరాస మాత్రం కోల్‌కత ర్యాలీకి దూరంగా ఉన్నాయి. కమ్యూనిస్టులు ఎలాగూ మమత ర్యాలీకి వెళ్ళరు.
‘మహాగటబంధన్’ అనే కంటే, కుంభకోణాలు చేసిన నేతలంతా (ఘోటాలా అంటే కుంభకోణం) ఒక వేదికపైకి రావాలని చూస్తున్నారు. వీరు దేశం కోసం వీరు కలిస్తే బాగుండేది. కానీ, మోదీకి వ్యతిరేకంగా కలిశారు. వీరి ఆలోచనల్లోనే ‘నకారాత్మక ధోరణి’ వుంది. పది తలల రావణాసురుడికి, వీరికి తేడా లేదు. రావణాసురుడికి కనీసం బ్రహ్మజ్ఞానం, రాజకీయ పరిజ్ఞానం వున్నాయి. విభజన రాజకీయం చేసే జిగ్నేష్ మేవాని, హార్థిక్‌పటేల్‌లు ఈ వేదికపై ఉన్నారు.
అవినీతిని అంతం చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్, అవినీతి పరుడైన లాలూ కుమారుడు, శారద- నారద కుంభకోణాల ఆరోపణలున్న మమతా బెనర్జీ, లక్షల కోట్ల కుంభకోణాలకు కారకులైన యూపీఎ నాయకుల మధ్య సీట్ల సర్దుబాటు హాస్యాస్పదం. కోల్‌కత ర్యాలీలో మోదీ, భాజపాలను తిట్టడం తప్ప, ఏ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే- దేశానికి మేలు చేసే ఫలానా చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పలేదు. ఇందుకు భిన్నంగా ఇటీవల జరిగిన భాజపా కార్యవర్గ సమావేశంలో దేశాభివృద్ధి గురించి అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కులాలకు అతీతంగా పేదలందరికీ 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోదీ ప్రభుత్వం బిల్లును ఆమోదింపజేసింది.
ప్రాంతీయ పార్టీల అవసరాన్ని ఎవరూ కాదనలేరు. ఆయా ప్రాంతాల అవసరాలు, ఆకాంక్షలు నెరవేర్చకుండా వుండడం కేంద్రంలో వున్న ఎవరికీ సాధ్యం కాదు. నిజానికి సంకీర్ణ యుగాన్ని, ప్రాంతీయ పార్టీలను తక్కువచేసి మాట్లాడింది కాంగ్రెస్ పార్టీనే. మాజీ ప్రధాని వాజపేయి గతంలో ఓసారి లోక్‌సభలో కాంగ్రెస్ మానిఫెస్టోలోని విషయాలను ప్రస్తావిస్తూ ‘ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలను నిర్దేశించలేవు. ఆ పార్టీలకు జాతీయ స్థాయిలో ఆలోచించే వివేకం వుండదు’ అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను విమర్శించారు. ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి కారణం బలహీనపడిన కాంగ్రెస్ పార్టీయే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, బెంగాల్ వంటివి యిందుకు ఉదాహరణలు. 1996-1998లో బిజెపి వ్యతిరేకతను ప్రదర్శించినా తక్కిన పార్టీలకు బలమైన ఆధారంగా, ఆసరాగా కాంగ్రెస్ పార్టీ వర్తించక ప్రధానమంత్రుల్ని కూడా తెలుగు రంగస్థల నాటకాల్లో 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు లాగా మార్చేసింది. 30 ఏళ్ల తరువాత ఏర్పడిన మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం జాతీయ స్థాయిల్లో అన్ని పార్టీలకు సవాలయింది. అయినా మోడీ ‘బహుమత్’కంటె ‘సహమత్’కే విలువనిస్తామన్నారు. 8 నెలల క్రితం ఏర్పడిన కర్ణాటకలోని జెడిఎస్- కాంగ్రెస్ కూటమిలో అపుడే లుకలుకలు బయటపడ్డాయి. స్వయంగా ముఖ్యమంత్రి తాను ఒక క్లర్క్‌లా పనిచేస్తున్నానని వాపోయాడు. గత నాలుగున్నరేళ్ళలో ఎన్‌డిఎను కొన్ని ప్రాంతీయ పార్టీలు వదలివెళ్ళాయి కాని, ఎవరిని ఎన్‌డిఎ వదిలించుకొనేందుకు ప్రయత్నించలేదు. 1998-2004 మధ్య వాజపేయి సారధ్యంలోని ఎన్‌డిఎ స్థిరమైన, బలమైన, ప్రగతిశీలమైన పరిపాలన అందించిందనేది చరిత్ర చెప్పే సత్యం. మమత నిర్వహించిన ర్యాలీలో తలా వొక మాట మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. బిజెపి రథయాత్ర చేస్తామంటే అడ్డకుంటున్నది బెంగాల్ మమత ప్రభుత్వమే. పంచాయతీ ఎన్నికల్లో మరో పార్టీ నామినేషన్ కూడా వేసే అవకాశం లేకుండా మమత పార్టీవారు బెదిరింపులకు దిగారు. ఓ సామాన్య బిజెపి కార్యకర్తకు ఉరిశిక్ష వేశారు.
కోల్‌కత ర్యాలీలో హార్థిక్ పటేల్ సుభాష్ చంద్రబోస్‌ను గుర్తుచేశాడు. మంచిదే. కాని సుభాష్ ‘జైహింద్’ నినాదమిచ్చాడు. హార్థిక్ పటేల్ ‘పటాల్’ వివాదంతో సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నించి గుజరాత్‌లో బోల్తాపడ్డాడు. రాజ్యాంగం గురించి జిగ్నేష్ మేమాని సూక్తులు చెప్పాడు. భీమా గోరేగావ్ వివాదంలో అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి హింసను ప్రజ్వరిల్పచేసిన జిగ్నేష్, మావోయిస్టులను రక్షించాలని పాట పాడుతూ రాజ్యాంగ రక్షణ గురించి చిలక పలుకులు వినిపించాడు. మమతా బెనర్జీ ఎక్కువసేపు బెంగాలీ భాషలో మాట్లాడుతూ, వేదికపై వున్న వాళ్ళందరూ నాయకులే అంది. అందరూ అందరికీ నాయకులైతే అసలు దేశాన్ని ఏలేదెవరో తెలీదు. 23 పార్టీల సాక్షిగా ఆమె రెండు పచ్చి అబద్ధాలు చెప్పింది. వొకటి పశ్చిమ బెంగాల్‌లో నిరుద్యోగాన్ని తాను 40% తగ్గించానంది. బెంగాల్‌లో 2017లో 6000 ప్రభుత్వోద్యోగాలకు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నది కఠోర సత్యం. మొత్తం దేశంలో నిరుద్యోగుల శాతం జనవరి 2019లో 7 శాతం వుంటే బెంగాల్‌లో 6.8 శాతం వుంది. 40% నిరుద్యోగుల సంఖ్య ఎలా తగ్గినట్లు?
ఇక, మరాఠా యోధుడు శరద్‌పవర్‌పై భూ ఆక్రమణల ఆరోపణలున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ మాజీ ఐపిఎస్ అధికారి వైపిసింగ్ చేసిన ఆరోపణల్ని సమర్ధించారు. యుపి మాజీ ముఖ్యమంత్రి మాయావతి దగ్గరివాళ్ళపై తాజ్ కారిడార్‌కు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్ దాఖలైంది. రూ. 175 కోట్ల కుంభకోణం తాజ్‌మహల్ పరిసర ప్రాంతాలలో యాత్రికుల సౌకర్యాల అభివృద్ధికై రచించిన ప్రాజెక్టులో జరిగింది. 2003లో సుప్రీం కోర్టు ఆదేశం మేరకు మాయావతిపై ఎఫ్.ఐ.ఆర్. దాఖలైంది.
అఖిలేశ్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రిగా వున్న కాలంలో రూ.99,906 కోట్ల పనులకు సంబంధించి యుటిలైషన్ సర్ట్ఫికెట్లు దాఖలు చేయలేదని సిఎజి నివేదిక తెలియజేస్తోంది. పంజాయతీ రాజ్, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖల్లో ఈ ఖర్చు జరిగింది. ఐఆర్‌సిటిసి హోటల్ కుంభకోణంలో లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ పై ఆరోపణల ఫలితంగా నితీష్‌కుమార్ ఆర్‌జెడితో తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చింది. కోల్‌కత సభలో శరద్‌యాదవ్ కాంగ్రెస్ పార్టీ బోఫోర్స్ కుంభకోణాన్ని పదే పదే ప్రస్తావించాడు. టిఎమ్‌సి నేత డేచ్‌రెన్ వెళ్ళి శరద్‌యాదవ్‌కు బోఫోర్స్ బదులు ‘రఫాలె’ అని గుర్తు చేయాల్సి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాష్ట్రంలో సిబిఐను అనుమతించమన్నారు. ఇది ఆయన బద్ధశత్రువు జగన్ కేసుల దర్యాప్తును కూడా ప్రభావితం చేసే అంశమైంది. ఏ తప్పూ జరగనపుడు, ఏ అవినీతి జరగనపుడు బాబు ఎందుకు భయపడ్తున్నారని, వ్యవస్థను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మోదీ ప్రశ్నిస్తున్నారు. మోదీ గుజరాత్ సీఎంగా వున్నప్పుడు యుపిఎ అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను ఆయన ప్రభుత్వంపై దాడికి ఉసిగొల్పింది. ఆయన దేనికీ భయపడలేదు. ఏ దర్యాప్తును వ్యతిరేకించలేదు. పైగా 2002 నాటి అల్లర్లపై సుప్రీం కోర్టు నియమించిన ‘సిట్’ ఎదుట ఆయన 9 గంటలపాటు ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కొన్నారు. నిర్దోషిగా బయటపడ్డారు.
1947-2006వరకు దేశంలో బ్యాంకులు 8 లక్షల కోట్ల అప్పులిస్తే, 2006-2014వరకు బ్యాంకులు 34 లక్షల కోట్ల అప్పులిచ్చాయి. ఇందులో అధిక భాగం మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీ లాంటి వాళ్ళకు చేరాయి. బ్యాంకులకు అప్పులెగ్గొట్టిన వారికి దేశం వదిలివెళ్ళేందుకు అన్నీ సిద్ధంగా వుండే పరిస్థితి నుంచి, అలాంటి వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం, వారిని దేశానికి రప్పించి దోషులుగా శిక్షలు విధించేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మైకేల్ క్రిస్టియన్‌ను అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంపై విచారించేందుకు ఈ దేశానికి రప్పించడం అతి పెద్ద దౌత్య విజయం.
రాజకీయాలు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పరిభ్రమించడం ఈ కాలపు ఆశ్చర్యం. కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యుపిఎ సర్కారు రఫాలె వొప్పందంలో కమీషన్లకు కోసం చూసింది. అందుకే కాలయాపన చేసింది. 10 ఏళ్ళ తరువాత ఖజానా ఖాళీగా వుందని తప్పించుకుంది. మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ రఫాలే యుద్ధ విమానాల అవసరాన్ని వొక ‘మిషన్’గా స్వీకరించి అమలుచేస్తోంది. టైమ్స్ గ్రూప్ చేసిన సర్వేలో 79% మంది 2019లో మళ్ళీ మోదీనే ఎన్నుకుంటామన్నారు. తాజా ఇండియాటుడే, కార్వీ సర్వేలో ఎన్‌డిఎ కూటమికి 60% మంది ఓటు వేస్తామన్నారు. ఏదో ఒక ప్రభుత్వం ఏర్పడాలని ‘మహాగటబంధన్’ ప్రయత్నిస్తుంటే, బలమైన ప్రభుత్వం కోసం ఎన్‌డిఎ పనిచేస్తున్నది. సుస్థిర ప్రభుత్వం ఏర్పడడమే దేశానికి క్షేమకరం.

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్