సబ్ ఫీచర్

ప్రియాంక రాకతో మహర్దశ ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె రాజకీయ ప్రవేశానికి ప్రసార మాధ్యమాలు అవసరం లేనంతగా ప్రచారాన్ని కల్పిస్తున్నాయి. కొందరైతే ప్రియాంకను మరో ఇందిరా గాంధీ అని అభివర్ణిస్తున్నారు. నిజంగా అటువంటి పరిస్థితి ఉన్నదా? ఆమె రాక.. పడిపోతున్న కాంగ్రెస్ ‘గ్రాఫ్’ను నిలబెట్టగలదా? అనే అంశాలు పరిశీలించే ముందు ఇందిరాగాంధీ రాజకీయ ప్రవేశం చేసే నాటికి దేశంలోని రాజకీయ పరిస్థితులను ఒకసారి నెమరువేసుకుంటే చాలా విషయాలు మనకు అవగతమవుతాయి.
జవహర్‌లాల్ నెహ్రూ ఇందిరను తన తర్వాత ప్రధానమంత్రిగా రావాలని కోరుకున్నారా? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం మనకు లభించకపోవచ్చు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇందిర రాజకీయాలలో కొంత గణనీయమైన పాత్రను పోషించారు. ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు, అతిథులకు దేశంలో ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఆమె ఎప్పుడూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నారు. తండ్రి హయాంలోనే ఆమె రాజకీయమైన పరిజ్ఞానాన్ని సంపాదించారు. 1959లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉంటూ ఆమె ప్రజాస్వామికంగా ఎన్నికైన కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఒకవేళ నెహ్రూ ఇందిరను ప్రధానమంత్రిగా చేయదలుచుకుంటే ఆమె పేరును ఆయన ప్రతిపాదించి ఉండొచ్చు. ఆనాడు ఆయనకున్న ప్రజాదరణకు (చైనా యుద్ధం తర్వాత కొంత తగ్గినా) ఎవరు దానిని కాదని ఉండేవాళ్ళు కాదు. ఆయన అలాచేయలేదు కనుక లాల్‌బహదూర్ శాస్ర్తీకి అవకాశం లభించింది. తాష్కెంట్ నగరంలో శాస్ర్తీ అకాల మరణాన్ని పొందకుండా ఉండుంటే ఈ కుటుంబ పాలన ఆనాడే అంతమయి ఉండేది. ఆయన అకాల మరణం ఆనాటి కాంగ్రెస్‌లోని బలమైన సిండికేట్ సభ్యులు కామరాజ్ నాడార్ నేతృత్వంలో ఇందిరాగాంధీ తమ కనుసన్నల్లో పనిచేస్తారనే భావనలో ఉండటంవలన మొరార్జీ దేశాయ్‌ని కాదని ఆమెకు భారత ప్రధాని అయ్యే అవకాశం కల్పించారు. ఆ కాంగ్రెస్ సిండికేట్‌ను ఆమె ఏ విధంగా నిర్వీర్యం చేసింది, ప్రజాదరణ పొందిన నాయకురాలిగా ఎలా నిలదొక్కుకున్నది అనేది చరిత్రలో మిగిలిపోయిన అంశాలు.
1971 ఎన్నికల్లో విజయం తరువాత వెనువెంటనే బంగ్లాదేశ్ యుద్ధంలో గెలుపు ఆమెను తిరుగులేని నాయకురాలిగా నిలబెట్టాయి. కానీ ఒక దశాబ్దన్నర కాలం ఆమె రాజకీయ ప్రస్థానానికి దోహదం చేసింది ఆమె ఏర్పర్చుకున్న ఓటు బ్యాంకుల సమాఖ్య. దళితులు, ముస్లింలు, ఉన్నత తరగతులతో కూడిన ఒక కూటమిని ఏర్పరచుకొని పాలన సాగించారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఓటు బ్యాంకు ఒక్కటి కూడా లేదు. సమర్థవంతమైన నాయకత్వం ఈనాడు దళితుల్లో ఏర్పడింది. పట్టణ ప్రాంత ఉన్నత తరగతులు కాంగ్రెస్‌కు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ముస్లింలను కూడా ఈరోజు ఏ ఒక్క పార్టీకి అంకితమైన ఓటు బ్యాంకుగా చూడలేము. వివిధ ప్రాంతాలలో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కొన్ని సామాజిక వర్గాల నేతల నేతృత్వంలో కొన్ని పార్టీలు బలపడ్డాయి. కాంగ్రెస్ చాలావరకు నిర్వీర్యమైంది. సిద్ధాంతపరమైన మూలాలు లేకుండాపోయాయి. అధికారంలో లేకపోతే ఆ పార్టీలో ఉండేవారే కరువైపోతున్నారు. ఈమధ్య ఉత్తర భారతంలో కొన్ని రాష్ట్రాలలో వారి విజయం కేవలం తాత్కాలిక బుడగలాగానే కల్పిస్తున్నది. అటువంటి పరిస్థితులలో ఉన్న పార్టీకి కేవలం ముఖ కవళికల వరకు ఇందిరాగాంధీతో సారూప్యం ఉన్న ప్రియాంక వెన్నుదన్నుగా నిలుస్తుందనుకోవడం భ్రమ మాత్రమే. ఇందిర వలే ప్రియాంక తండ్రి కింద గాని తల్లి కింద గానీ రాజకీయ పాఠాలు నేర్చుకోలేదు. సమస్యలపై, విధానాలపై విషయ పరిజ్ఞానం గురించి ఏమీ తెలియకుండా ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీకి ఏదో బలం వస్తుంది అన్నట్టుగా భ్రమపడేవారు కేవలం గాలిమేడలలో విహరిస్తున్నారు.
పరిణతి చెందిన ప్రజాస్వామ్యాలలో కుటుంబ వారసత్వ రాజకీయాలకు తావులేదు. దేశంలో కుటుంబ రాజకీయాలకు జాతీయస్థాయిలో స్వస్తిపలకటానికి రెండుదఫాలుగా అవకాశం లభించింది. లాల్‌బహదూర్ శాస్ర్తీ అకాల మరణం చెందకుండా ఉండుంటే ఆనాడే కుటుంబ రాజకీయాలు అంతమై ఉండేవి. అలాగే, పీవీ నరసింహారావుకు రెండవసారి ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం లభించిన జాతీయస్థాయిలో కుటుంబ రాజకీయాలు ఆరోజే అంతమైపోయి ఉండేవి. ఆనాడు చంద్రబాబు నాయుడు, కరుణానిధి రాజకీయం వల్ల పీవీకి అవకాశం దక్కలేదు. కుటుంబ పాలన తిరిగి దేశంలో నిలదొక్కుకున్నది. ప్రత్యర్థుల బలహీనతే కుటుంబ వారసత్వ రాజకీయాలు కొనసాగటానికి దోహదం చేస్తాయి. ఈనాడు కుటుంబ వారసత్వ రాజకీయాలకు జాతీయ స్థాయిలో శాశ్వతంగా స్థానం లేకుండా చేసే అవకాశం ఉన్నది. బీజేపీకి, మోదీకి మరొకసారి విజయం లభిస్తే జాతీయ స్థాయిలో కుటుంబ రాజకీయాలు మరుగున పడతాయి.

-ఐవైఆర్ కృష్ణారావు