సబ్ ఫీచర్

అతి గారాబంతో అనర్థం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నపిల్లలంటే అందరికీ ఇష్టమే. అందరూ ఆప్యాయతలతో ప్రేమిస్తారన్నది విశ్వసత్యం. కానీ మారుతున్న కాలానుగుణంగా వారిని అతిగారాబం చేస్తూ వారి చెడుకు తల్లిదండ్రులే కారణమవుతున్నారా? అనే ఆలోచన ఉత్పన్నం కాకమానదు. మరీ ముఖ్యంగా చిన్నవయసునుండే వారికి కావాల్సినవి అడిగిన వెంటనే మంచో, చెడో అనే ఆలోచన లేకుండా ఇప్పిస్తారు. అలా అలవాటుపడిన పిల్లలు, ఇప్పించకపోతే మారాం చేసి సాధించుకోవడానికి కారకులు తల్లిదండ్రులే. నేటి ప్రస్తుత తరుణంలో స్మార్ట్ఫోన్‌లు, అంతర్జాల వినియోగం ఎక్కువైన తర్వాత పిల్లలు భోజనం చేయలన్నా, చెప్పింది వినాలన్నా, నిశ్శబ్దంగా కూర్చోవాలన్నా ఫోన్ ఇవ్వాల్సిందే. బడికి కూడా వెళ్లలేని వయసున్న పిల్లలు అక్షరం ముక్క రాకున్నా ఫోన్లు ఆపరేట్ చేస్తూ, గేమ్‌లు ఆడటం, యూ ట్యూబ్‌లో విడియోలు చూస్తూ గడుపుతున్నారంటే ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు.
నేడు పిల్లలు ఫోన్లతో గడుపుతూనో, లేదంటే టీవీలకు అతుక్కుపోవడమే చేస్తున్నారు తప్ప కాసేపు ప్రశాంత వాతావరణంలో ఆడుకుందామనో, అమ్మా నాన్నలతో, బామ్మ, తాతలతో గడపడానికి ఇష్టపడటం అనేది క్రమంగా తగ్గిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అందరూ ఎవరికివారు వారి పనిలో నిమగ్నం కావటం జరుగుతోంది.
ఈ విజ్ఞానం అంతగా లేనప్పుడు పిల్లలు ఎక్కువగా పెద్దలతో గడపడటంవలన ఎన్నో అంశాలను, మానవీయ విలువలను, క్రమశిక్షణను, నీతి నిజాయితీల గురించి తెలుసుకునేవారు. పిల్లలు సైతం పెద్దలపట్ల అమితమైన గౌరవం, భయాన్ని కలిగివుండేవారు. కానీ నేడు అలాంటి పరిస్థితులు చూడాలంటే చాలా అరుదుగా కన్పిస్తాయి. కనిపించకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
నేడు పిల్లలను పాఠశాలలకు పంపించేటప్పుడు టీచర్స్‌కు ముందుగానే చెబుతారు- మీరు అడిగిన ఫీజులన్నీ కడతాము కానీ పిల్లవాడిని భయపెట్టకూడదు, కొట్టకూడదని. ప్రైవేటు యాజమాన్యం సైతం దానికి ఒప్పుకోవడం జరుగుతోంది. దాని తర్వాత ఆ తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు ప్రత్యక్ష నరకం ప్రతిరోజూ చూపిస్తారు. సహనం కోల్పోయి చేయి చేసుకుంటే ఇక్కడ యాజమాన్యం, అక్కడ మేనేజ్‌మెంట్ ఇరువర్గాల ద్వారా ఇబ్బందులు తప్పనిసరిగా ఎదుర్కొంటున్నారు ఉపాధ్యాయులు.
ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు కనీసపు క్రమశిక్షణ లేకుండా పెరుగుతున్నారు అంటే కారణమెవరు? ఉపాధ్యాయులా? మేనేజ్‌మెంటా? తల్లిదండ్రులా? కొంతమంది విద్యార్థులు క్రమశిక్షణారహితంగా ఉపాధ్యాయులపై ద్వేషాలు పెంచుకోవడం, వివిధ దురలవాట్లకు లోనవడం కొన్నిచోట్ల చూస్తే, వీళ్ళు నేటి భావి భారత పౌరులేనా అనే అనుమానం కలుగకమానదు. దీనికి కారణం తల్లిదండ్రుల అతిగారాబం మొదటిదైతే, శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో భాగంగా పాఠశాల విద్య వయసులో వారికి ఫోన్లు, బైక్‌లు కానుకలుగా ఇవ్వడం మూలంగా స్వేచ్ఛా జీవులై గుంపులుగా చేరి సినిమాలు షికార్లతో ఎంజాయ్ చేస్తూ ఉపాధ్యాయులు మందలించారనే నెపంతో వారిపై కక్షపూరిత చర్యలకు పూనుకోడం చూస్తున్నాము.
కొంతమంది ఉపాధ్యాయులు సైతం పిల్లలతో స్నేహపూర్వకంగా వుంటూ, వారిని ప్రోత్సహిస్తూ విద్యార్థులు చెడిపోవడానికి కారకులై, అక్కడక్కడా బాలికలపై కూడా అసభ్య వ్యవహారాలలో పాల్గొన్న విషయాలను సైతం చూస్తున్నాము. ఇలాంటి ఉపాధ్యాయులను పసిగట్టి పాఠశాలలనుండి తీసివేయాల్సిన అవసరం ఉంది.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమించడం తప్పుగాదు. మన పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, ఇబ్బందులపాలవుతున్నారా అనే విషయాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ, చెడు మార్గం వైపు పయనిస్తే నియంత్రణకై పాటుపడవచ్చు. అలా వదిలేస్తే సమాజంలో ఆ వ్యక్తి వివిధ నేరాలకు పాల్పడే అవకాశాలు బోలెడున్నాయి. అతి ప్రేమవలన, స్నేహపూరిత సంబంధాలవలన, మారుతున్న సమాజ పరిణామాల కారణంగా, సినిమాల ప్రభావం, అంతర్జాలంతో కూడిన చరవాణి ఉంటే చాలు, దానిని ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా లాభనష్టాలుంటాయి. ఏది ఏమైనా ఏది ఎంత పరిమితుల మేరలో వుంచాలో చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై వుంది. ముఖ్యంగా తల్లిదండ్రులను తమ పిల్లలను కూర్చోబెట్టుకొని నీతికథలు బోధిస్తూ, ఎలా మెలగాలి, ఏది మంచి ఏది చెడును బోధిస్తూ వారిని సక్రమమైన మార్గంలో పయనించేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మొక్కై వంగనిది మానై వంగునా? చిన్నవయసులో వారికి మంచి బుద్ధులు నేర్పకపోతే తమ కుటుంబానికే కాదు యావత్ దేశానికి ద్రోహులుగా తయారవుతారు. కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆర్థికాభివృద్ధియే ప్రధానం కాదు పిల్లలు పక్కదారి పట్టడానికి కారకులు కాకూడదు.
ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మేల్కొని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిదానిపై స్పందిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణగావిస్తూ తమ పిల్లలను సక్రమ మార్గంలో నడిచేలా కృషిచేయాల్సిన అవసరం తల్లిదండ్రులపై వుంది. రాబోయే తరాన్ని తీర్చిదిద్ది సక్రమమైన మార్గంలో పెట్టకుంటే మన సమాజ వినాశనానికి మనమే కారకులవుతాం. ఇప్పటికే ప్రపంచీకరణ నేపథ్యంలో ఎన్నో మార్పులు వచ్చి సగటు మనిషిని రోజురోజుకు ఆందోళన పరుస్తుంటే మన పిల్లల్ని సక్రమంగా పెంచకుంటే ఇది ప్రధాన కారణమై తీవ్ర ఆందోళనలకు దారితీసే ప్రమాదముంది. సమాజంలో వున్న మేధావులు సైతం ఈ విషయంపై పరిశోధన చేసి రాబోయే ముప్పునుండి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుంది.

- డా॥ పోలం సైదులు 94419 30361