సబ్ ఫీచర్

నిద్రతోనే మెదడుకు పదును!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలంతో పాటు పరుగులు తీస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ నిద్రపై శ్రద్ధ తగ్గుతోంది. రాత్రిపూట సరిగా నిద్రపోక పోవడంతో దాని ప్రభావం.. పనిచేసే ఉద్యోగంపై, చదువుకునే చదువులపై తీవ్రంగా కనిపిస్తుంది. మనిషిలోని జీవ గడియారం సరిగా పనిచేయాలంటే నిద్ర చాలా అవసరం.
మనిషి శరీరానికి విశ్రాంతి లేకుంటే ఏ పనీ సరిగా చేయలేము. ఒకవేళ చేసినా అది సంపూర్ణ స్థితిలో ఉండటం కష్టమే.. శరీరంలోని ప్రతి అవయవ భాగం ఒకదానితో మరోటి సమన్వయం కావాలంటే నిద్ర తప్పనిసరి. ప్రతి మనిషి రోజు కనీసం సగటున ఏడు గంటలైనా సుఖంగా నిద్రపోవాలి. శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ముఖ్యపాత్ర పోషిస్తుంది. గడియారం లేకుండా చేసే ఉద్యోగాలు, జీవితంలో ఎన్నో రకాలైన బాధ్యతలను మోసే మనం మనకు తెలియకుండానే ఎన్నో ఒత్తిడులకు గురి చేస్తుంటాయి. ఒత్తిడులను ఎదుర్కొనే క్రమంలో వ్యక్తిగతంగా చేయాల్సిన కొన్ని పనులు కూడా చేయలేనటువంటి పరిస్థితు ఏర్పడుతుంది. ఫలితంగా సహజ సిద్ధంగా చక్కటి ఆరోగ్యం లభించే పరిస్థితి కోల్పోయి రోజుల కొద్దీ ఆసుపత్రుల చుట్టూ పరుగులు పెడుతుంటాము. మనిషికి కమ్మని నిద్ర చాలా అవసరం. నిద్ర కరువైతే శరీరం అనేక రోగాలకు దారి తీస్తుంది. నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో కీలకం. నిద్రను నిర్లక్ష్యం చేసి మనుషులు అనారోగ్యాల పాలు కాకుండా అవగాహన కల్పించేందుకు మార్చి 15ను ప్రపంచవ్యాప్తంగా నిద్రదినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. నిద్రలేమి అనేది ప్రపంచ వ్యాప్తంగా మనుషులను పీడిస్తున్న ప్రధానమైన సమస్య. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా నిద్రలేమి పట్టి పీడిస్తుంది. ఎన్నో సౌకర్యాలతో పాటు ఆస్తులు, అంతస్తులు, కుటుంబ సభ్యులు, ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా 45 శాతం మంది నిద్రాదేవి ఆదరణను నోచుకోవడం లేదని సర్వేలు తెలియజేస్తున్నాయి. సకల మనోరుగ్మతలకూ, శారీరక రుగ్మతలకూ సుఖ నిద్రయే మందు. నిద్రను ఆహ్వానించి, ఆస్వాదించినప్పుడే ఆనందంగానూ, ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది.
వయసును బట్టి నిద్ర
వయసును బట్టి నిద్రపోయే వేళలు మారినప్పటికీ కనీసం సగటున ప్రతిరోజూ ఏడు గంటలైనా నిద్రపోవాలి. నిద్రలేమి వల్ల శరీర బరువు పెరుగుతుందనేది అక్షర సత్యం. మెదడు పనితనం సన్నగిల్లుతుంది. సగటు ఆయుర్దాయం తగ్గుతుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. సెలవురోజు అంటూ నిద్రకు ఎలాంటి మినహాయింపు లేదు. ప్రతిరోజూ వ్యాయామం చేసినట్లయితే సుఖనిద్ర శరీరం కోరుకుంటుంది. పుట్టిన పిల్లలకు 18 గంటల నిద్ర, చిన్నపిల్లలకు 11 గంటల నిద్ర, టీనేజీలో ఉండేవారికి 8-10 గంటలు నిద్ర సుఖప్రదమైనది.
మెదడు పదును
ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర మూలస్తంభం వంటిది. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్రావస్థలోనే శరీరం రిలాక్స్ పొంది ఆ రోజులో జరిగిన చిన్న చిన్న ఇబ్బందులను తొలగించుకుంటుంది. సంపూర్ణ నిద్రలోనే మెదడు పదునెక్కుతుంది.
నిద్రలేమి ఎందుకు?
* వయసురీత్యా సంభవించే వృద్ధాప్యం, సమయానికి భోజనం చేయకపోవడం, ఆహారంలో మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, ధూమ, మద్యపానాలు సేవించడం, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల నిద్రలేమి సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది.
* మెదడు సక్రమంగా పనిచేయడంలో నిద్ర కీలకపాత్ర పోషిస్తుంది. మెదడు సరిగా పనిచేస్తే మంచి ఏకాగ్రత లభిస్తుంది. తద్వారా తెలివిగా పనిచేయడంలో మెదడు సహకరిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచేందుకు నిద్ర కూడా ఉపయోగపడుతుంది.
* సుఖమైన నిద్ర శరీరానికి కలిగే అలసట, శరీర నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. రోజంతా కష్టపడి పనిచేసి అలసట చెందినవారికి మంచి నిద్ర వల్ల శరీరానికి, మనసుకు హాయి దొరుకుతుంది.
* మనిషిలో కలిగే భావోద్వేగాలను నియంత్రణ చేయాలంటే మంచి నిద్ర అవసరం. మనిషి సుఖనిద్ర వల్ల తనలో కలిగే ఆవేశాలను తన నియంత్రణలో ఉంచుకోగలుగుతాడు. ఇతరులతో చక్కటి మానవ సంబంధాలు కలిగించేందుకు కూడా నిద్ర తోడ్పడుతుంది.
* నిద్రలేమి కారణంగా మనిషిలో మానసిక ఒత్తిడి కలుగుతుంది. ఒత్తిడితో బాధపడే రోగులు తగినంత నిద్రపోని వారే ఉంటారని ఇప్పటికే చాలా పరిశోధనలు తేల్చాయి. చాలినంత నిద్ర పోకుంటే ఒత్తిడి, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు వస్తాయి.
* ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాగైనా సరే సగటున ఏడు గంటలు నిద్ర అవసరం. తక్కువనిద్ర, ఎక్కువనిద్ర.. ఏదైనా సరే మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
* నిద్రలేమి యువతలో కూడా ఎక్కువగా ఉంటోంది. యువత రాత్రిపూట 8-10 గంటలపాటు నిద్రపోవాలి. ఒకప్పుడు బెడ్‌రూమ్ అంటే విశ్రాంతికి చిహ్నంగా ఉండేది. ప్రస్తుతం పడకగదిలో కూడా లాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్‌లు అత్యధికంగా ఉపయోగిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. స్మార్ట్ఫోన్‌లకు బానిసలుగా మారి నిద్రను తగ్గిస్తూ మానసిక రుగ్మతలు పెంచుకుంటున్నారు.
మంచి నిద్ర కోసం..
* రాత్రిపూట తీసుకునే ఆహారం నిద్రా సమయం కంటే రెండు గంటల ముందుగా తీసుకోవాలి. మనం పడుకునే సమయం వరకు ఆహారం సగం జీర్ణం కావాలి.
* నిద్ర పోవాలనే సమయానికంటే అరగంట ముందుగానే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, ఆత్మీయ సన్నిహితులతో గడపాలి.
* నిద్రకు ముందు కొంత సమయం పాటు కళ్ళు మూసుకుని ముగ్ధమనోహరమైన దృశ్యాన్ని ఊహించుకోవాలి.
* నిద్రలేమి సమస్య తీవ్రంగా ఉంటే దగ్గరలోని సైకాలజిస్ట్ ద్వారా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చికిత్స ద్వారా నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు.
* నిద్రలేమి సమస్యకు నిద్ర మాత్రలు పరిష్కారం కాదని, ఆలోచనావిధానంలో మార్పుతోనే పరిష్కారం సాధ్యం. సహజసిద్ధంగా లభించే నిద్రను ఆస్వాదించాలి.. చక్కటి ఆరోగ్యంతో జీవించాలి.

- డా॥ అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321