సబ్ ఫీచర్

‘మండలి’లో తరగతి గది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గదిలో కొన్నిసార్లు ఎవరో ఒక విద్యార్థి అనుచితంగా ప్రవర్తించవచ్చు. గతంలో నేను సికింద్రాబాద్ హైస్కూల్‌కు బదిలీ అయ్యాను. ఒక విద్యార్థి నా పేరు తెలుసుకున్నాడు. తరగతి గదిలో నేను అడుగుపెట్టగానే ఆ రోజుల్లో వచ్చిన సినిమా పాట ‘రామయ్యా వస్తావయ్యా’.. అంటూ పాడటం మొదలుపెట్టాడు. దాంతో నాకు కొంత ఇబ్బంది కలిగింది. ఆ విద్యార్థి రెచ్చిపోతాడన్న భయంతో మొత్తం పాట పూర్తిచేసేంతవరకు అలాగే నిల్చున్నాను. ఆ తర్వాత- ‘చాలా బాగా పాడావు. నీ కంఠం చాలా బాగున్నది’ అని చెప్పి నా పాఠం మొదలుపెట్టాను. మొదటి రోజు కాబట్టి ప్రతి విద్యార్థి తన తెలివితేటల్ని ప్రదర్శించటానికి ప్రయత్నిస్తాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసే విద్యార్థిని చూసి ఇతర పిల్లలు కూడా అనుకరిస్తారు. విద్యార్థి వేసే ప్రశ్నను ప్రశంసిస్తూ ఆరోజు చెప్పబోయే పాఠ్యాంశానికి దాన్ని కలపాలి. ఇది ఊహించని పరిణామం. దానికి సమాధానం చెప్పటం ఒకటయితే, ఆ ప్రశ్నకు చెప్పబోయే పాఠానికి అనుసంధానించి మొదలుకావటం ఉపాధ్యాయుడు చేస్తాడు. ఉపాధ్యాయుడు దేన్ని ఫోకస్ చేద్దామనుకుంటున్నాడో దాన్ని మర్చిపోకుండా విద్యార్థికి సమాధానం చెప్పాలి. దానిని అనుభవంతో హ్యుమరస్‌గా దాటవేయాలి. చిలిపిచేష్టలతో విద్యార్థులు వేసే ప్రశ్నలకు సమాధానం చెబితేనే మిగతా పిల్లలకు ఉపాధ్యాయునిపై నమ్మకం కుదురుతుంది.
ఇలాంటి దృశ్యానే్న నేను శాసనమండలిలో చూశాను. నేను ప్రతిపక్షంలో కూర్చున్నాను. కాబట్టి నా పక్కన ఒక ఎమ్మెల్సీ కూర్చునేది, అతనికి సమాధానం చెపుతున్నది మంత్రి. విషయ పరిజ్ఞానం, అనుభవం ఆ మంత్రికి బాగా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నవారు దబాయిస్తే ప్రతిపక్షం రెచ్చిపోతుంది. అప్పుడు వాడు హీరో అవుతాడు. పాలకవర్గంలో కూర్చున్న మనిషి పరిపాలనాదక్షత ప్రశ్నోత్తరాల సమయంలోనే కనపడుతుంది. ఈ సారూప్యత ఎందుకంటే తరగతి గది అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా కనపడుతుంది. ప్రశ్నకు సమాధానం ఇచ్చేటప్పుడు కొట్టిపారేయకుండా మంత్రి వివరణతో సమాధానమిచ్చారు. బయటకువచ్చిన తర్వాత ఆ మంత్రి మరింత వివరంగా ఆ ఎమ్మెల్సీకి చెప్పటం చూశాను. దాన్ని చూస్తే నాకు తరగతి గది దృశ్యం గుర్తుకువచ్చింది. నా భావాల్ని ఆ ఇద్దరితో పంచుకున్నాను. తరగతి గది దృశ్యమే ఆ ఇద్దరి చర్చలో కనిపించదన్నాను.
నడకను నేర్పేది...
తరగతి గదిపై ప్రతి కాలంలోకూడా ఆనాటి పరిస్థితుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఈనాడు దేశంలో మహిళలు ఇంటివరకే పరిమితం కాలేరు. ఆనాడు శ్రామికవర్గంలోకి కూలీలుగాపోయి ఉత్పత్తికి ఏ విధంగా దోహదపడేవారో ఈనాడు మధ్యతరగతి, వెనుకబడిన వర్గాల ఆడవారు కూడా చదువుకుని దేశ ఆర్థిక స్థితికి, ఎదుగుదలకు తమవంతు పాత్రను నిర్వహించాలని పట్టుదలగా ఉన్నారు. దానికి తగినట్లు సామాజిక, సాంస్కృతిక మార్పులు కూడా తీసుకురాగలిగారు. కానీ, ప్రకృతిని అనుసరించి మహిళలు కొన్ని బాధ్యతలు నిర్వహించవలసి ఉన్నది. తల్లిగా మానవ సంపదను పెంచవలసి ఉంది. ఆ బాధ్యతను నిర్వహించకుంటే వారు మానసిక ఉద్రేకాలకు గురవుతుంటారు. కన్నశిశువును వదిలిపెట్టి పనికి పోవడంతో భావోద్వేగాలకు లోనవుతారు. ఇలాంటి మహిళలను ఆదుకొనేందుకు కేజీ స్కూల్స్ మొదలయ్యాయి. కేజీ స్కూల్స్ అక్షరజ్ఞానం కలిగించటానికి కాదు, తల్లిగా ఏ బాధ్యతలు నిర్వహించవలసి ఉందో ఆ లాలనాపాలనకు ఆటపాటతో తమ కార్యక్రమాల్ని రూపొందించుకోవలసి ఉంది. శిశువును తల్లి ప్రేమించాలి, ఆడించాలి. అంటే విద్యను పిల్లలకు ఆటవిడుపుగా చెప్పాలి. చదువుకు తరగతి గది కావాలని మనమనుకుంటాం. దానితో పిల్లల్లో విధేయత రావచ్చు. కానీ, చదువుమాత్రం రాదు. చదువురావాలంటే అందులో పాత్రధారి కావాలి. ఉపాధ్యాయులు ఈ ఆటలో భాగస్వామి కావాలి. చేతిలో బెత్తం కాదు, విధానం కావాలి. జ్ఞానాన్ని ఆ వయసుకు తగినట్లు జీర్ణమయ్యేవిధంగా చూసి అందించాలి.
బోధన, సాధన పద్ధతులు మారిపోయాయి. కూర్చొని ఉపదేశాలిచ్చే కాలం పోయింది. ఆట ఆడుతూ, పాట పాడుతూ, హావభావాలను వ్యక్తం చేస్తూ ఒక కోచ్‌గా చెప్పాలి. ఈత నేర్పేటప్పుడు స్వతహాగా కోచ్ కూడా నీళ్లల్లోకి దిగుతాడు. ఈత ఎలా కొట్టాలో ప్రాక్టికల్‌గా చూపిస్తాడు. శరీరాన్ని ఎట్లా మలచాలో చూపుతాడు. తరగతి గదిలోవున్న టీచింగ్ ప్రాసెస్ లక్ష్యం కూడా మారింది. తరగతి గది ఈనాడు మనిషిగా ఎట్లా నడుచుకోవాలో బతుకు నడకను నేర్పుతున్నది కాబట్టి కేజీ స్కూల్స్ లక్ష్యం హ్యుమన్ బిహేవియర్‌ను రూపొందించడమే. తరగతి గది పసిపిల్లలకు జీవితపు నడకను నేర్పి అడుగులు వేయించే బాధ్యతను తీసుకుంది. ఒకవైపున రోదసిలో మనుషులను తీసుకెళ్లటానికి సన్నద్దం చేయాలి. రెండోవైపున మనిషి సమాజంలో నడిచేందుకు నడకను కూడానేర్పాలి. తరగతి గది అవసరాన్ని బట్టి ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అది విరగదు. కాలాన్ని బట్టి, పిల్లల వయసును బట్టి ఎటు అంటే అటు అది వొంగుతుంది. విద్యార్థి చుట్టూ తిరుగుతుంటూ ఉంటుంది.

-చుక్కా రామయ్య