సబ్ ఫీచర్

పాలతో మేలెంతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అదో సముద్రం. భారతీయ సంప్రదాయంలో పాలు ఓ భాగం. నీరు తర్వాత అధికంగా వాడే పదార్థం పాలే. పురాణాల ప్రకారం శ్రీమన్నారాయణుని నివాసం పాలసముద్రం. మంధర పర్వతంతో పాలను చిలికినపుడే అమృతం వచ్చింది. పాలతో దేవుణ్ణి అభిషేకిస్తారు. పంచామృతంలో పాలు కూడా ఒకటి. నైవేద్యంలో పాలు ఉండాల్సిందే. నాగులచవితికి పుట్టలో పాలు పోస్తారు. వేదకాలం నుంచి ఎంతో ప్రాధాన్యత కలిగిన పాలలో అపారమైన పోషక విలువలున్నాయి. పాలు శ్రేష్టమైన బలవర్థక ఆహారము. హిందువులు పవిత్రంగా పూజించే ఆవు యొక్క పాలు అన్ని రకాల పూజా కార్యక్రమాల్లోనూ వాడతారు. శ్రీలక్ష్మి పాల సముద్రం నుండే పుట్టినది. పాడి పరిశ్రమ కూడా వ్యవసాయంలో ఒక భాగం. అందుకే పాడి వున్న చోట సిరుల పంట అంటారు. కొత్తగా గృహప్రవేశ సమయంలో కూడా పాలను పొంగిస్తారు. పాలు మానవ శరీరానికి పోషకాల ఖని. చంటిపిల్లలనుంచి వృద్దులవరకూ అందరికీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందీ పాలు.
ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వారు ప్రతి మనిషి రోజూ కనీసం అర లీటరు పైన పాలు స్వీకరించాలని చెబుతున్నాయి. ఎందుకంటే పాలలోవందశాతం పోషక విలువలు మరియు బి12 విటమిన్ అధికంగా కలిగిన సమతులాహారం పాలు. అంతేగాక ఎముకల పటుత్వాన్ని కల్గిస్తాయి. చనుబాల తర్వాత అధికశక్తినిచ్చేవి పాలు. ఆస్టియో పోరోసిస్ రాకుండా నిరోధిస్తాయి.
పాలు - ఉపయోగాలు
ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో 2001 సంవత్సరం నుండి జూన్ 1వ తేదీని ‘ప్రపంచ పాల దినోత్సవం’గా నిర్వహిస్తున్నాయి. ప్రజల్లో పాలవినియోగం పట్ల అవగాహనను పెంచుతూ, పాలు మరియు పాల ఉత్పత్తులకు ప్రచారాన్ని కల్పించడంకోసం ప్రపంచ క్షీర దినోత్సవాన్ని జరుపుతున్నారు. మన దేశంలో గేదె పాల ఉత్పత్తి 53 శాతం, ఆవు పాలు ఉత్పత్తి 43 శాతం, మేకపాలు 3 శాతం నుండి 4 శాతం ఉంటాయి. స్వదేశీ ఆవుపాలలో 86.4 శాతం నీరు, గేదెపాలలో 87.6 శాతం నీరు ఉంటుంది. పాలలో పోషక విలువల విషయానికొస్తే కొవ్వు పదార్థాలు 4 శాతం, పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్స్) 4.7 శాతం, మాంసకృతులు (ప్రొటీన్స్) 3.3శాతం, నీరు 88 శాతం ఉంటాయి. పాల ఉత్పత్తిలో భారతదేశం, అమెరికా మొదటి, రెండు స్థానాలలో ఉన్నాయి. వేడిచేసిన పాలను తోడుకు పెట్టినచో పెరుగు తయారవుతుంది. పెరుగును పలుచగా చేస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగను చిలికితే వెన్న తయారవుతుంది. వెన్నను మరగబెడితే నెయ్యి వస్తుంది. పాలు తాగడంవలన బరువు తగ్గడం కూడా జరుగుతుంది. పాల ఉత్పత్తిలో మనం అగ్రస్థానంలో వున్నప్పటికీ పాల వినియోగంలో ఇంకా వెనుకబడే వున్నాము. వ్యాయామం తరువాత పాలు తాగడంవల్ల సత్వర శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఐదు పదులు దాటినవారు రోజూ 230 నుంచి 300 మి.లీ పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలని ఎన్‌ఐఎన్ సూచిస్తోంది.
పసివాళ్ళలో కూడా చనుబాల తర్వాత అంతటి సత్తువనిచ్చేది పాలే. పాలల్లో విటమిన్ డితోపాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణాలు ఉన్నాయి. పెద్దలతో పోలిస్తే పాలను జీర్ణం చేసుకునే శక్తి పిల్లల్లోనే ఎక్కువని కాలిఫోర్నియాలో జరిగిన పరిశోధనలో వెల్లడైంది. అంతేగాక చెడు క్రిముల్ని నాశనం చేయడమేగాక మంచి పోషకాలను రక్షించడంలో పాల పాత్ర కీలకం. పాలల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇకపోతే కాల్షియం గురించి చెప్పనవసరమే లేదు. పాలు బుద్ధి వికాసాన్ని కలిగిస్తాయి. ‘పాలు’ అనే పదం అనేక సందర్భాల్లో వాడుతుంటాం. మురిపాలు, తాపాలు, కోపాలు, కష్టాలపాలు.. ఇలా ప్రతిమాట వెనుక పాలు ఉంటాయి. భారతదేశంలో కోట్లమంది రైతులకు పాడి పరిశ్రమ అదనపు ఆదాయ వనరు. దేశీయంగా జరుగుతున్న పాల పాకెట్ల వ్యాపారం విలువ 5వేల కోట్లు అని అంచనా వేయబడింది. ఎందుకంటే భూమీద పుట్టిన ప్రతి జీవరాశికి ప్రారంభంలో పాలే ప్రధాన ఆహారం. అంతేకాకుండా పాలు సంపూర్ణ పౌష్టికాహారం కూడా. ఆవుపాలు లేత పసుపురంగులో, గేదె పాలు తెలుగు రంగులో ఉంటాయి. ఆవుపాలలో ఫ్యాట్ తక్కువగా, గేదె పాలలో ఫ్యాట్ ఉంటాయి. కానీ భారతదేశంలో కల్తీపాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి హానిచేస్తున్నాయి. భారత్‌లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు కల్తీపాలు తాగుతున్నారట. పాకెట్ల పాలలో డిటర్జెంట్, నీళ్లు, సింథటిక్ స్టార్చ్ .. ఇలా పాలను అనేక పద్ధతులుగా కల్తీ చేస్తున్నారు.
ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం యొక్క వాటా 16 శాతం. పాల ఉత్పత్తికి ప్రపంచంలోనే ప్రథమ స్థానం రావడానికి కారణం శే్వతవిప్లవం పితామహుడిగా పేరుగాంచిన ‘కురియన్’ కారణం. భారతదేశ మిల్క్‌మాన్‌గా ప్రసిద్ధిగాంచిన డాక్టర్ వర్గీస్ కురియన్ ప్రపంచంలో అతి పెద్ద వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమమైన ‘ఆపరేషన్ ఫ్లడ్’ను రూపొందించారు. భారతదేశాన్ని తక్కువ పాల ఉత్పత్తిని కల్గిన దేశ స్థాయినుండి ప్రపంచ అగ్రశ్రేణి పాల ఉత్పత్తి దేశంగా మార్చివేశాడు. 2018 సంవత్సరం అంతర్జాతీయ పాలదినోత్సవ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నినాదం ‘డ్రింక్ మోర్, బీ స్ట్రాంగ్’ అని. అందుకే పాల ఉత్పత్తిని అభివృద్ధి పాలు ఎక్కువగా త్రాగేటట్లు చూసుకోవాలి. పాలు అనేక విధాలుగా లభ్యమవుతున్నాయి. తల్లిపాలు, ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు, గాడిద పాలు, గొఱ్ఱె పాలు, బూత్ పాలు. ఆవుపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమైనవి. ప్రపంచ వ్యాప్తంగా ఆవు పాలు మాత్రమే అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలో 90 శాతం పాలు జెర్సీ ఆవులనుండే తయారవుతోంది. పాల ఉత్పత్తుల కల్తీని ఎప్పటికప్పుడు గుర్తించకపోతే 87 శాతంమంది పౌరులు 2025 నాటికి క్యాన్సర్ లాంటి తీవ్రమైన రోగాల బారిన పడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
పాల కల్తీ దక్షిణాది రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా జరుగుతుందని అంటారు. భారతదేశంలో పాలు, పాల ఉత్పత్తుల్లో 68 శాతం భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా లేవట. అందుకే సమాజం మేల్కోవాలి. కల్తీని నిరోధించాలి. అపుడే ఆరోగ్యకరమైన సమాజం. అపుడే పాల దినోత్సవం సార్థకత.

-కె.రామ్మోహన్‌రావు 9447435912