సబ్ ఫీచర్

కేన్స్‌లో భారతీయ ఛాయాగ్రాహకురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిష్ఠాత్మకమైన ఏంజెనియా ప్రత్యేక ప్రోత్సాహక అవార్డు అందుకున్న తొలి భారతీయ ఛాయాగ్రాహకురాలు మొధుర పోలిత్. 28 సంవత్సరాల మొధురది కోల్‌కతా. చిన్నప్పటి నుండి ఆమెకు కెమెరా లెన్స్ అంటే ప్రాణం. అందమైన ప్రపంచాన్ని మరింత అందంగా చూపించాలనేది ఆమె కోరిక. ఆ కోరికే ఆమెను ఛాయాగ్రాహకురాలిని చేసింది. చిన్నప్పటి నుండీ అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించడం మొధురకు అలవాటు. అలా తను ఎంచుకున్న రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందడానికి ఆమె తీవ్రంగా కృషి చేసింది. సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్, ఏషియన్ ఫిల్మ్ అకాడమీతో కలిసి మూడు చిత్రాలకు ఛాయాగ్రాహకురాలిగా పనిచేసే అవకాశాన్ని దక్కించుకుంది. అలాగే డాక్యుమెంటరీలు, లఘుచిత్రాలు, పలు భాషల్లో వాణిజ్యప్రకటనలు చేసి.. అందరి ప్రశంసలనూ అందుకుంది. దినపత్రికలు వేసే కుర్రాడిపై తీసిన ‘ పేపర్‌బాయ్’ లఘుచిత్రం విమర్శకులను సైతం మెప్పించింది. చైనా యూత్ ఫిల్మ్ ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన ‘ ద గర్ల్ అక్రాస్ ద స్ట్రీం2, ఏషియన్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో తీసిన ‘ మీట్‌సోహీ’ లఘుచిత్రాలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఎంపికైనవే.. ఈ చిత్రాలను తెరపై చాలా అందంగా చూపించింది మొధుర. ఇవే ఆమెను 2019 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై విజేతగా నిలిపాయి. కేన్స్ చలనచిత్రోత్సవాల్లో ఇంతటి గౌరవాన్ని అందుకున్న మొధుర మాట్లాడుతూ ‘ దీనికి ఎలా ఎంపికయ్యానో నాకు తెలియదు. ఎందరో ప్రముఖులు హాజరైన ఈ వేదికపై నాకు అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నాను. నాలాంటి వర్ధమాన ఛాయాగ్రాహకులకు ఇలాంటి ప్రోత్సాహకాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. దాంతో భవిష్యత్తులో ఇంకా ఎన్నో అద్భుతాలు చేయొచ్చు.. అవునూ.. నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేయడానికి కారణమేంటి?’ అని నిర్వాకులను ఎదురు ప్రశ్నించింది మొధుర. అందుకు నిర్వాహకులు సమాధానం ఇస్తూ.. ‘ నీ సృజనాత్మకత నీ పనిలో ప్రతిఫలిస్తోంది. దాన్ని తెరపై అందంగా చూపించడానికి నువ్వు చేసిన ప్రయత్నం అద్భుతం. సామాజిక అంశాలను వెలుగులోకి తీసుకురావడానికి నువ్వు చేస్తున్న కృషి అభినందనీయం.. ఇవన్నీ ప్రపంచానికి తెలియాలి కదా.. అందుకే నిన్ను ఎంపిక చేశాం’ అని సమాధానమిచ్చారు. ఏది ఏమైనా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విజేతగా నిలిచిన తొలి భారతీయ ఛాయగ్రాహకురాలిగా మొధుర పోలిత్ చరిత్ర సృష్టించింది. *