సబ్ ఫీచర్

కమ్యూనిజం వర్సెస్ సాంకేతికత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమ్యూనిస్టుల పాలన ఎలా ఉంటుందో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ తాజాగా ‘రుచి’ చూపించారు. ప్రపంచమంతటా ప్రజాస్వా మ్యం పరిఢవిల్లుతున్న సమయంలో లింగూ లిటుకూమంటూ ఉత్తర కొరియాలో కమ్యూనిస్టు వ్యవస్థ కొనసాగుతోంది. ఆ వ్యవస్థను తన కనుసైగలతో కొనసాగిస్తున్న కిమ్ సరికొత్త కిరాతకం ఇటీవల వెలుగు చూసింది. అణ్వాయుధాలను అదేపనిగా పెంచుకుంటూపోతున్న ఉత్తర కొరియాకు ముకుతాడు బిగించేందుకు ఐక్యరాజ్యసమితి, అమెరికా అనేక ఆంక్షలు విధించాయి. అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ ఉద్రిక్త పరిస్థితిని సడలించేందుకు గత ఫిబ్రవరిలో వియత్నాం రాజధాని హానోయ్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీనికి ఉత్తర కొరియా ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమని, దుబాసి సరిగా పదాలను పలకలేదని, మొత్తం చర్చల విషయంలో ఉన్నతాధికారులు మోసానికి పాల్పడ్డారన్న అభియోగంపై ఐదుగురు అధికారులకు మరణశిక్ష విధించారని, గత మార్చిలోనే వారిని మీరిమ్ విమానాశ్రయంలో కిమ్ కాల్చి చంపించాడన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాయాది దేశమైన దక్షిణ కొరియా ఈ విషయాలను బయటపెట్టింది. దక్షిణ కొరియా దినపత్రికలు ఉత్తర కొరియా అరాచకాలపై, అనాగరిక చర్యలపై తరచూ వార్తలు ప్రచురిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చిలువలు పలువలు చేసి రాసిన సందర్భాలూ ఉన్నాయి.
కమ్యూనిస్టుల పాలనలో ఉన్మాదంతో చేసే పనులు ఎలా ఉంటాయో రేఖామాత్రంగా బయటి ప్రపంచానికి దక్షిణ కొరియా పత్రికలు తెలుపుతూ ఉన్నాయి. దశాబ్దాల క్రితపు స్టాలిన్ మనస్తత్వం కిమ్‌లో సజీవంగా కనిపిస్తోంది. తన నీడను తానే నమ్మలేని మానసిక స్థితిలో కమ్యూనిస్టు (అగ్ర) నాయకులు చరిత్ర నిండా కనిపిస్తారు. ఆ ఉన్మాద స్థితిని సదా కాపాడుకుంటూ వస్తున్నారు. తన పదవికి ఎక్కడ ఎసరు పెడతాడో ఏమోనన్న అనుమానంతో తన సమీప బంధువును ఓ విదేశీ విమానాశ్రయం వద్ద కిమ్ చంపించిన సంగతి సైతం అందరికీ గుర్తుండే ఉంటుంది. కీలకమైన సమావేశాల్లో కునుకుపాట్లు పడ్డారన్న ఆరోపణలతో అధికారులను అంతమొందించిన సంఘటనలు అనేకమున్నాయి. ఇలాంటి అనాగరిక, పాశవిక చర్యలు కోకొల్లలు కనిపిస్తాయి.
ఇలాంటి ఉన్మాద పాలన కోసం భారత మావోయిస్టులు ఉవ్విళ్ళూరుతున్నారు. వీలయితే ఇంతకన్నా దారుణంగా ప్రజాకోర్టుల పేర ప్రజలను, అధికారులను శిక్షించి తమ రాజ్యాధికార దాహాన్ని తీర్చుకునేందుకు కలలు కంటున్నారు. ఇదెలా ఆహ్వానించదగ్గ ఆలోచన అవుతుందో అందరూ ఆలోచించాలి.
1989 సంవత్సరంలో అంటే- మూడు దశాబ్దాల క్రితం ప్రజాస్వామ్యం కోసం చైనా రాజధాని బీజింగ్‌లోని తియాన్మన్ స్క్వేర్ వద్ద వేలాది మంది యువకులను, విద్యార్థులను, కార్మికులను సైనిక ట్యాంకులతో తొక్కించిన సంఘటన సరైనదేనని ఇటీవల ఆ దేశ రక్షణశాఖ మంత్రి లీఫెంగే సింగపూర్‌లో ప్రకటించారు. ప్రపంచమంతా ఆ ఘటనను తీవ్రంగా ఖండించినా, వేలాది మంది అదృశ్యమైనా ఇప్పటికీ కమ్యూనిస్టు పాలకులు తమ పాశవిక చర్యను సమర్ధించుకుంటున్నారు. మళ్లీ వీరే మానవ హక్కుల గూర్చి, కార్మిక-కర్షక సాధికారత గూర్చి మాట్లాడతారు. ఎంత విచిత్రం? రాజ్యాధికారం చేపట్టేందుకు, చేపట్టాక దాన్ని నిలుపుకునేందుకు కమ్యూనిస్టులు ఎలాంటి పనులకైనా వెనుకాడరని చరిత్ర చాటి చెబుతోంది.
అందరికీ సాంకేతికత...
వచ్చే అక్టోబర్ 3, 4 తేదీల్లో కొత్త ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య సహకారంతో ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం- ఇండియా) ఓ ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహించబోతోంది. ‘‘అందరికీ ఉపయోగపడేలా సాంకేతికత’’ అన్న అంశంపై జరిగే ఈ సదస్సులో పలువురు మేధావులు, పారిశ్రామికవేత్తలు, విద్యారంగ నిపుణులు, ఆర్థిక నిపుణులు, మీడియా ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. ఇందులో ప్రసంగించవలసిందిగా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. గతంలో ఆయన ఐటీ మంత్రిగా వివిధ వినూత్న కార్యక్రమాల్ని చేపట్టి దేశం దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే! సాంకేతిక రంగంలో పలు ఆవిష్కరణలకు అండగా నిలిచేందుకు ఆయన టీ-హబ్, టీ-హబ్ ఫేజ్-2 రూపొందించి ప్రపంచ ఐటీ నిపుణుల దృష్టిని ఆకర్షించిన విషయమూ విదితమే! స్విట్జర్‌లాండ్‌లోని దావోస్‌లో ఏటా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఓ సదస్సును నిర్వహిస్తుంది. ఈ సదస్సు ప్రపంచ ఆర్థిక దిశను తెలుపగలదన్న విశ్వాసం చాలామందిలో ఉంది. అందుకే అన్ని దేశాల ప్రముఖులు, రాజకీయ-పారిశ్రామిక ప్రముఖులు అక్కడికి వెళుతూ ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆ సదస్సులకు హాజరైన వాళ్ళలో కేటిఆర్ కూడా ఒకరు.
అందరికీ ఉపయోగపడే సాంకేతికత అన్న అంశం చాలా ఉత్తేజకరమైనది. వర్తమాన సమాజంలో ఆవిష్కృతమవుతున్న అనేక సాంకేతిక అంశాలు ప్రజలందరికీ ఉపయుక్తంగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో అభివృద్ధి, టెక్నాలజీ, వినూత్న ఆవిష్కరణలపై అంతర్జాతీయ చర్చ చేయడం ఆహ్వానించదగ్గ విషయం. భారత పరిశ్రమల సమాఖ్య సహకారంతో నిర్వహించే సదస్సులో సహజంగా మన పరిస్థితుల పరివర్తనకు ఉపకరించే సారాంశం వెలువడుతుందని విశ్వసించవచ్చు. ఐటీ రంగంలో అతివేగంగా వస్తున్న నూతన టెక్నాలజీలను భారత యువత అందుకోగలిగినప్పుడే ప్రపంచంతో కలిసి నడిచేందుకు వీలవుతుందన్న సంగతి అందరి ‘ఎరుక’లో ఉన్నది. ఆ లక్షణం కారణంగానే ప్రపంచంలో ఏ మూలన ఏ రకమైన ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయి? అవి ప్రజలనెలా ప్రభావితం చేస్తాయి? అనే అంశాలపై చర్చలు-గోష్ఠులు జరుగుతూ ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. ఇదొక స్రవంతిలా కొనసాగుతూనే ఉంది. ఉపాధి రంగానికి ఈ స్రవంతి ఎంతో ఊతం ఇస్తోంది. సరికొత్త ఉద్యోగాల కల్పనకు వర్తమాన టెక్నాలజీలపై అవగాహన తప్పని సరైంది. బ్లాక్‌చైన్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, కృత్రిమ మేధ.. ఇట్లా పలు అంశాలకు చెందిన సాంకేతిక పరిజ్ఞానం ఎలా అన్వయించుకోవాలన్న చర్చ, ఏ విధంగా ఆ టెక్నాలజీని అందరి దరికి తీసుకెళ్ళాలన్న విధాన నిర్ణయాల అవసరముంది. అందుకు ఇలాంటి అంతర్జాతీయ సదస్సులు ఎంతో దోహదపడతాయి. భారత దేశానికి ఏవి అవసరమో, గ్రామీణ-నగర ప్రజల అవసరాలను చర్చించేందుకు సరైన దృష్టికోణం గల కేటీఆర్ లాంటి నాయకుల సూచనలు, అభిప్రాయాలు ఎంతో అవసరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం- భారత పరిశ్రమల సమాఖ్య వారు దీన్ని గుర్తించి యువకుడైన కేటీఆర్‌కు ఆహ్వానం పలికారు. వాస్తవానికి తెలంగాణ ఐటీ రంగం వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ఈ రంగంలో దాదాపు ఐదున్నర లక్షల మందికి నేరుగా ఉపాధి లభిస్తోంది. ఈ సంఖ్యను పది లక్షలకు చేర్చాలని ప్రణాళికలు రచిస్తున్నారు. పరోక్షంగా మరెన్నో లక్షల మంది ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఐటీ ఎగుమతులు సైతం భారీగా పెరిగాయి.
ఆధునిక సాంకేతికత కొంతమంది పారిశ్రామికవేత్తలకో, వ్యాపారవేత్తలకో, మీడియా మొఘల్స్‌కో కాకుండా ప్రజలందరి కోసం అన్న మూలభావన ఎంతో ఆహ్వానించదగ్గది. ప్రపంచం ఎటువైపు పయనిస్తున్నదో, ఎటువైపు ఎలా అడుగులు వేస్తున్నదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
సాంకేతికాభివృద్ధిలో పాల్గొంటున్నది ప్రజలు, వారి సంతానం. వర్తమాన యువత తన మేధోశ్రమను దానికి ధారపోస్తున్నది. సృజనశక్తిని వెచ్చిస్తున్నది. తన భవిష్యత్‌ను నిర్మించుకుంటోంది. గత పాతిక సంవత్సరాలుగా ప్రపంచమంతటా ఇదే ‘దృశ్యం’ కనిపిస్తోంది. దీన్ని వీక్షించగలిగితే చాలా విషయాలు అస్పష్టత నుంచి స్పష్టతలోకి వస్తాయి. మన కళ్ళముందు జరుగుతున్న ఈ నూతన పరిణామాలు కొద్దిమంది కోసమే అన్న తప్పుడు ప్రకటనలను ప్రచారం చేసే వారిలో ముఖ్యంగా కమ్యూనిస్టులు, మావోయిస్టులు కనిపిస్తారు. కొన్ని దశాబ్దాలు వారి ఉక్కు కౌగిలిలో ఉన్న లక్షలాది-కోట్లాది మంది ప్రజలు క్రమంగా స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని పొందుతున్నారు. విషాదమేమిటంటే.. ఇంకా చాలామంది ఆ భావజాలమే పరమ ప్రామాణికమని భావించడం. ఆ సిద్ధాంతం కళ్ళముందే కుప్పకూలినా, ప్రపంచంలో ఎక్కడా ఆ ఆర్థిక సిద్ధాంతాలకు మాన్యత లేదని తేలినా- వాస్తవాలను చూసేందుకు అలాంటివాళ్లు నిరాకరించడం విచారకరం.
మరో దశాబ్దకాలం తరువాత అలాంటివాళ్లు తాము ముందుగా మేల్కొనక పోయినందుకు నిజంగా దుఃఖపడతారు. అలాంటివారి పిల్లలు మాత్రం రాకెట్లలా దూసుకుపోతారు. వారిదే ఈ సమాజం, సంపద.
తాజాగా సింగపూర్‌లో స్వయం చోదిత ఎలక్ట్రిక్ బస్సును రోడ్లపై విజయవంతంగా నడిపారు. వోల్వో బస్సుల సంస్థతో సింగపూర్ అధికారులు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇటీవలనే ఈ ప్రయోగం విజయవంతమైంది. ‘హాండ్ ఫ్రీ’ టెక్నాలజీని ఈ బస్సుల్లో వాడుతున్నారు. అంటే సాంకేతికత సామాన్య పౌరుడి దగ్గరికి ఎంతలా చేరుతున్నదో ఈ పరిణామం తెలియజేస్తోంది. ఇదేకదా అందరూ కోరుకునేది!

-వుప్పల నరసింహం