సబ్ ఫీచర్

మధురమైనది స్నేహబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం... దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్.. ఒకటేమిటి స్నేహం విలువ చాటిచెప్పే అద్భుతమైన సినిమా పాటలు, గొప్ప గొప్ప సినిమాలు, కథలు లెక్కకు మించి ఉన్నాయి. వీటన్నిటికి నిత్యప్రేరకాలు మన ఇతిహాసాలు. మన భారతీయ సంస్కృతిలో స్నేహబంధం ఉన్నతి అమూల్యమైనది. రామాయణ మహాకావ్యంలో ప్రతి అడుగునా స్నేహబలం, మిత్రలాభం ప్రతిబింబిస్తుంటాయి. మహాభారతంలో విభిన్నకోణాల్లో స్నేహంవల్ల పతనం, ఉన్నతి రెండూ కనిపిస్తాయి. విష్ణుశర్మ హృదయరంజకంగా మిత్రలాభం, మిత్రబేధాలను రచించాడు. షేక్‌స్పియర్ ఆంటోనీ, జూలియస్ సీజర్.. గురజాడ డోమనస్ పితకస్ చెప్పుకుంటే చాలా చాలా ఉన్నాయి.
1930లో హాల్‌మార్క్ సంస్థ అధినేత తన వ్యాపారాభివృద్ధికోసం స్నేహితుల దినోత్సవాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ఈరోజు స్నేహితుల దినోత్సవం పేరుచెప్పి మంచి వ్యాపారమే జరుగుతోంది. ఈ దినోత్సవాల హడావుడి ప్రతీ బంధానికి ఉంది మరి. ఏదేమైనా ఈ దినం పేరుతో మంచి విలువల మననం, మంచి స్నేహితుల స్మరణం, మంచి మిత్రులకు అభివందనం చేసుకోవడం చాలా మంచిది. స్నేహాలు చిగురించడం, వృద్ధిచెందడం అనేది పరిస్థితులు, మనస్థత్వాలపై ఆధారపడి ఉంటుంది. మనమెందరో వ్యక్తులతో పరిచయాలు, సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాం, కాని నిజమైన స్నేహితులుగా కొందరికే స్థానమిస్తాం. అటువంటి స్నేహితులతో అన్ని విషయాలు చర్చించుకోగలుగుతాం.
స్నేహితుడు అంటేనే మంచిని కోరేవాడు. అవసరాలలో, ఆపదలలో ఆదుకునేవాడు నిజమైన స్నేహితుడు అంటారు. అవసరాలను, అవకాశాలను వెతుక్కొని చేరేవాడు బూటకపు స్నేహితుడు. స్నేహితులవల్ల అభివృద్ధి సాధించినవారు ఎంతోమంది ఉన్నారు. అలాగే అధోగతి పొందినవారు అంతేమంది ఉన్నారు. అలవాట్లు లక్షణాలుబట్టి స్నేహాలు కుదురుతాయి. స్నేహమనే బంధం అద్భుతమైనది. అది కుదిరిన వ్యక్తుల మధ్య ఏ శక్తీ విడదీయలేదు. ‘సత్సాంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వం జీవనముక్తి’ అన్నట్టు మన జీవన ఔన్నత్యానికి మంచి స్నేహం దోహదం చేస్తుంది. చెడు అలవాట్లతో చిగురించిన స్నేహం చివరకు అధోగతినే చూపిస్తుంది. మంచి స్నేహితులను పొందగలగడం పూర్వజన్మ సుకృతం.
విలువలు గల వ్యక్తులతో స్నేహం చేయడం, దాన్ని కలకాలం నిలుపుకునేలా ప్రయత్నించాలి. మనసుకు నచ్చని, ప్రమాదకరమైన వ్యక్తులతో స్నేహం చేసే కంటే ఒంటరితనం మేలు.. స్నేహం అంటే అహానికి ఆస్కారం లేకుండా హితాన్ని కూర్చే బంధం. మిత్రుడు అంటే సూర్యుడు. సూర్యుని కాంతివల్ల సకల చరాచర జీవరాశులు చైతన్యం పొందగలుగుతున్నాయి. మనం చైతన్యవంతులం కావాలంటే మంచి మితృలుండవలసిందే, ఆ చైతన్య బంధాన్ని నిలుపుకోవలసిందే. స్నేహబంధం నిలుపుకోవడంలో రబ్బరు కంకణాలు తొడగడం, గ్రీటింగ్ కార్డులు, బహుమతులు పంచుకోవడం, సామాజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలపడంలో చాలా మజా ఉంటుంది. నిజమైన స్నేహితునికి ఆత్మీయంగా పలకరిస్తూ కష్టసుఖాలను పంచుకోవడంలో సంతృప్తి ఉంటుంది. నిజమైన స్నేహానికి నిలువెత్తు సద్గుణాల పూలమాలతో అందాన్ని చేకూర్చి మైత్రీబంధపు సుగంధాలను పరిమళింపజేయాలి. స్నేహమనే బంధాన్ని తల్లిలో, తండ్రిలో, అన్నదమ్ములలో, సహచరులలో ప్రకృతిలో ప్రతీ అంశంలో జోడిస్తే విశ్వమంతా శాంతివనంగా మారుతుంది కదా!...

- చావలి శేషాద్రి సోమయాజులు