సబ్ ఫీచర్

అభివృద్ధికి నోచని సంచార జాతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలోని సంచార జాతులకు సంబంధించిన కులాలవారు అభివృద్ధి ఫలాలు అందక ఆర్థికంగా సామాజికంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. ఈ కులాల వారు అనాదిగా అడవులు, ప్రకృతి సిద్ధమైన వనరులపై ఆధారపడి జీవిస్తున్నారు. అమాయత్వం, నిరక్షరాస్యతతో అభివృద్ధికి ఆమడదూరంలో వుంటూ కష్టాలు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కులాలు 36 ఉన్నట్టు విముక్త సంచార జాతులుగా (డీనోటిఫైడ్ నోమాడిక్ ట్రైబ్స్)గా గుర్తించారు.
తెలంగాణలో సంచార జాతులకు చెందిన వడ్డెరలు ఇండ్ల పునాదులు, కాలవలు తవ్వుతు బండలు కొడుతూ బతుకు కొనసాగిస్తుండగా అడవులపై ఆధారపడి బుట్టలు అల్లడం, పందిర్లు వేస్తున్న మేదరులు, ఎద్దుల ఆటలతో గంగిరెద్దుల వారు, వాగుల్లో, వంకల్లో చేపలు పడుతూ పొట్టపోసుకుంటున్న బెస్తలు, జాలరులు, తీరైన వేషధారణతో ఇంటింటికి వచ్చి పిల్లా పాపలను అలరించే బహురూపులు, పాముల ఆటతో పాములోళ్లు, సర్కస్ విన్యాసాలతో దొమ్మర్లు, జంగంవాళ్లు, కాటికాపర్లు, కొరడాలతో ఎల్లమ్మలవాళ్లు, పెద్దమ్మలవాళ్లు, చాకలి, రజక కులస్తులు, రోడ్లపక్కన మూలికా వైద్యం చేసే మందుల వాళ్లు, వెంట్రుకలను సేకరించే బండ, మండి వాళ్ల, స్ర్తిల అలంకార వస్తువులు, చిన్నచితకా సామగ్రి అమ్మే పూసలవాళ్ళు, క్షవర సేవలందిస్తున్న నాయి బ్రాహ్మణులు, వాల్మీకి, బోయ, రాజనాల, గోత్రాలు, ఫకీర్, అత్తరు సాయిబు, జింక సాయిబు, కృష్ణబలిజ, కూనపులి, ఫతర్ ఫోడా, ఆరె మరాఠి, బొమ్మా, తలయారీ, చంద్రు కంజర, భట్ట, కెంపు మారె, పార్కి, ముగ్గుల, జోగి, వీరభద్రీయ, విముక్తి సంచార జాతుల కులాలపట్ల ఇంతకాలం రాష్ట్రాన్ని పాలించిన ఉమ్మడి పాలక ప్రభుత్వాలు అశ్రద్ధ చూపాయి.
బిసి (ఏ) గ్రూపుతో వున్న సంచార జాతుల కులాలైన మేదరి, వడ్డె, బెస్త, మందుల, వాల్మీకి బోయలు, కూనపులి, రజక,చాకలి కులస్తులు తమను ఎస్‌టీల్లో చేర్చాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. బాలసంతు, బహురూపి, కాటికాపరి, బుడబుక్కల, గంగిరెద్దుల, రాజన్న, పంబాల, మొండి, బండ, ఎల్లమ్మల, పెద్దమ్మల వాళ్లు నిరక్షరాస్యతతో ఎస్‌టి జాబితాలో చేర్చాల్సి వున్నా ప్రభుత్వాన్ని కోరేంత చైతన్యం లేక విద్యా వికాసాలకు దూరమవుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఎస్‌టిలుగా గుర్తింపు పొందిన వంజరులు తెలంగాణలో బిసి (డి) గ్రూపులోనే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల కాలంలో చేర్చబడ్డారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా అలాగే కొనసాగుతున్నారు.
దేశవ్యాప్తంగా వున్న విముక్త సంచార జాతులను గుర్తించి వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని నివేదించడానికి కేంద్ర ప్రభుత్వం 2005-2006లో నియమించిన బాలకృష్ణ రెనకే కమిషన్ తన నివేదికను 2008లో కేంద్రానికి సమర్పించినప్పటికీ గతంలో వున్న కేంద్ర ప్రభుత్వ పాలకులు ఏమాత్రం స్పందించలేదు. ప్రస్తుతం తాజాగా కేంద్రంలో వున్న మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో వున్న కెసిఆర్ ప్రభుత్వం సంచార జాతులకు సాయం చేద్దామని సంకల్పించితేనే తమకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు ఏళ్లయిన తరుణంలో న్యాయం చేకూరే అవకాశాలున్నట్టు సంచార జాతుల వారు భావిస్తున్నారు.
మహారాష్ట్ర, తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రంలోను ఈ సంచార జాతుల కులాలను బిసి జాబితానుండి వేరుచేసి విముక్త సంచార జాతులుగా ప్రత్యేక గ్రూపుగా ప్రకటించాలి. వెంటనే ఈ జాతుల అస్తిత్వం ఉనికిని గుర్తించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కమిషన్లను నియమించి, సమగ్ర అధ్యయనం చేసి ఎస్‌సి గ్రూపులో చేర్చాల్సిన వారిని ఎస్‌సిల్లో, ఎస్‌టి గ్రూపులో చేర్చాల్సిన వారిని ఎస్‌టిల్లో చేర్చడానికి సిఫార్సు చేయాలి. రాష్ట్రంలో వీరి కులాలకు విద్య, ఉద్యోగ అభివృద్ధి ఫలాలు అందించడానికి ప్రత్యేక పథకాలు అమలు చేయాలి. దీనికోసం ప్రత్యేక నిధులను ప్రతి ఏటా కేటాయించి వీరి సంక్షేమానికి కృషి చేయాలి. అప్పుడే తెలంగాణ ఉద్యమ కాలంలో బలిదానం చేసుకున్న 119 మంది సంచార జాతుల అమరుల ఆత్మలు శాంతిస్తాయి.

-హరి అశోక్‌కుమార్ టీబీసీ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు