సబ్ ఫీచర్

ఆత్మపరిశీలన.. అంటే ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎదుటివారి వైపు ఒక వేలు చూపెడితే, నాలుగు వేళ్ళు మనవైపు చూపెడుతుంటాయన్నది అందరికీ తెలిసిన సత్యం. రాజకీయ నాయకులు తమ తమ పార్టీల సమావేశాలలో, ఆత్మీయ సమ్మేళనాలలో ఈ సామెతను గుర్తుచేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సంస్థాగతంగా ప్రక్షాళన చర్యలు చేపడతారని రాజకీయ పరిశీలకులు భావించారు. కానీ అవేవీ జరుగుతున్న దాఖలాలు లేవు. కొన్ని జిల్లాలలో ఒక్క సీటుకూడా లభించక పార్టీ ఊడ్చిపెట్టుకుపోయిన వైనాన్ని చూసి కూడా సంబంధిత నేతలు నైతిక బాధ్యత వహించలేదు. పార్టీ పదవులకు రాజీనామాలు కూడా చేయలేదు.
ఇక, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యతగా పార్టీ అధ్యక్ష పదవిని స్వయంగా వదిలేశారు. పార్టీ సీనియర్ నాయకులు ఎంతగా నచ్చజెప్పినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిందిగా పార్టీ నాయకులకు రాహుల్ సూచించారు. అయితే, ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆత్మపరిశీలన చేసుకొనే పరిస్థితి తెలుగుదేశంలో పార్టీలో ఎక్కడా కనిపించడం లేదు. తమ పార్టీ ఓటమికి, వైకాపా విజయానికి భాజపా, తెరాస నాయకులు దోహదం చేశారనే నిందలు వేయడం తప్ప, ఐదేళ్ల పాలనలో తాము చేసిన స్వయంకృతాపరాధాలపై ఇప్పటికీ తెలుగుదేశం నాయకులు దృష్టిపెట్టకపోవడం ఆత్మపరిశీలనా లోపంగానే భావించాలి. ప్రత్యర్థి పార్టీ బలాబలాలను అంచనా వేయడానికి ప్రాధాన్యత నిచ్చేవారు తమ బలహీనతలు ఏమిటో గుర్తించకపోవడం సరైంది కాదు.
అయిదేళ్ళలో తాము అమలు చేసిన ‘సుపరిపాలన’ గూర్చి, ‘ప్రభుత్వ సంక్షేమ పథకాల’గూర్చి, పోలవరం, పట్టిసీమ, రాజధాని, కియా వంటి సంస్థల ఏర్పాటుగూర్చి ఇప్పటికీ కొండంతలు చెప్పుకుని దేశం నాయకులు తృప్తిచెందడం మరో విచిత్రం. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ చవిచూడని విధంగా ఓటమి చెందడానికి ప్రధానమైన కారణం- ‘కులాల మధ్య సమతుల్యత’ పాటించకపోవడం, బహుజన కులాలను దూరం పెట్టటం అనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ తన అయిదేళ్ల పాలనలో కేవలం ఒకే ఒక సామాజిక వర్గానే్న అందలం ఎక్కించిందన్న విమర్శ తీవ్ర స్థాయిలో ఉంది. దళిత, గిరిజన, వెనుకబడిన కులాలతోపాటు, క్రైస్తవ, మైనార్టీ కులాల వారిని ఆకర్షించలేక పోవడం తెదేపా తప్పిదమే. ఈ కులాలకు సంబంధించిన ఇద్దరికో, ముగ్గురికో ప్రాధాన్యత ఇచ్చారని అనుకున్నా, అది ‘స్వామిభక్తి’, ‘పరమ విధేయత’వంటి అర్హతలు ఉన్నవారికే పట్టం కట్టారన్నది నిజం. కాబట్టి వారెవరూ ఆయా కులాలకు చెందిన నిజమైన ప్రతినిధులు కాజాలరు.
ఆఖరికి చంద్రబాబు కొలువులో బాగా ప్రయోజనం పొందిన ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాలు సైతం తెదేపాను నమ్మలేదు. ఎన్జీవో నాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ఉద్యోగులు శాంతించలేదు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు తీర్మానం, కేంద్రం ప్రకటించిన అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లలో 5% కేటాయించడం, కాపు రిజర్వేషన్ ద్వారా వందల కోట్ల నిధులు ఇవ్వడం వంటి చర్యల వల్ల అటు కాపులూ దేశం పార్టీ పక్కన లేరు. ఫలితంగా 93 బీసీ కులాల వారు ఆ పార్టీకి దూరమయ్యారు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కేవలం 23 సీట్లతో ఓటర్లు సరిపెట్టారు. వీటితోపాటు చంద్రబాబు మళ్ళీ పాత తప్పిదాలనే చేశారన్న ఆరోపణలు లేకపోలేదు. అవి ఒకటి అభివృద్ధి, రెండు సంక్షేమం. అభివృద్ధి అందరికీ సంబంధించినది, దీర్ఘకాలిక ప్రయోజనాలతో కూడుకున్నది. సంక్షేమం అలాకాదు తక్షణం ప్రజల చేతుల్లోకో, జేబుల్లోకో వచ్చి పడేది.
చంద్రబాబు అభివృద్ధికే పెద్దపీట వేశారు. అధిక నిధులన్నీ అభివృద్ధికే కేటాయించారు. ‘విజన్’ల పేరిట 2002 అని, 2020 అని, 2050 అని సంకల్పాలు చేశారు. ‘బాహుబలి’ ప్రణాళికలతో ప్రగతిని నిర్వహించారు. సంక్షేమ పథకాలను అమలుచేసినా ‘తెలుగు తమ్ముళ్ళ’ వ్యవహారం ప్రతిబంధకంగా మారింది. ప్రజలు అభివృద్ధికి తమ అంగీకారం తెలిపినా, తమ గడపలోకి వచ్చే సంక్షేమ పథకాలవైపే ఎక్కువగా ఆశపడ్డారు. జగన్మోహన్‌రెడ్డి ‘నవరత్నాల’ పేరిట పాదయాత్రలో కానీ, ఎన్నికల ప్రచారంలో కానీ అన్నీ సంక్షేమ పథకాలనే గుప్పించారు. అన్ని కులాలతో నేరుగా కలిసిపోయి, చేతిలో చేయివేసి జగన్ మాటిచ్చారు. బీసీలను, మైనార్టీలను, క్రిస్టియన్లను, మహిళలను దగ్గరకు తీశారు. తెలుగుదేశం పార్టీలో లోపించింది ఇదే. చంద్రబాబు దక్షతను కాసేపు ప్రక్కన పెడితే, మిగిలిన పార్టీ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, అసెంబ్లీ సెగ్మెంట్ల నాయకులు అందరూ ‘ఒకే కులం’ పడవపై ప్రయాణించారు. మిగిలిన ఏ ఒక్క పేద కులాన్నీ దరిచేరనీయలేదు సరికదా వారి ఆత్మగౌరవాన్ని కూడా భంగపరిచారు. అందుకే నిమ్న కులాలన్నీ వైకాపాకు భారీగా ఓట్లేసి గెలిపించాయి. ఇంత జరిగాక కూడా తెలుగుదేశం పార్టీలో మార్పులేదు. ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు వారి సొంత సామాజిక వర్గానే్న తలకెత్తుకుని ఊరేగటం జరుగుతోంది. ఏ వ్యక్తులను, ఏ నాయకులను ప్రజలు ఎన్నికల్లో చీదరించుకొన్నారో మళ్ళీ వారే జనం దగ్గరకు రావటం మారని దేశం వైఖరికి నిదర్శనం. చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, పరిపాలనా దక్షత పట్ల ఏపి ప్రజలకు అపనమ్మకం ఏ మాత్రం లేదు. దేశం పార్టీ ఓడినా, సీమాంధ్ర ప్రజలు చంద్రబాబుపై సానుభూతి చూపించడం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వం ఓడిన తరువాత 12 జిల్లాల నుండి ప్రజలు తండోప తండాలుగా ఆయన దగ్గరకువెళ్ళి సానుభూతిని, గుండె ధైర్యాన్ని వ్యక్తం చేశారు. బాబుపట్ల ప్రజలకు ఇప్పటికీ నమ్మకముందనే దీని అర్థం. అయినా- తెలుగుదేశం పార్టీ ఒక వర్గం పార్టీగా ఎందుకు ముద్ర వేసుకుంది? మూడు దశాబ్దాలు దాటినా ఈ ముద్ర పోదా? ఈ ‘ముద్ర’ నుండి తెలుగుదేశం పార్టీ బయటపడాలి. బడుగువర్గాల వాడల్లోకి వెళ్ళి వారి పక్కన కూర్చుని వారి దైనందిన అవసరాలపై విశే్లషణ చేస్తూ సహచర్యం చేయగలగాలి. మెజారిటీ కులస్థులను రాజకీయంగా శక్తివంతులుగా తీర్చిదిద్దాలి. పార్టీ పదవులను ఏ స్థాయిలో అయినా కింది కులాల వారికి విధిగా ఇచ్చితీరాలి. ఇలా పార్టీని ప్రక్షాళన చేయనంతవరకూ- తెదేపా మనుగడ ప్రశ్నార్థకం కాగలదు.

-పోతుల బాలకోటయ్య 98497 92124